ఫేస్‌బుక్‌

ABN , First Publish Date - 2020-12-01T06:21:41+05:30 IST

వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న సిద్ధార్థ ఫేస్‌బుక్‌ మెసెంజర్‌కు గతంలో విశాఖలో పనిచేసి, ప్రస్తుతం శ్రీకాకుళంలో పనిచేస్తున్న అతనికి పరిచయస్తుడైన ఒక వైద్యుడి పేరిట...ఒక మెసేజ్‌ వచ్చింది.

ఫేస్‌బుక్‌

‘ఫేస్‌ బుక్‌’లో ప్రొఫైల్‌ను అడ్డంపెట్టుకుని నేరాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లు 

నకిలీ మెసెంజర్‌ ప్రొఫైల్స్‌ తయారీ

ఫ్రెండ్స్‌ జాబితాలోని వారందరికీ మెసేజ్‌లు

ఆపదలో ఉన్నాం...డబ్బులు పంపాలంటూ అభ్యర్థన

గూగుల్‌పే, ఫోన్‌ పే ద్వారా అంటూ ఫోన్‌ నంబర్‌ పంపుతున్న వైనం

తెలిసినవారే కదా...అనే భావనతో డబ్బులు పంపుతున్న అమాయకులు

నగరంలో పెరుగుతున్న కేసులు

అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు


(విశాఖపట్నం-ఆంఽధ్రజ్యోతి)

వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న సిద్ధార్థ ఫేస్‌బుక్‌ మెసెంజర్‌కు గతంలో విశాఖలో పనిచేసి, ప్రస్తుతం శ్రీకాకుళంలో పనిచేస్తున్న అతనికి పరిచయస్తుడైన ఒక వైద్యుడి పేరిట...ఒక మెసేజ్‌ వచ్చింది. తాను అత్యవసర పరిస్థితిలో వున్నానని, రూ.20 వేలు పంపాలన్నది ఆ మెసేజ్‌ సారాంశం. నిజమేనని భావించిన సిద్ధార్థ తన వద్ద వున్న రూ.2,500ని గూగుల్‌పే ద్వారా పంపించేందుకు ఫోన్‌ నంబర్‌ను వెరిఫై చేయగా...అది బిహార్‌కు చెందిన వ్యక్తిదిగా తేలింది. దీంతో అనుమానం వచ్చిన సిద్ధార్థ నేరుగా సదరు వైద్యుడికి ఫోన్‌ చేసి ఆరా తీయగా ఆయన ఖాతాను ఎవరో హ్యాక్‌ చేసినట్టు తేలింది.


ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసే గోపీకి కూడా అదే తరహాలో ఒక మెసేజ్‌ వచ్చింది. అయితే ఎవరి పేరుతోనైతే మెసేజ్‌ వచ్చిందో...ఆ వ్యక్తి రెండు రోజుల కిందటే తన ఫేస్‌బుక్‌ ఖాతాను ఎవరో హ్యాక్‌ చేసి, డబ్బులు కావాలంటూ మెసేజ్‌లు పెడుతున్నారంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టడంతో గోపీ సైబర్‌ నేరగాడి వలలో చిక్కకుండా తప్పించుకోగలిగారు.


...ఈ తరహా మోసాలు నగరంలో పెరిగిపోతున్నాయి. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారుల్లో అత్యధికులు ఫేస్‌బుక్‌ అకౌంట్‌ కలిగి ఉంటున్నారు. అయితే తమ ఖాతాను ఇతరులు హ్యాక్‌ చేయడానికి వీల్లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను విస్మరిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు దానినే తమకు అనుకూలంగా మలచుకుని మోసాలకు పాల్పడుతున్నారు. లాక్‌ చేయని ఫేస్‌బుక్‌ ప్రొఫైల్స్‌ను సైబర్‌ నేరగాళ్లు ఓపెన్‌ చేసి అందులో వున్న సమాచారం ఆధారంగా నకిలీ ఫేస్‌బుక్‌, మెసెంజర్‌ ప్రొఫైల్స్‌ను క్రియేట్‌ చేస్తున్నారు. హ్యాక్‌ చేసిన వ్యక్తి పూర్తిపేరుతోపాటు వారి ఫొటోనే ప్రొఫైల్‌గా పెడుతున్నారు. దీని ఆధారంగా అతడి ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌గా వున్నవారందరికీ ‘హాయ్‌...’అంటూ మెసేజ్‌ పంపుతున్నారు. తెలిసిన వ్యక్తి నుంచి మెసేజ్‌ వచ్చింది కదా...అనే భావనతో ఎవరైనా రిప్లయ్‌ ఇస్తే...వెంటనే తాను ఆపదలో చిక్కుకున్నానని, అత్యవసరంగా డబ్బు అవసరం పడినందున రూ.20 వేలు పంపాలంటూ మెసేజ్‌ పంపిస్తున్నారు. సానుకూలంగా ఎవరైనా స్పందిస్తే వెంటనే ఒక ఫోన్‌ నంబర్‌ను పంపించి, ఆ నంబర్‌కు గూగుల్‌పే లేదా ఫోన్‌పే ద్వారా పంపాలంటూ కోరుతున్నారు. నిజంగా తమకు తెలిసిన వ్యక్తి ఆపదలో వున్నాడేమోనన్న భావనతో ఎవరైనా డబ్బులు పంపిస్తే...ఆ తర్వాత అటు నుంచి స్పందన వుండడం లేదు. ఆ విషయం హ్యాక్‌కు గురైన ఖాతా గల వ్యక్తికి ఎవరో ఒకరు చెప్పేంత వరకూ తెలియదు కాబట్టి, ఈలోగా వీలైనంత ఎక్కువ మంది నుంచి డబ్బులు గుంజేస్తున్నారు. తర్వాత ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌ అయిన వ్యక్తికి తెలిసినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయడం, తన స్నేహితులకు తన ఖాతా హ్యాక్‌కు గురైందంటూ మెసేజ్‌ చేయడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటోంది. టెక్నాలజీ మీద అవగాహన కలిగిన కొంతమంది మాత్రం ఇలాంటి మెసేజ్‌లు రాగానే ట్రూ కాలర్‌లో లేదా గూగుల్‌పే నంబర్‌ వెరిఫికేషన్‌లో పేరును క్రాష్‌ చెక్‌ చేసుకుంటున్నారు. పేరు తేడా రాగానే తమ స్నేహితులకు ఫోన్‌ చేస్తున్నారు. తెలియనివారు మాత్రం డబ్బులు పంపించేసి మోసపోతున్నారు. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న వారిలో అత్యధికులు ఉత్తర భారత దేశానికి చెందినవారితోపాటు నైజీరియా దేశస్థులు ఉంటున్నారు. డబ్బు కోసం మెసెంజర్‌లో పంపించే నంబర్‌ను వెరిఫై చేస్తే సులభంగా వారికి చెక్‌ పెట్టవచ్చు. మనతో చాటింగ్‌ చేసిన వ్యక్తి పేరు ఒకటైతే...డబ్బులు పంపాలని కోరే నంబర్‌తో వుండే గూగుల్‌, ఫోన్‌పే అకౌంట్‌ వేరొకరి పేరుతో ఉంటుంది. కాబట్టి ఎవరికైనా డబ్బులు పంపితే నంబర్‌ను వెరిఫై చేసుకోవడం తప్పనిసరి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.


ప్రొఫైల్‌ను లాక్‌ చేసుకోవాలి

ఆర్‌వీకే చౌదరి, సైబర్‌ క్రైమ్‌ సీఐ

ఫేస్‌బుక్‌ అకౌంట్‌ కలిగిన ప్రతి ఒక్కరూ తమ ప్రొఫైల్‌ను లాక్‌ చేసుకోవాలి. చాలామందికి ఆ ఆప్షన్‌ వున్న విషయం కూడా తెలియదు. దీనివల్ల మోసాలతోపాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు వారి ఫేస్‌బుక్‌ ఖాతాను ఉపయోగించుకునే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఎవరికైతే డబ్బులు పంపాలనుకుంటున్నామో... అతడి నంబర్‌ను ముందు వెరిఫై చేసుకోవాలి. అవతలి వ్యక్తికి ఫోన్‌ చేసి నిర్ధారించుకోవాలి. అన్నీ సరిపోతేనే డబ్బులు పంపించాలి. ఈ తరహా మోసంలో ఫిర్యాదులు వచ్చినా నిందితుడిని గుర్తించడం చాలా క్లిష్టమైన విషయం.

Updated Date - 2020-12-01T06:21:41+05:30 IST