సరికొత్త సమస్యలు

ABN , First Publish Date - 2020-11-19T05:57:42+05:30 IST

కొత్త జిల్లాల ఏర్పాటుకు ఒకపక్క అధికారులు కసరత్తు చేస్తుండగా... మరోపక్క ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

సరికొత్త సమస్యలు

జిల్లాల పునర్విభజనపై అభ్యంతరాలు

విశాఖ జిల్లాలో విలీనానికి ఎస్‌.కోట వాసులు ససేమిరా

విజయనగరంలోనే కొనసాగించాలని డిమాండ్‌

అరకు కేంద్రంగానే జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతున్న స్థానిక ఎమ్మెల్యే

పాడేరును పరిశీలిస్తున్న పోలీస్‌ అధికారులు

అరకులోయ జిల్లాలో విలీనానికి కొయ్యూరు మండలంలోని కొన్ని గ్రామాల్లో వ్యతిరేకత

‘విశాఖ’ వైపు పెందుర్తి మొగ్గు

అనకాపల్లిలో విలీనం కాకతప్పదంటున్న అధికారులు


(విశాఖపట్నం- ఆంధ్రజ్యోతి)

కొత్త జిల్లాల ఏర్పాటుకు ఒకపక్క అధికారులు కసరత్తు చేస్తుండగా... మరోపక్క ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభ నియోజకవర్గం కేంద్రంగా జిల్లాలు ఏర్పాటుచేయాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల తమకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని కొన్ని ప్రాంతాల ప్రజలు వాదిస్తున్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే ప్రస్తుతం విజయనగరం జిల్లాలో వున్న ఎస్‌.కోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో విలీనం చేయాలి. అయితే అందుకు ఎస్‌.కోట వాసుల్లో అత్యధికులు వ్యతిరేకంగా వున్నట్టు చెబుతున్నారు. ఎస్‌.కోట భౌగోళికంగా విజయనగరానికి సమీపంలో ఉంటుంది. ఆ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు గజపతినగరం మండలానికి చేరువలో ఉన్నాయి. వారంతా విజయనగరం మీదుగా విశాఖ రావలసి ఉంటుంది. ఎస్‌.కోట నియోజకవర్గంలో ఒక్క కొత్తవలస మండలం తప్ప మిగిలిన మండలాలన్నీ విజయనగరానికి అతి దగ్గరగా ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తమను యథాతథంగా విజయనగరం జిల్లాలోనే కొనసాగించాలని, విశాఖలో విలీనం చేయవద్దని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఈ మేరకు విజయనగరం, విశాఖ జిల్లాల అధికారులకు, ప్రభుత్వానికి వినతులు అందజేశారు. లోక్‌సభ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటుచేయాలని విధానపరమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కొన్ని సెగ్మెంట్లను మినహాయించాలని వస్తున్న డిమాండ్‌లపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఒక్క అరకులోయ మినహా మిగిలిన లోక్‌సభ నియోజకవర్గాల నివేదికలు పంపాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. కాగా అరకులోయ కేంద్రంగానే జిల్లా ఏర్పాటుచేయాలని స్థానిక ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ డిమాండ్‌ చేస్తున్నారు. కానీ మౌలిక వసతులు వున్నాయన్న కారణంగా అరకు బదులు పాడేరు కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేయాలని పోలీసులు ప్రతిపాదించారు. ఇంకా పలువురు పాడేరును పరిశీలిస్తుండడంతో అరకు ఎమ్మెల్యే ఇటీవల జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ను కలిసి తన వాదన వినిపించారు. అరకులోయ కేంద్రంగానే జిల్లా ఏర్పడుతుందని కలెక్టర్‌ చెప్పినట్టు తెలిసింది. కాగా అరకు జిల్లాలో తమ గ్రామాలను విలీనం చేయవద్దని కొయ్యూరు మండలం బాలారం, కంఠారంతోపాటు మరికొన్ని గ్రామాల ప్రజలు కోరుతున్నారు. తమ గ్రామాలు నర్సీపట్నానికి చేరువగా వున్నాయని, ప్రతి అవసరానికీ అక్కడకే వెళతామని జిల్లా యంత్రాంగానికి విన్నవించారు. అందువల్ల అరకులోయ కంటే తమకు అనకాపల్లి జిల్లా కేంద్రం అయితేనే కాస్త సౌలభ్యంగా వుంటుందని పేర్కొన్నారు. ఇక పెందుర్తి మండలంలో పలు ప్రాంతాలు గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెందుర్తి మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు అనకాపల్లి జిల్లాలో విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రభుత్వం రూపొందించిన విధానానికి లోబడే కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుందని ఉన్నతాధికారులు స్పష్టంచేస్తున్నారు. ఆ మేరకు పెందుర్తి సెగ్మెంట్‌ అనకాపల్లి జిల్లాలోనే వుంటుందని చెబుతున్నారు.

Updated Date - 2020-11-19T05:57:42+05:30 IST