డీఎడ్‌ విద్యార్థుల భవిత ప్రశ్నార్థకం

ABN , First Publish Date - 2020-11-01T02:14:29+05:30 IST

డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌) 2018 - 2020 విద్యా సంవత్సరం విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. నవంబరు 5 నుంచి 11వ తేదీ వరకు జరిగే ప్రథమ సంవత్సరం పరీక్ష రాసేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

డీఎడ్‌ విద్యార్థుల భవిత ప్రశ్నార్థకం
కళాశాల యాజమాన్యాన్ని కలిసేందుకు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు

పరీక్షలు రాసేందుకు అనుమతి నిరాకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

అయోమయంలో విద్యార్థులు 

మల్కాపురం, అక్టోబర్‌ 31 : డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌) 2018 - 2020 విద్యా సంవత్సరం విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. నవంబరు 5 నుంచి 11వ తేదీ వరకు జరిగే ప్రథమ సంవత్సరం పరీక్ష రాసేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఈ నేపథ్యంలో శ్రీహరిపురం స్వామి వివేకానంద కళాశాలలో చదువుతున్న అనేక మంది విద్యార్థులు శనివారం ఈ కళాశాలకు చేరుకుని తమ భవిష్యత్తు ఏమిటని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. పరీక్షలు రాయకపోతే రెండేళ్ల కాలం వృథా అవుతుందని కొంత మంది విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. ప్రవేశ పరీక్ష లేకుండా డీఎడ్‌లో చేరిన విద్యార్థులను పరీక్ష రాయనివ్వకూడదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వీరి పాలిట శాపంగా మారింది. జీవో నంబర్‌ 30కు వ్యతిరేకంగా కళాశాల యాజమాన్యం విద్యార్థులను డీఎడ్‌లో చేర్పించుకుంది. వీరు పరీక్షలు రాయడానికి అనుమతి లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొన్ని కళాశాలల యాజమాన్యాలు కోర్టులో కేసులు వేశాయి. విద్యార్థులతో కూడా కేసులు వేయించాయి. అయితే ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలు రాయడానికి అనుమతి ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం కోరుతోంది. 


Updated Date - 2020-11-01T02:14:29+05:30 IST