ప్రేమ వ్యవహారం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన కూతురు.. మనస్తాపంతో ఆ తండ్రి..

ABN , First Publish Date - 2020-10-19T17:46:07+05:30 IST

కన్న కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసిందనే మనస్తాపంతో ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన మండలంలోని ఎ.కొత్తపల్లిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. దేవరాపల్లి ఎస్‌ఐ పైలా సింహాచలం అందజేసిన వివరాలిలా ఉన్నాయి. దేవరాపల్లి మండలంలోని ఎ.కొత్తపల్లి గ్రామానికి చెందిన దూబా వెంకటరమణ

ప్రేమ వ్యవహారం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన కూతురు.. మనస్తాపంతో ఆ తండ్రి..

ప్రేమించిన వ్యక్తితో కలిసి తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు

మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య 

నిందితులపై చర్యలకు మృతుడు భార్య మంగమ్మ డిమాండ్‌


దేవరాపల్లి (విశాఖ పట్టణం): కన్న కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసిందనే మనస్తాపంతో ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన మండలంలోని ఎ.కొత్తపల్లిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. దేవరాపల్లి ఎస్‌ఐ పైలా సింహాచలం అందజేసిన వివరాలిలా ఉన్నాయి. దేవరాపల్లి మండలంలోని ఎ.కొత్తపల్లి గ్రామానికి చెందిన దూబా వెంకటరమణ  (55) కుమార్తె రూప, అదే గ్రామానికి చెందిన పెద్దాడ ఈశ్వరమ్మ కుమారుడు అప్పలరాజు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారంపై ఈనెల 13వ తేదీన రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు కుటుంబాలపై పోలీసులు బైండోవర్‌ కేసులు నమోదు చేసి, తహసీల్దార్‌ ఎదుట హాజరుపరిచారు. ఈ వివాదంలో పెద్దాడ అప్పలరాజు కుటుంబంపై తన తండ్రి దుబా వెంకటరమణ దాడి చేసి, దుర్భాషలాడని రెండో కుమార్తె రూప పోలీసులకు ఫిర్యాదు చేసింది.


తనకు వ్యతిరేకంగా కూతురు ఫిర్యాదు చేసిందని మనస్తాపానికి గురైన దుబా వెంకటరమణ ఆదివారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు వెంకటరమణ భార్య మంగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఎస్‌ఐ సింహాచలం తెలిపారు. తన ఇంటికి అప్పలరాజు, అతని తల్లి ఈశ్వరమ్మ వచ్చి తన భర్త వెంకటరమణను కర్రలతో కొట్టారని మంగమ్మ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త ఆత్మహత్యకు కారకులైన పెద్దాడ అప్పలరాజు, ఈశ్వరమ్మ, తన రెండో కుమార్తె రూపలపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండు చేసింది. భర్త మృతితో మంగమ్మ భోరున విలపించింది.

Updated Date - 2020-10-19T17:46:07+05:30 IST