పద్మనాభుని దీపోత్సవం రేపు
ABN , First Publish Date - 2020-12-13T05:44:39+05:30 IST
పద్మనాభంలో కొలువుతీరిన అనంత పద్మనాభస్వామి దీపోత్సవాన్ని కొవిడ్ దృష్ట్యా ఈ ఏడాది శాఖాపరంగా మాత్రమే నిర్వహిస్తామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి నేమాన లక్ష్మీనారాయణశాస్త్రి తెలిపారు.

1,250 మెట్లపై దీపాలు వెలిగించేందుకు 1,300 మంది స్వచ్ఛంద సేవకులు
దేవస్థానం ఈవో లక్ష్మీనారాయణశాస్త్రి
సింహాచలం, డిసెంబరు 12: పద్మనాభంలో కొలువుతీరిన అనంత పద్మనాభస్వామి దీపోత్సవాన్ని కొవిడ్ దృష్ట్యా ఈ ఏడాది శాఖాపరంగా మాత్రమే నిర్వహిస్తామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి నేమాన లక్ష్మీనారాయణశాస్త్రి తెలిపారు. సింహాచలంలోని ఈవో క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదమూడు వందల మంది స్వచ్ఛంద సేవకుల సహకారంతో ఈనెల 14వ తేదీన 1,250 మెట్లపై దీపాలను వెలిగించడం జరుగుతుందన్నారు. పద్మనాభస్వామి భక్తులంతా తమ ఇళ్లలోనే దీపారాదనలు చేసుకోవాలని సూచించారు. ఆ రోజున పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామన్నారు.
వలంటీర్లకు పాసుల పంపిణీ
పద్మనాభం: అనంతుని దీపోత్సవంలో స్వచ్ఛందంగా దీపాలంకరణ వచ్చే సేవకులకు శనివారం కుంతీమాధవస్వామి ఆలయంలో దేవస్థానం అధికారులు పాసులు జారీ చేశారు. ఈ పాసులు పొందిన స్వచ్ఛంద సేవకులు సోమవారం మధ్యాహ్నం పన్నెండున్నరకల్లా ప్రథమ పావంచా వద్దకు చేరుకోవాలని, అక్కడి నుండి గిరిని అధిరోహిచి తమకు కేటాయించిన మెట్ల వద్ద ప్రమిదలను ఏర్పాటు చేసి.. అందులో వత్తులు, నూనె పోసి, సాయంత్రం ఐదున్నరకు ఆలయ జేగంట మోగగానే దీపాలను వెలిగించాలని ఈవో లక్ష్మీనారాయణశాస్త్రి, ఉత్సవ కమిటి సభ్యుడు టి.పద్దు వారికి సూచించారు. ఒంటిగంటన్నర దాటిన తరువాత వచ్చే స్వచ్ఛంద సేవకులను అనుమతించబోమని స్పష్టం చేశారు.
