విద్యుత్ సబ్‌స్టేషన్ల సామర్థ్యం పెంచాలి
ABN , First Publish Date - 2020-12-30T05:36:58+05:30 IST
వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ 24/7 సరఫరా చేయాలని ఇంధన శాఖ కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ నాగులాపల్లి శ్రీకాంత్ సూచించారు
ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్
విశాఖపట్నం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ 24/7 సరఫరా చేయాలని ఇంధన శాఖ కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ నాగులాపల్లి శ్రీకాంత్ సూచించారు. విశాఖపట్నం వచ్చిన ఆయన ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఐదు జిల్లాల ఎస్‌ఈలు, ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ డిమాండ్, సప్లయ్‌లకు తగినట్టుగా అన్ని జిల్లాల్లోను విద్యుత్ సబ్‌స్టేషన్ల సామర్థ్యం పెంచాలని సూచించారు. గత ఐదేళ్ల విద్యుత్ సరఫరా, పంపిణీ సామర్థ్యాల ఆధారంగా రాబోయే ఐదేళ్లకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకుని, ఆ మేరకు చర్యలు చేపట్టాలన్నారు. వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు త్వరితంగా మీటర్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా, పంపిణీలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ఈపీడీసీఎల్, ఏపీ ట్రాన్స్‌కో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యుత్ పంపిణీ నష్టాలను మరింత తగ్గించేందుకు ప్రయత్నించాలన్నారు. ఈ సమావేశంలో ఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మి సెల్వరాజన్, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ శ్రీధర్ రెడ్డి, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ జేఎండీ కె.వెంకటేశ్వరరావు, డైరెక్టర్లు ప్రవీణ్‌కుమార్, ముత్తుపాండ్యన్, రాజబాపయ్య, రమేశ్‌ప్రసాద్, డి.చంద్రం, సీజీఎంలు, ఎస్‌ఈలు పాల్గొన్నారు.