మహా పర్వదినం కార్తీక శుద్ధ ఏకాదశి

ABN , First Publish Date - 2020-11-25T05:41:56+05:30 IST

మాసాలన్నింటా విశిష్టమైనది కార్తీక మాసం. తిథులన్నింటిలో పుణ్య తిథి ఏకాదశిగా భావన. ఇటువంటి మేలు కలయిక కార్తీక శుద్ధ(ఉత్థాన) ఏకాదశిని బుధవారం జరుపుకునేందుకు శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మహా పర్వదినం కార్తీక శుద్ధ ఏకాదశి
సబ్బవరం దరి పెదయాతపాలెం ద్వాదశ జ్యోతిర్లింగాలయంలో పార్వతీ పరమేశ్వరులు

శివ, విష్ణువులకు ప్రీతికరమైన రోజు 

నేడు శివాలయాల్లో  ప్రత్యేక పూజలు

బిల్వార్చనలు, అభిషేకాలకు ఏర్పాట్లు

 మాసాలన్నింటా విశిష్టమైనది కార్తీక మాసం. తిథులన్నింటిలో పుణ్య తిథి ఏకాదశిగా భావన. ఇటువంటి మేలు కలయిక కార్తీక శుద్ధ(ఉత్థాన) ఏకాదశిని బుధవారం జరుపుకునేందుకు శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సింహాచలం, నవంబరు 24:  ఏకాదశులు ఏడాది మొత్తం మీద 24 వస్తాయి. ప్రతి ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకమైన పేర్లతో వ్యవహిస్తారు. అటువంటి వాటిలో కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని, ప్రభోదిని ఏకాదశి అని అంటారు. ఆషాడ శుక్లపక్ష ఏకాదశినాడు శ్రీమహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించటంతో దానిని శయన ఏకాదశి అని, నాలుగు మాసాల తర్వాత కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి నాడు యోగనిద్ర నుంచి మేల్కొంటాడు కనుక ఉత్థాన ఏకాదశి అని అంటారు. ఈ నాలుగు నెలలు యతీంద్రులు, పండితులు చాతుర్మాస దీక్షలు చేస్తారు.

 కార్తీకమాసంలో ఏకాదశ పర్వదినాలు మహావిష్ణువు, మహాదేవుడులకు అత్యంత ప్రీతికరమైన రోజులు.  కార్తీక ఏకాదశి నాడు వేకువజామున నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకుని సమీపంలోని నది లేదా పుష్కరిణి, తటాకం, లేదా నుయ్యిలోని చల్లని నీటితో స్నానమాచరించాలి. నదిలోని ప్రవహించు నీటితో దైవానికి అర్ఘ్యపాద్యాదులు సమర్పించాలి. తీరానికి చేరుకుని సంప్రదాయబద్ధంగా పత్తితో తయారు చేసిన వత్తులను మట్టి ప్రమిదల్లో లేదా అరటి డొప్పల్లో ఉంచి వెలిగించిన దీపాలను నీటి ప్రవాహంలో విడిచిపెట్టాలి. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి సమీపంలోని ఈశ్వరాలయానికి చేరుకుని అభిషేక ప్రియుడుగా పిలువబడు మహేశ్వరునికి భక్తితో పంచామృతాలతో కాని పరిశుద్ధ జలములతో నమక చమకాలు పారాయణలు జరుగుతుండగా ఏకవార రుద్రాభిషేకాన్ని జరిపించాలి. పగలంతా పూర్తిగా నక్తం(ఉపవాసం) వుండి, సూర్యాస్తమయం కాగానే తిరిగి నదీస్నానము చేసి మరల శివారాధన లేదా విష్ణుపూజలు చేసి నక్షత్ర దర్శనం అనంతరం దైవానికి నివేదించిన ప్రసాదాన్ని ఆహారంగా భుజించాలి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం పుణ్యప్రదమని చెబుతారు.


ఆలయాల్లో ఏర్పాట్లు 

కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుని పలు శైవక్షేత్రాలను తోరణాలతో, విద్యుత్‌ కాంతులతో శోభాయమానంగా అలంకరిస్తారు. కొన్ని శివాలయాల్లో లక్ష బిల్వార్చనలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అభిషేకాలు, బిల్వార్చనలకు మించి ‘ఓం నమఃశివాయః’ అనే పంచాక్షరీ మంత్ర జపం ఏకాదశినాడు యథాశక్తి కొలది కనీసం 1008సార్లు పఠిస్తే మంచిదని భావిస్తుంటారు. నిరుపేదలకు, ఆపదలో ఉన్నవారికి మనకు కలిగిన దానిలో కొంత మేరకు దాన ధర్మాలు ఆచరించటం దైవారాధనలకు మించిన ఉతృష్టమైన పుణ్యఫలాన్ని ఇస్తాయని శాస్త్ర వచనం. 


Updated Date - 2020-11-25T05:41:56+05:30 IST