-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » FACTORIES SHUTDOWN
-
పరిశ్రమలు షట్‌డౌన్
ABN , First Publish Date - 2020-03-24T08:49:55+05:30 IST
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా నగర పరిధిలో గల పలు పరిశ్రమలను ఈ నెల 31వ తేదీ వరకూ మూసివేయాలని నిర్ణయించారు. ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులకు హెచ్‌పీసీఎల్, షిప్‌యార్డులు...

- హెచ్‌పీసీఎల్, షిప్‌యార్డు, కోరమాండల్, నావల్ డాక్‌యార్డు,
- షిప్ బిల్డింగ్ సెంటర్, బ్రాండిక్స్, బెల్ హెచ్‌పీవీపీల్లో 31 వరకూ పనులు నిలిపివేత
- దువ్వాడ వీఎస్‌ఈజెడ్‌లోని 59 పరిశ్రమలు కూడా...
- పరవాడ ఫార్మా సిటీలో పలు కంపెనీలు బంద్
- అత్యవసర విభాగాల వారికి మినహా మిగతా వారందరికీ సెలవులు
- సుమారు 70 వేల మందికి ఇళ్లకే పరిమితం
మల్కాపురం/అక్కిరెడ్డిపాలెం/కూర్మన్నపాలెం/పరవాడ, మార్చి 23:
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా నగర పరిధిలో గల పలు పరిశ్రమలను ఈ నెల 31వ తేదీ వరకూ మూసివేయాలని నిర్ణయించారు. ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులకు హెచ్‌పీసీఎల్, షిప్‌యార్డులు నెలాఖరు వరకూ సెలవులు ప్రకటించాయి. సోమవారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవులు ప్రకటించినట్టు యాజమాన్యాలు పేర్కొన్నాయి. ఇక హెచ్‌పీసీఎల్‌లో 150 మంది ఉద్యోగులకు పూర్తిగా సెలవులు ఇవ్వగా, ఆపరేషన్ విభాగాల్లో పనిచేసేవారు రొటేషన్ పద్ధతిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. జనరల్ ఉద్యోగులకు మాత్రం సెలవులు ఇచ్చారు. ఈ సంస్థ విస్తరణ పనుల్లో దాదాపు 20 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ఈ 20 వేల మందికీ కూడా సెలవులు ప్రకటించారు. ఇక షిప్‌యార్డులో 1500 మంది ఉద్యోగులు వుండగా, అందరికీ సెలవులు ప్రకటించారు. మరో 800 మంది కాంట్రాక్టు కార్మికులు, సొసైటీ కార్మికులకు కూడా సెలవులు ప్రకటించారు. అత్యవసర విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరవుతారు. నేవల్ డాక్‌యార్డులో 4,200 మంది ఉద్యోగులు, దాదాపు ఐదు వేల మంది కాంట్రాక్టు కార్మికులకు సెలవులు ప్రకటించారు. విద్యుత్, ఫైర్ అండ్ సేఫ్టీ, మంచినీటి విభాగంలో విధులు నిర్వహించేవారు మాత్రమే డ్యూటీలో ఉంటారు. ఈ నెల 31 వరకు యుద్ధనౌకల్లో గానీ సబ్‌మెరైన్‌లలో గానీ సివిల్ ఉద్యోగులు విధులు నిర్వహించడానికి వీలు లేదని ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే ఒక్క నేవల్ ఉద్యోగులు మాత్రమే విధులు నిర్వహిస్తారు. దీన్నిబట్టి చూస్తే డాక్‌యార్డుకు కూడా పూర్తిస్థాయిలో సెలవులు ప్రకటించినట్టే. అత్యవసరమైతే ఆయా విభాగాల అధికారులు ఫోన్ చేస్తారు. అప్పుడు ఆ ఉద్యోగులు వచ్చి విధులు నిర్వహించాలి. కోరమాండల్ ఎరువుల కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికులకు పూర్తిగా సెలవు ప్రకటించారు. ఉద్యోగులు మాత్రం రొటేషన్ పద్ధతిలో విధులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టారు. ఓటీలను రద్దు చేశారు. ఇక అచ్యుతాపురం ఎస్‌ఈజడ్‌లోని ‘బ్రాండిక్స్’ కంపెనీలో సుమారు 20 వేల మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి వారం పాటు కంపెనీలోని అన్ని యూనిట్లను మూసివేస్తున్నట్టు నాలుగు రోజుల క్రితమే యాజమాన్యం ప్రకటించింది.
షిప్ బిల్డింగ్ సెంటర్ (ఎస్‌బీసీ) క్లోజ్
డాక్‌యార్డు అనుసంధానమైన షిప్ బిల్డింగ్ సెంటర్ (ఎస్‌బీసీ)ని సోమవారం నుంచి పూర్తిగా క్లోజ్ చేశారు. ఈ సంస్థలో రెండు వేల మంది ఉద్యోగులు, నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 31 వరకు సెలవుల ప్రకటించిన నేపథ్యంలో ప్రధాన గేట్లకు తాళాలు వేసేశారు.
బెల్ హెచ్‌పీవీపీ కూడా...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈనెల 31 వరకు ఉత్పత్తి నిలిపి వేస్తున్నట్టు బెల్ హెచ్‌పీవీపీ యాజమాన్యం సోమవారం ప్రకటించింది. కరోనా వైరస్ కార్మికులకు సోకకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈనెల 23 నుంచి 31 వరకు పనులు నిలిపివేయనున్నారు. కర్మాగారంలో మొత్తం 876 మంది కార్మికులు, అధికారులు, ఇతర ఉద్యోగులు వుండగా, వీరిలో అత్యవసర సర్వీసుల సిబ్బంది సుమారు 85 మంది ఉంటారు. ఈ 85 మంది మాత్రం విధులకు హాజరవుతారని తెలిపారు.
వీఎస్‌ఈజెడ్‌లో 59 పరిశ్రమలు బంద్
దువ్వాడలోని విశాఖపట్నం ప్రత్యేక ఆర్థిక మండలి (వీఎస్‌ఈజడ్)లో గల 63 పరిశ్రమల్లో ఫార్మాస్యూటికల్ సంబంధిత పరిశ్రమలు నాలుగు (కార్నీలియన్, లీ ఫార్మా, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్) మాత్రమే పనిచేస్తున్నాయని కమిషనర్ ఆవుల రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మిగిలిన 59 పరిశ్రమలు మార్చి 31 వరకు లాక్‌డౌన్‌లో ఉంటాయన్నారు. వీఎస్‌ఈజడ్ పరిధిలోని పరిశ్రమల్లో 3,931 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరిలో 300 మంది ఫార్మా ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తున్నామని తెలిపారు. ఇక 190 ఎక్స్‌పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్లలో 54 పనిచేస్తాయన్నారు. కొన్ని పరిశ్రమలను అత్యవసర పనులు నిమిత్తం (చందు సాఫ్ట్‌వేర్, ఫ్లూయింట్ గ్రిడ్, ఈజిఎస్ ఇన్ఫోటెక్‌లకు) అనుమతులు ఇచ్చామన్నారు. కొన్ని ఐటీ పరిశ్రమల ఉద్యోగులు తమ ఇళ్ల నుంచే విధులు నిర్వహిస్తారన్నారు.
పలు ఫార్మా కంపెనీలు లాక్‌డౌన్
కరోనా వైరస్ నేపథ్యంలో ఫార్మాసిటీలోని పలు పరిశ్రమలు మంగళవారం నుంచి ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించాయి. కార్మికులెవరూ విధులకు హాజరు కానవసరం లేదని స్పష్టంచేశాయి. ప్రస్తుతం ఫార్మాసిటీలో 82 కంపెనీల్లో ఉత్పత్తి జరుగుతుంది. వీటిల్లో కొన్ని కంపెనీలు ఉత్పత్తి స్లోడౌన్ చేసేందుకు చర్యలు చేపట్టాయి. కంపెనీలో జరుగుతున్న ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి ఉద్యోగులు, కార్మికులు విధులకు హాజరు కావాల్సి వుంటుందని ఓ ఫార్మా కంపెనీ ప్రతినిధి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. స్లోడౌన్ జరిగేందుకు కనీసం రెండు రోజులు పడుతుందని చెబుతున్నారు. అలాగే ముఖ్యమైన ఔషఽధ తయారీ ఉత్పత్తులు చేస్తున్న ఫార్మా కంపెనీలు తక్కువ సిబ్బందితో పనిచేస్తాయని ప్రకటించారు. ఫార్మా సిటీలో సుమారు పదిహేను వేల మంది ఉద్యోగులు/కార్మికులు వుండగా మంగళవారం నుంచి ఏడు వేల మంది సెలవులో ఉండనున్నారు.
సంస్థ ఉద్యోగులు/కార్మికులు
హెచ్‌పీసీఎల్ 20,150
బ్రాండిక్స్ 20,000
షిప్‌యార్డు 2,300
నేవల్ డాక్‌యార్డు 9,200
షిప్ బిల్డింగ్ సెంటర్ 6,000
బెల్ హెచ్‌పీవీపీ 876
వీఎస్‌ఈజెడ్ 3,631
ఫార్మాసిటీ 7,000