దారి మళ్లుతున్న ట్రెక్కింగ్
ABN , First Publish Date - 2020-12-07T05:52:05+05:30 IST
కార్తీకమాసం... పిక్నిక్‌ల సీజన్.... కొత్తగా ఏదో చేయాలనేది యువత ఆలోచన. బైకులేసుకొని స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కంటూ బయలుదేరుతున్నారు. దీనిని క్యాష్ చేసుకోవడానికి కొన్ని సంస్థలు యత్నిస్తున్నాయి.

వ్యాపారంగా మార్చుకుంటున్న కొన్ని సంస్థలు
సోషల్ మీడియాలో ప్రచారం
అనుభవజ్ఞులు లేకుండా వెళ్లడం
ప్రమాదకరమని నిపుణుల హెచ్చరిక
అటవీ, పోలీస్ శాఖల అనుమతులు తప్పనిసరి
తమకు తెలియజేయాలంటున్న పర్యాటక శాఖ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
కార్తీకమాసం... పిక్నిక్‌ల సీజన్.... కొత్తగా ఏదో చేయాలనేది యువత ఆలోచన. బైకులేసుకొని స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కంటూ బయలుదేరుతున్నారు. దీనిని క్యాష్ చేసుకోవడానికి కొన్ని సంస్థలు యత్నిస్తున్నాయి. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ప్రకటనలు గుప్పిస్తూ, ఎటువంటి అనుమతులు లేకుండా కార్యక్రమాలు చేపడుతున్నాయి. అలా ఇష్టారాజ్యంగా వెళ్లకూడదని... అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే కాపాడే నాథుడు వుండడని ఆ రంగంలో నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అంశాలు ఎవరి దృష్టికైనా వస్తే...తమకు తెలియజేయాలని ప్రభుత్వ సంస్థలూ కోరుతున్నాయి.
ఏమిటీ వ్యాపారం...?
ట్రెక్కింగ్ అనే సాహస ప్రక్రియ ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రపంచంలో దీనికి వందేళ్ల చరిత్ర ఉంది. భారతదేశంలోనూ 70 ఏళ్లుగా ట్రెక్కింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం వల్ల ట్రెక్కింగ్‌పై చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదనుగా భావించి, కొందరు తాము ‘ట్రెక్కింగ్ ఈవెంట్’ నిర్వహిస్తున్నామని ప్రకటనలు ఇస్తూ... భారీగా డబ్బులు వసూలుచేస్తున్నారు. దీన్నొక వ్యాపారంగా మార్చేశారు. ఇది అవాంఛనీయమని, ప్రమాదకరమని ఆ రంగంలో నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎటువంటి అనుభవం, అనుమతులు లేనివారితో ట్రెక్కింగ్‌కు వెళితే... ప్రమాదంలో పడినట్టేనని చెబుతున్నారు.
అనుమతులు అవసరం
ట్రెక్కింగ్ నిర్వహించాలంటే... తప్పనిసరిగా ఆ ప్రాంతానికి చెందిన అటవీ శాఖాధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. అలాగే అక్కడి పోలీస్ అధికారులకు ముందుగా సమాచారం అందించి, పర్మిషన్ కోరాలి. అంతేకాకుండా ట్రెక్కింగ్‌కి రెండు వారాల ముందు ఎక్కడికైతే వెళ్లాలనుకుంటున్నారో... ఆ ప్రాంతంలో కనీసం ఆరుగురు పైలట్ ట్రెక్కింగ్ నిర్వహించాలి. ఎటువంటి ప్రమాదం లేదని నిర్ధారించుకోవాలి. అలాగే స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, వాటర్ పాయింట్, రెస్ట్ పాయింట్... అంటూ అని మార్కింగ్ చేసుకోవాలి. ఆ ప్లాన్ కాపీని అటవీ శాఖ అధికారులకు ఇచ్చి అనుమతి తీసుకోవాలి. అనుకోని ప్రమాదం జరిగితే వెంటనే స్పందించేలా, సాయం అందించేందుకు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. వారంతా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాకే ట్రెక్కింగ్ నిర్వహించాలి. పరిశుభ్రత, భద్రత వంటి అంశాలపైనా నిర్వాహకులు దృష్టిపెట్టాల్సి ఉంటుంది. వెళ్లే మార్గంలో ప్రమాదకరమైన జంతువులు ఏమీ లేవని నిర్ధారించుకోవాలి. అంతే కాకుండా కనీసం ఐదారు ట్రెక్కింగ్‌లు నిర్వహించిన అనుభవం వున్నవారితోనే వెళ్లాలి. ఇది వ్యాపారం కోసం చేసే విన్యాసం కాదు. ప్రత్యేకమైన ఆసక్తితో, ప్రకృతిపై అభిమానంతో, ఆరోగ్యానికి ఉపకరిస్తుందనే ఉద్దేశంతో చేసేది.
విశాఖపట్నం జిల్లాలో...
విశాఖపట్నం జిల్లాలో అరకులోయ, పాడేరు, చింతపల్లి, లంబసింగి, కటిక, కంబాల కొండ, పావురాయి కొండ, హిల్‌టాప్ రోడ్ ఇలా అనేక ప్రాంతాల్లో ట్రెక్కింగ్ నిర్వహిస్తున్నారు. యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(యుహెచ్‌ఏఐ)తో పాటు మరికొన్ని ప్రైవేటు సంస్థలు తరచూ కార్యక్రమాలు చేపడుతున్నాయి. కంబాలకొండలో ట్రెక్కింగ్‌కు వెళితే అటవీ శాఖ అనుమతి చాలు. ఇతర ప్రాంతాల్లో అయితే పోలీసుల అనుమతి కూడా అవసరం. కొత్తగా పర్యాటక శాఖ కూడా తమ అనుమతి కూడా తీసుకోవాలని కోరుతోంది. అయితే దీనిపై ఇంకా చట్టం చేయలేదు.
అనుభవం ఉన్న వారితో వెళ్లడమే మేలు
ఎన్.నాగేశ్వరరావు, విశాఖ అధ్యక్షుడు, యుహెచ్‌ఏఐ
ట్రెక్కింగ్‌కు అనుభవజ్ఞులతోనే వెళ్లాలి. దారి తప్పిపోయినా, అనుకోని ప్రమాదం జరిగినా ఇబ్బందే. అందుకే అధికారులకు ముందుగా సమాచారం ఇచ్చి అనుమతి తీసుకోవాలి. ఇటీవల తెలంగాణలో ట్రెక్కింగ్‌కు అనుమతి కోరితే... ఆ ప్రాంతంలో ల్యాండ్ మైన్స్ పేల్చారంటూ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో విరమించుకున్నాం. తెలియని సమస్యలు చాలా ఉంటాయి. దీనిని వ్యాపార అంశంగా చూడకూడదు.