నేటి నుంచి ఇళ్ల పట్టాల పంపిణీ

ABN , First Publish Date - 2020-12-25T06:15:23+05:30 IST

జిల్లాలో శుక్రవారం నుంచి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం ఇళ్ల పట్టాలు పంపిణీ, నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

నేటి నుంచి ఇళ్ల పట్టాల పంపిణీ

73,236 మందికి స్థలాలు

25,743 మందికి టిడ్కో ఇళ్లు

16,964 మందికి ఎల్‌పీసీలు

మంజూరుచేసిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభం


విశాఖపట్నం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి):


జిల్లాలో శుక్రవారం నుంచి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం ఇళ్ల పట్టాలు పంపిణీ, నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం జిల్లాల్లో కార్యక్రమానికి మంత్రులు, అధికారులు శ్రీకారం చుడతారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పెందుర్తి మండలం వాలిమెరక, ఆనందపురంలలో నిర్వహించే పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అదే సమయంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సంబంధిత ఎమ్మెల్యే ఆధ్యర్యంలో ఈ కార్యక్రమం  జరగనున్నది. ఇళ్ల స్థలాల పట్టాలతో పాటు టిడ్కో ద్వారా నిర్మించిన ఇళ్లను కూడా శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఇంకా గతంలో ప్రభుత్వ స్థలంలో పాకలు వేసుకున్న వ్యక్తులకు భూస్వాధీన పత్రం అందజేస్తారు. పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణానికి ప్రతి సెగ్మెంట్‌కు సీనియర్‌ అధికారిని ప్రత్యేకంగా నియమించారు. జిల్లాలో 73,236 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు, 16,954 మందికి ఎల్‌పీసీలు, 25,854 మందికి టిడ్కో ఇళ్లు అందజేయనున్నారు. గడచిన 90 రోజుల్లో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 371 మందిని అర్హులుగా గుర్తించారు. పట్టాలు, టిడ్కో ఇళ్లు, ఎల్‌పీసీలు మంజూరైనవారు మొత్తం 1,16,433 మంది అయ్యారు. అయితే పెందుర్తి మండలం పెదగాడి గ్రామంలో ఇళ్ల స్థలాలపై కోర్టులో వ్యాజ్యం దాఖలు కావడంతో సుమారు 500 మందికి పంపిణీ వాయిదా వేశారు. దీంతో 1,15,933 మందికి పట్టాలు అందజేయనున్నారు. అత్యధికంగా అరకులోయ నియోజకవర్గ పరిధిలో 10,422 మందికి, తరువాత భీమిలిలో 9,572 మందికి, నర్సీపట్నంలో 9,221 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు అందజేయనున్నారు. కాగా పట్టాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ తెలిపారు. జీవీఎంసీ పరిధిలో భూ సమీకరణపై కోర్టు వ్యాజ్యం వున్నందున 1,79,808 మందికి పట్టాల పంపిణీ వాయిదా వేశామన్నారు. గ్రామీణ ప్రాంతంలో పట్టాలు పంపిణీ అనంతరం ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు.


27న జీవీఎంసీ పరిఽధిలో టిడ్కో ఇళ్లు పంపిణీ


జీవీఎంసీ పరిధిలో ఈ నెల 27వ తేదీ నుంచి టిడ్కో ఇళ్లు పంపిణీ చేయనున్నారు. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు 24,192 ఇళ్లు కేటాయించనున్నారు. అదేరోజు సంబంధిత జోనల్‌ కమిషనర్‌ కార్యాలయాల్లో లబ్ధిదారులకు ఇంటి పత్రాలు అందజేయడంతోపాటు కొన్ని కేటగిరీలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ చేస్తారు. 


నియోజకవర్గాల వారీగా పట్టాలు, ఇళ్లు, ఎల్‌పీసీలు పంపిణీ వివరాలు

నియోజకవర్గం పట్టాలు టిడ్కో ఇళ్లు ఎల్‌పీసీలు  

1. భీమిలి 9,572 - -  

2. చోడవరం 5,139 - 876  

3. మాడుగుల 3,806 - 3,306  

4. అరకులోయ 10,422 4,897  

5. పాడేరు 5,129 - 5,637  

6. అనకాపల్లి 7,681 - 1,784  

7. పెందుర్తి 6,922 - -  

8. ఎలమంచిలి 6,297 442 454  

9. పాయకరావుపేట 9,169 -- --  

10. నర్సీపట్నం 9,221 1,725 --  

విశాఖ అర్బన్‌ - 23,576 -

Updated Date - 2020-12-25T06:15:23+05:30 IST