కార్పొరేట్‌కు వ్యవ‘సాయం’!

ABN , First Publish Date - 2020-09-25T11:00:52+05:30 IST

వ్యవసాయ రంగానికి సంబంధించి పార్లమెంటు ఆమోదించిన బిల్లులు కార్యరూపం దాల్చితే ఎంతో మేలు జరుగుతుందంటూ కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవన్న అభిప్రాయం జిల్లా రైతుల్లో వ్యక్తం అవుతున్నది.

కార్పొరేట్‌కు వ్యవ‘సాయం’!

ఆ 3 బిల్లులపై నిపుణుల ఆందోళన

అన్నదాతకు శరాఘాతం...సామాన్యుడికి ధరాఘాతం

జిల్లాలో సన్న, చిన్నకారు రైతులకు తీవ్ర నష్టం

మార్కెట్‌ యార్డులు, సహకార వ్యవస్థ నిర్వీర్యం

కేంద్రం తీరుపై మండిపడుతున్న రైతు సంఘాలు

నిత్యావసర సరకుల చట్ట సవరణతో ఆహార భద్రతకూ ముప్పు

ధరలు విపరీతంగా పెరిగిపోయే అవకాశం

భవిష్యత్తులో ‘మద్దతు ధర’ ఎత్తివేసే ఎత్తుగడని వామపక్షాల ఆరోపణ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వ్యవసాయ రంగానికి సంబంధించి పార్లమెంటు ఆమోదించిన బిల్లులు కార్యరూపం దాల్చితే ఎంతో మేలు జరుగుతుందంటూ కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవన్న అభిప్రాయం జిల్లా రైతుల్లో వ్యక్తం అవుతున్నది. మరోవైపు ఈ బిల్లుల వల్ల రైతుల ఉనికికే ముప్పు ఏర్పడుతుందని, వ్యవసాయ రంగం సంక్షోభంలో పడుతుందని వ్యవసాయ రంగ నిపుణులు, ప్రజా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వీటివల్ల ఇటు పంటలకు కనీస మద్దతు ధర లభించక రైతులు, అటు ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. 


దేశంలో వ్యవసాయం చేస్తున్న వారిలో 80 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే. మిగిలిన పెద్ద రైతుల్లో అతి కొద్దిమంది మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు. ఎక్కువ మంది భూములను కౌలుకు ఇచ్చేశారు. విశాఖ జిల్లాలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి.

  

మరింత అప్పుల ఊబిలో అన్నదాతలు

జిల్లాలో అత్యధిక శాతం మంది రైతులు తాము పండించిన పంటలను మార్కెట్‌ యార్డుల్లో లేదా గ్రామాలకు వచ్చే వ్యాపారులకు/దళారులకు విక్రయిస్తుంటారు. ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ/ఎఫ్‌సీఐ వ్యవసాయ మార్కెట్‌ యార్డులు, సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేస్తుంటాయి. పప్పు దినుసులను మార్క్‌ఫెడ్‌, ఏజెన్సీలో అటవీ, వ్యవసాయ ఉత్పత్తులను జీసీసీ వంటి సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. ఈ విధానం, ఆయా సంస్థలు చెల్లిస్తున్న ధరలు రైతులకు కొంతమేర ఉపశమనం కలిగిస్తున్నాయి. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటిస్తున్న మద్దతు ధరలు తమకు ఏమాత్రం గిట్టుబాటు కావని, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంట పెట్టుబడి వ్యయానికి 50 శాతం జోడించి మద్దతు ధరలు ప్రకటించాలని రైతులు ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తున్నారు. కానీ ఇంతవరకు అమలు చేయలేదు. జిల్లాలో వరి, చెరకు ప్రధాన పంటలు. ధాన్యం, బెల్లం, చెరకుకు గిట్టుబాటు ధరలు లభించేలా చూడాలని రైతులు ఎంతోకాలంగా కోరుతున్నారు. తరచూ ఆందోళనలు కూడా నిర్వహిస్తున్నారు. అయినా ఫలితం వుండడం లేదు. మూలిగే నక్కపై తాడిపండు పడ్డ చందంగా...ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో వున్న రైతులు...మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయేలా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకువస్తున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


మార్కెట్‌ యార్డులు నిర్వీర్యం

కొత్త చట్టం ద్వారా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకోవచ్చునని కేంద్రం చెబుతున్నదని, కానీ భవిష్యత్తులో కనీస మద్దతు ధరలు అమలుచేయకుండా తప్పించుకునే ప్రమాదం వుందని రైతు సంఘాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. ‘కొత్త చట్టం అమల్లోకి వస్తే కార్పొరేట్‌ సంస్థలు తొలుత ప్రభుత్వ మద్దతు ధరల కంటే కొంచెం ఎక్కువ చెల్లించి పంటలు కొనుగోలు చేస్తాయి. దీంతో రైతులు మార్కెట్‌ యార్డుల్లో, ఎఫ్‌సీఐ కొనుగోలు కేంద్రాల్లో, జీసీసీకి, ప్రైవేటు వ్యాపారులకు అమ్మడానికి ఆసక్తి చూపరు. ఫలితంగా మార్కెట్‌ యార్డులు, ఆయా సంస్థలు నిర్వీర్యం అవుతాయి. తరువాత కార్పొరేట్‌ కంపెనీలు ధరలను తమ గుప్పెట్లో పెట్టుకుంటాయి. ప్రత్యామ్నాయం లేకపోవడంతో వారు చెప్పిన ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడుతుంది. దీంతో పెట్టుబడి కూడా దక్కక అప్పులపాలవుతారు’...అని అనకాపల్లికి చెందిన రైతు సంఘం నాయకుడొకరు విశ్లేషణాత్మకంగా చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించే చట్టానికి కూడా భవిష్యత్తులో సవరణలు చేసి, నిర్వీర్యం చేసే ప్రమాదం వుందని అంటున్నారు.


సామాన్య ప్రజలకు ధరాఘాతం

ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, వంట నూనెలు ఇప్పటివరకు నిత్యావసర వస్తువుల జాబితాలో ఉన్నాయి. వ్యాపారులు నిర్ణీత మొత్తం మాత్రమే వీటిని కొనుగోలు చేసి, నిల్వ చేసుకోవాలి. అయితే కొత్త చట్టంతో వీటి కొనుగోళ్లు, నిల్వలపై నియంత్రణను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేస్తున్నది. కార్పొరేట్‌ కంపెనీలు, పెద్ద వ్యాపారులు, మిల్లర్లు తమ స్థోమత మేరకు కొనుగోలు చేసి నిల్వ చేసుకోవచ్చు. దీంతో నిత్యావసర సరకులన్నీ కొద్ది మంది చేతుల్లోనే ఉంటాయి. ధరలను తమ గుప్పెట్లో పెట్టుకుని మార్కెట్‌ను శాసిస్తారని దీనివల్ల నిత్యావసర సరకుల ధరలు సామాన్యులకు అందుబాటులో వుండవని, చివరకు ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


కార్పొరేట్‌ చేతుల్లోకి వ్యవసాయం: ఆర్‌.జగ్గారావు, ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం

కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ శక్తులకు వ్యవసాయాన్ని ధారాదత్తం చేస్తున్నది. ఇప్పటివరకు వ్యవసాయ రంగానికి అండగా వున్న పలు శాఖలు, సంస్థలు మరింత సమర్థంగా పనిచేయడానికి యత్నించకుండా, వాటిని నిస్తేజపరిచేలా ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం తీరు వల్ల ఇటు వ్యవసాయ రంగానికి, అటు ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది.


అన్నదాతకు తీవ్ర నష్టం: ఎ.బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి, జిల్లా కౌలు రైతుల సంఘం 

దేశంలో 80 శాతం ప్రజలు ఆధారపడిన వ్యవసాయ, అనుబంధ రంగాలను కార్పొరేట్‌ శక్తులకు అప్పగించాలని కేంద్రం నిర్ణయించడం దారుణం. పార్లమెంటు ఆమోదించిన బిల్లులు చట్టరూపం దాల్చితే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. వ్యవసాయం ‘రాష్ట్ర జాబితా’లో ఉంది. దీనిని కేంద్రం బలవంతంగా తీసుకుంటున్నది. ఫలితంగా మార్కెట్‌ యార్డులు, వ్యవసాయ పరపతి సంఘాలు, సహకార బ్యాంకులు నిర్వీర్యం అవుతాయి. 


వ్యవసాయ కూలీలకు ఉపాధి కరువు: పీఎస్‌ అజయ్‌కుమార్‌, జాతీయ కార్యదర్శి, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం

దేశ వ్యవసాయ రంగాన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ శక్తులకు అప్పగించడానికి మోదీ ప్రభుత్వం ఈ మూడు బిల్లులను తీసుకువచ్చింది. వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్‌ కంపెనీలు ప్రవేశిస్తే యాంత్రీకరణ పెరుగుతుంది. ఫలితంగా గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి లేకుండా పోతుంది. పర్యావరణ నియంత్రణ లేని పరిశ్రమలు ఎంత ప్రమాదమో...ఎలాంటి నియంత్రణలేని వ్యవసాయ కార్పొటీకరణ కూడా అంతే ప్రమాదకరం. 

Updated Date - 2020-09-25T11:00:52+05:30 IST