హయగ్రీవ మాస్టర్‌ప్లాన్ ! దశాబ్దం కిందట తీసుకున్న భూమిని.. ఇన్నాళ్లూ ఖాళీగా ఉంచి..
ABN , First Publish Date - 2020-09-01T16:02:36+05:30 IST
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) అధికార పార్టీ నేతల సేవలో..

వృద్ధులకు ఆశ్రమం నిర్మిస్తామంటూ దశాబ్దం కిందట భూమి తీసుకున్న సంస్థ
ఇన్నాళ్లూ ఖాళీగా ఉంచి... ఇప్పుడు వాణిజ్య సముదాయం నిర్మాణానికి సన్నాహాలు
అడ్డంకిగా ఉందంటూ వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ రహదారి మార్పునకు దరఖాస్తు
పత్రిక ప్రకటన విడుదల చేసిన అధికారులు
అధికార పార్టీ నేతల సేవలో తరిస్తున్న ప్రభుత్వ సంస్థ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) అధికార పార్టీ నేతల సేవలో తరిస్తోంది. విశాఖ నగర అభివృద్ధి కోసం దశాబ్దం ముందే రూపొందించుకున్న ‘మాస్టర్ ప్లాన్’ను అయిన వారికి అనుకూలంగా మార్చుకుంటూ పోతోంది. సింపుల్‌గా చిన్న పత్రికా ప్రకటన ఇచ్చేసి అభ్యంతరాలు ఏమీ లేవంటూ...వాటికి ఆమోద ముద్ర వేసేస్తోంది.
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆరితేరిన ఓ నేతకు అనుకూలంగా ఇప్పుడు ఎండాడలో మరో మాస్టర్‌ప్లాన్ రహదారి మార్పునకు రంగం సిద్ధం అయ్యింది. ఎండాడలో 60 అడుగుల మాస్టర్ ప్లాన్ రహదారి నిర్మించాలని చాలాకాలం క్రితమే ప్రతిపాదించారు. అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఆ ప్రాంతంలో పది ఎకరాలకు పైగా విలువైన స్థలాన్ని అభివృద్ధి చేయడానికి సదరు నేత, ఆయన మిత్రబృందం ఒప్పందం చేసుకుంది. దానికి వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ రహదారి అడ్డంకిగా మారింది. ఇలాంటి రహదారులు అడ్డం వస్తే...వాటిని ఏదో ఒక విధంగా మార్చేసి...పక్కకు నెట్టించడంలో ఆరితేరిన ఆ వ్యాపారి ఎండాడ రోడ్డు విషయంలోనూ అదే పనికి పూనుకున్నారు. వీఎంఆర్‌డీఏకు సదరు భూమి యజమాని హయగ్రీవ డెవలపర్స్‌తో దరఖాస్తు చేయించారు. పై నుంచి తన పలుకుబడి ఉపయోగించారు.
ఎండాడ సర్వే నంబరు 86/పి, 92/3పిలో వున్న 60 అడుగుల మాస్టర్ ప్లాన్ రహదారిలో కొంత భాగాన్ని తొలగించి, సర్వే నంబర్ 92/2లోకి మార్చాలని దరఖాస్తు చేశారు. ఈ మేరకు వీఎంఆర్‌డీఏ ఈ నెల రెండో వారంలో ప్రకటన విడుదల చేసింది. పదిహేను రోజుల్లో అభ్యంతరాలు ఏమైనా వుంటే తెలపాలని, లేదంటే...ఆ రహదారిని మార్చేస్తామని పేర్కొంది. ఆ గడువు ముగిసిపోయింది. దానిపై అభ్యంతరాలు ఏమైనా వచ్చాయా? అని తెలుసుకోవడానికి ‘ఆంధ్రజ్యోతి’ యత్నించింది. కరోనా నేపథ్యంలో అధికారులు కార్యాలయంలో ఇతరులను అనుమతించడం లేదు. ఫోన్ చేస్తే సీయూపీ సురేశ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. కమిషనర్ కోటేశ్వరరావు ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
ఆ భూమి ఉపయోగం వేరు
మాస్టర్ ప్లాన్ రహదారిని మార్చాలని దరఖాస్తు చేసుకున్న హయగ్రీవ సంస్థ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో వృద్ధులకు ఆశ్రమం నిర్మించి, నడుపుతామని చెప్పి ఎండాడలో పది ఎకరాలు తీసుకుంది. దశాబ్దం దాటి పోయింది. అందులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. సాధారణంగా ఇలాంటి సేవలకు తీసుకునే భూములను సక్రమంగా ఉపయోగించకుంటే వెనక్కి తీసుకుంటారు. ఇప్పుడు అందులో వాణిజ్యపరమైన నిర్మాణాలు చేపట్టడానికి నిర్ణయించింది. దానికి అనుకూలంగా ఇప్పుడు మాస్టర్‌ప్లాన్ రహదారిని మార్చేస్తున్నారు. వీఎంఆర్‌డీఏ అధికారులకు ఈ విషయం తెలిసే చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా? అధికార పార్టీ నేత కాబట్టి తల వంచుకుపోతున్నారో అర్థం కావడం లేదు.