జీతం ఇక్కడ.. సేవలు అక్కడ...

ABN , First Publish Date - 2020-11-19T05:51:10+05:30 IST

దేవదాయ శాఖలో అధికారులు నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు తిలోదకాలిచ్చి ఆలయ ఉద్యోగులను ఇతర సేవలకు ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి జీతం ఇస్తూ...వేరి వారికి ఊడిగం చేయిస్తున్నారు.

జీతం ఇక్కడ..  సేవలు అక్కడ...

ఇదీ దేవదాయ శాఖ తీరు

శారదా పీఠానికి కనకమహాలక్ష్మి దేవస్థానం వేదపండితుడు

మరో రెండు ఆలయాల్లో ఉద్యోగులను

డ్రైవర్లుగా ఉపయోగించుకుంటున్న 

మరో అధికారి


విశాఖపట్నం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి):

దేవదాయ శాఖలో అధికారులు నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు తిలోదకాలిచ్చి ఆలయ ఉద్యోగులను ఇతర సేవలకు ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి జీతం ఇస్తూ...వేరి వారికి ఊడిగం చేయిస్తున్నారు. కనక మహాలక్ష్మి దేవస్థానంలో వేద పండితుడైన ఒక ఉద్యోగిని ఏకంగా శారదా పీఠానికి అప్పగించేశారు. జీతం ఇక్కడ...సేవలు అక్కడ. పీఠంలో కీలక వ్యవహారాలన్నీ ఆయనే చూస్తున్నారు. పీఠం ప్రైవేటు సంస్థ కిందకే వస్తుంది. వారి పనులకు వారే సిబ్బందిని నియమించుకోవాలి. కానీ ప్రభుత్వ ఉద్యోగులను వారి సేవలకు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది.


ఇకపోతే సంగివలసలో ముగ్గురు దేవతల ఆలయ ఉద్యోగిని, జ్ఞానాపురం ఎర్నిమాంబ ఆలయ ఉద్యోగిని మరొకరు వాహన డ్రైవర్లుగా ఉపయోగించుకుంటున్నారు. నగరంలో వైసీపీ ఇన్‌చార్జి నాయకుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే ఓ వ్యక్తికి వీరు సేవలు అందిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


మురళీనగర్‌లోని వైభవ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ అక్కడ కాకుండా మరో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ను అవసరమైతే అవుట్‌ సోర్సింగ్‌లో నియమించుకునే అవకాశం ఉంది. కానీ ఆలయ ఉద్యోగులను దేవదాయ శాఖ కార్యాలయంలో పనులకు ఉపయోగించకూడదు. కానీ ఇక్కడ ఎవరికి నచ్చినట్టు వారు ఉపయోగించుకుంటున్నారు. 

Updated Date - 2020-11-19T05:51:10+05:30 IST