-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Exciting tourist places
-
కళకళలాడిన పర్యాటక ప్రదేశాలు
ABN , First Publish Date - 2020-12-27T06:33:14+05:30 IST
మన్యంలో శనివారం పర్యాటకులు సందడి చేశారు. అరకులోయ, లంబసింగి, కొత్తపల్లి జలపాతాలకు పర్యాటకుల తాకిడి అధికంగా ఉంది.

ప్రకృతి సోయగాలను ఆస్వాదించిన పర్యాటకులు
అరకులోయ/చింతపల్లి/పాడేరురూరల్, డిసెంబరు 26: మన్యంలో శనివారం పర్యాటకులు సందడి చేశారు. అరకులోయ, లంబసింగి, కొత్తపల్లి జలపాతాలకు పర్యాటకుల తాకిడి అధికంగా ఉంది. అరకులోయలోని పర్యాటక కేంద్రాలు సందర్శకులతో కళకళలాడాయి. శనివారం ఉదయం నుంచే పర్యాటకులు కాఫీతోటలు, గాలికొండ వ్యూపాయింట్, మ్యూజియం, పద్మాపురం గార్డెన్, కాఫీ మ్యూజియంను పర్యాటకులు పెద్ద ఎత్తున సందర్శించారు. ఇక, రిసార్టులు, లాడ్జీలు ఫుల్ కావడంతో పలువురు టెంట్‌లలో బసచేసేందుకు మొగ్గు చూపారు.
ఆంధ్రా కశ్మీర్ లంబసింగి, చెరువులవేనం ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. శనివారం వేల సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. ఉదయం ఆరు గంటల నుంచి లంబసింగి, తాజంగి, చెరువులవేనం ప్రధాన రహదారులు పర్యాటకులతో కళకళలాడాయి. మంచు అందాలను ఆస్వాదిస్తూ సెల్ఫీలను తీసుకునేందుకు పోటీపడ్డారు.
పాడేరు పట్టణం పర్యాటకులతో సందడిగా మారింది. మన్యంలోని పర్యాటక ప్రాంతాలను పర్యాటకులు సందర్శించి, పాడేరు పట్టణంలో మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం స్థానికంగా బస చేశారు. పట్టణంలో లాడ్జీలు, భోజన, టిఫిన్ హోటల్స్ రద్దీగా మారాయి.