భోగాపురంలో యువకుడి నిర్బంధం
ABN , First Publish Date - 2020-12-12T04:50:16+05:30 IST
మండలంలోని భోగాపురం గ్రామంలో ఓ యువకుడ్ని శుక్రవారం గ్రామస్థులు నిర్బంధించి చితకబాదడం వివాదాస్పదంగా మారింది.
పాకలు కాల్చేస్తున్నాడన్న అనుమానంతో కట్టేసి చితకబాదిన గ్రామస్థులు
స్థానికుల చెర నుంచి విడిపించి చికిత్స అందించిన పోలీసులు
చోడవరం, డిసెంబరు 11: మండలంలోని భోగాపురం గ్రామంలో ఓ యువకుడ్ని శుక్రవారం గ్రామస్థులు నిర్బంధించి చితకబాదడం వివాదాస్పదంగా మారింది. ఈ గ్రామంలో ఇటీవల కొంత మంది పశువుల పాకలు, ద్విచక్ర వాహనాలు తగులబడ్డాయి. ఈ ఘటనకు కారకుడిగా అనుమానిస్తూ గ్రామానికి చెందిన పొలిమేర అప్పలరాజుపై స్థానికులు నిఘా ఉంచారు. అతనే దీనికి కారకుడిగా నిర్ధారించి ఫిర్యాదు చేయడంతో పోలీసులకు అరెస్టు చేశారు. ఇటీవల అప్పలరాజు బెయిలుపై విడుదలై గ్రామంలోనే తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం గ్రామంలో మరో పశువుల పాక దగ్ధమైంది. దీంతో కోపోద్రోక్తులైన గ్రామస్థులు శుక్రవారం ఉదయం అప్పలరాజును నిర్బంధించి దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వెళ్లి అప్పలరాజును విడిపించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేస్తున్నామని ఎస్‌ఐ విభీషణరావు తెలిపారు.