‘బ్లాక్‌’ చేయొద్దు.. ప్రతి ఖాళీని ఆన్‌లైన్‌లో ప్రదర్శించాల్సిందే

ABN , First Publish Date - 2020-12-11T05:47:24+05:30 IST

ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ప్రతి పోస్టును ఆన్‌లైన్‌లో ప్రదర్శించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) డిమాండ్‌ చేసింది.

‘బ్లాక్‌’ చేయొద్దు.. ప్రతి ఖాళీని ఆన్‌లైన్‌లో ప్రదర్శించాల్సిందే
జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట పికెటింగ్‌ నిర్వహిస్తున్న ఫ్యాప్టో

ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య డిమాండ్‌


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ప్రతి పోస్టును ఆన్‌లైన్‌లో ప్రదర్శించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) డిమాండ్‌ చేసింది. గురువారం జిల్లా విద్యా శాఖ కార్యాలయం ఎదుట ఫ్యాప్టో పికెటింగ్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ ఇమంది పైడిరాజు మాట్లాడుతూ బదిలీల సమయంలో జిల్లాలో ఏర్పడిన ప్రతి ఖాళీని ప్రదర్శించకుండా దాచే విధానాన్ని వ్యతిరేకిస్తున్నామ న్నారు. అలాగే ఆన్‌లైన్‌ (వెబ్‌)లో కాకుండా మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ విధానం అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో ప్రతినిధులు కోటారి శ్రీనివాస్‌ (ఎపీటీఎఫ్‌-257), అప్పారావు, చిన్నబ్బాయి (యూటీఎఫ్‌), ఏవీఎస్‌ శివాజీ, కృష్ణకుమార్‌ (హెచ్‌ఎం అసోసియేషన్‌), జి.మధు, సాయిప్రసాద్‌ (డీటీఎఫ్‌), ఇంకా ఉపాధ్యాయ నేత వెంకటపతిరాజు తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఈవో బి.లింగేశ్వరరెడ్డి పికెటింగ్‌ వద్దకు వచ్చి ఫ్యాప్టో ప్రతినిధుల నుంచి వినతిపత్రం స్వీకరించారు. ఫ్యాప్టో ప్రతినిధులు ఇచ్చిన వినతిపత్రంలోని వివరాలను పాఠశాల విద్యాశాఖకు నివేదిస్తారన్నారు.


టీచర్ల బదిలీలకు  నేటి నుంచి వెబ్‌ఆప్షన్లు

16-21 తేదీల మధ్య పోస్టింగ్స్‌

మొత్తం ఖాళీలు 3,263... వచ్చిన దరఖాస్తులు 5,014


విశాఖపట్నం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో చివరి అంకం శుక్రవారం ప్రారంభం కానున్నది. బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారంతా శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌ (వెబ్‌) ద్వారా ఆప్షన్లు ఇవ్వనున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు ఆప్షన్లు ఇచ్చుకునేలా షెడ్యూల్‌ రూపొందించారు. 16 నుంచి 21వ తేదీ మధ్యన సీనియారిటీ ప్రాతిపదికన పోస్టింగ్‌ ఇస్తారు. ఈ నెల 24న ఆర్డర్లను వెబ్‌లో పొందుపర్చుతారు. జిల్లాలో మొత్తం 3,263 ఖాళీలకు 5,014 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఒకేచోట ఐదేళ్ల సర్వీస్‌ పూర్తిచేసుకున్న హెచ్‌ఎంలు, ఎనిమిదేళ్లు పూర్తిచేసుకున్న ఇతర కేటగిరీ టీచర్లు 1,308 మంది వరకూ ఉన్నారు. వీరంతా తప్పనిసరిగా ప్రస్తుతం పనిచేస్తున్నచోట నుంచి బదిలీ అవుతారు. ఇంకా బదిలీలకు అర్హత సాధించిన 3,706 మంది కూడా దరఖాస్తు చేశారు. కేటగిరీ వారీగా చూస్తే ఎస్జీటీలలో తప్పనిసరిగా బదిలీ కావల్సిన టీచర్లు 866 మంది వుండగా, అర్హత సాధించినవారు 1839 మంది ఉన్నారు. స్కూల్‌ అసిస్టెంట్స్‌ (నాన్‌ లాంగ్వేజస్‌) కేటగిరీలో తప్పనిసరిగా బదిలీ కావలసినవారు (ఎనిమిదేళ్ల సర్వీస్‌ పూర్తి) 227 మంది వుండగా, 1,176 మంది అర్హత సాధించి దరఖాస్తు చేశారు. స్కూల్‌ అసిస్టెంట్లు (లాంగ్వేజస్‌) కేటగిరీలో 142 మంది ఎనిమిదేళ్ల సర్వీస్‌ పూర్తిచేసుకోగా, 454 మంది అర్హత సాధించడం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల్లో 50 మంది ఎనిమిదేళ్ల సర్వీస్‌ పూర్తిచేసుకోగా, 102 మంది అర్హత సాధించడం ద్వారా దరఖాస్తు చేశారు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల్లో 22 మంది ఐదేళ్ల సర్వీస్‌ పూర్తిచేసుకోగా, 131 మంది అర్హత సాధించడం ద్వారా దరఖాస్తు చేశారు. వ్యాయామ ఉపాధ్యాయుల కేటగిరీలో ఒకరు ఎనిమిదేళ్ల సర్వీస్‌ పూర్తిచేసుకోగా, ముగ్గురు అర్హత సాధించడం ద్వారా దరఖాస్తు చేశారు. కాగా జిల్లాలో 1,037 పోస్టులను బ్లాక్‌ చేశారు. అయితే బ్లాక్‌ చేసిన పోస్టుల సంఖ్య స్వల్పంగా తగ్గే అవకాశం ఉందంటున్నారు. 


Updated Date - 2020-12-11T05:47:24+05:30 IST