-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Drowned at the end
-
చివరిలో ముంచేసింది
ABN , First Publish Date - 2020-11-28T05:10:09+05:30 IST
మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం కురిసిన వర్షానికి వరిపంట నీట మునిగిపోవడంతో అన్నదాతలో ఆందోళన నెలకొంది.

అకాల వర్షాలతో నీట మునిగిన పంట
కళ్లాలకు తరలించేలోగా నష్టం
అన్నదాతలో తీవ్ర ఆందోళన
పద్మనాభం, నవంబరు 27: మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం కురిసిన వర్షానికి వరిపంట నీట మునిగిపోవడంతో అన్నదాతలో ఆందోళన నెలకొంది. తిండిగింజలను ఇంటికి కూడా తీసుకురాలేని పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. పాండ్రంగి, మద్ది, విలాస్‌ఖాన్‌పాలెం, బాందేవుపురం, అనంతవరం, పెంట, పొట్నూరు, రెడ్డిపల్లి తదితర గ్రామాలలో కోతలు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో పంటంతా నీట మునిగింది. కోసిన పంటను కుప్పలు వేయడానికి అవకాశం లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. వర్షానికి తోడు గాలికూడా తోడవడంతో కంకుల బరువుకు పంట నేలవాలింది. కొందరు రైతులు పొలంలో నీటిని మళ్లించడానికి పంటమధ్యలో కాలువలు తీశారు. వర్షాలు ఇలాగే కొనసాగితే పంటంతా పూర్తిగా పోతుందని వాపోతున్నారు. అధికారుల అంచనాల ప్రకారం మండలంలో ఇప్పటివరకు 40 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని చెబుతున్నారు.
పంట నష్టం యాప్‌లో నమోదు చేయాలి
నివర్ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులు గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా నష్టాన్ని యాప్‌లో నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారి ఎల్‌ఏ కాంతమ్మ చెప్పారు. మండలంలోని మద్ది, అనంతవరం, బాందేవుపురం తదితర గ్రామాలలో వర్షాలకు దెబ్బతిన్న వరిపంటను శుక్రవారం పరిశీలించిన ఆమె వ్యవసాయ సహాయకులు క్షేత్ర సందర్శనకు వెళ్లి పంటనష్టాలను అంచనా వేయాలన్నారు. పంటను కాపాడుకునేందుకు రైతులు ఉప్పు ద్రావణాన్ని వరికంకులపై పిచికారీ చేయాలన్నారు. మూడు, నాలుగు వరి దుబ్బులను కలిపి కట్టగా కట్టి పంట నేలకూలకుండా కాపాడుకోవాలన్నారు.
రైతన్నలో దిగులు
భీమునిపట్నం: నివార్ తుఫాన్‌తో కురిసిన వర్షాలతో భీమిలి మండలం కాపులుప్పాడలో చేతికి వచ్చిన వరి పంట నీటిపాలైందని ఆవేదన చెందుతున్నారు. పాతపరదేశిపాలెం, కాపులుప్పాడ, రెడ్డీలపాలెం, కల్లివానిపాలెం, సోమన్నపాలెం పరిసర గ్రామాలలో పంట నీటమునిగిపోయింది. కోత కోసి పొలాల్లో వుంచిన పంట నీటమునిగిందని, నీటిప్రవాహానికి ఒరిగిపోయిందని రైతులు వాపోతున్నారు. అధికారులు పంటలను పరిశీలించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
పంటలు పరిశీలించిన అధికారులు
భీమునిపట్నం రూరల్: తుపాను వర్షాలతో మండలంలో పంట నష్టాన్ని అంచనా వేయడానికి భీమిలి వ్యవసాయశాఖ అధికారులు శుక్రవారం వివిధ గ్రామాల్లో పర్యటించారు. మండలంలో సుమారు 800 ఎకరాల్లో వరి పంట పాడైందని అన్నారు. వరికంకులు నీటిలో ఉన్నాయన్నారు. వ్యవసాయాధికారి రత్నప్రభ ఇతర అధికారులు రైతులతో మాట్లాడి నష్టం అంచనాలను తయారు చేస్తున్నారు.