ఆలయ ప్రాంగణంలోనే అప్పన్న వైకుంఠ ద్వార దర్శనం

ABN , First Publish Date - 2020-12-12T04:22:46+05:30 IST

ఈనెల 25న ముక్కోటి ఏకాదశి నాడు సింహాద్రినాథుడు ఆలయ ప్రాంగణంలోనే భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఆలయ ప్రాంగణంలోనే అప్పన్న వైకుంఠ ద్వార దర్శనం
ఉత్తర ద్వారాన్ని శుభ్రపరస్తున్న సిబ్బంది

సింహాచలం, డిసెంబరు 11: ఈనెల 25న ముక్కోటి ఏకాదశి నాడు సింహాద్రినాథుడు ఆలయ ప్రాంగణంలోనే భక్తులకు దర్శనమివ్వనున్నారు. కరోనా నిబంధనలతో గతంలో మాదిరిగా ఉత్తర రాజగోపురం వద్ద ప్రత్యేక వేదిక ఏర్పాటుచేసి భక్తులకు దర్శనాలు కల్పించడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. దీంతో సంప్రదాయం ప్రకారం దేవాలయ ఉత్తర ద్వారంలోనే స్వామివారి దర్శనం భక్తులకు కల్పిస్తామన్నారు. ఇందులో భాగంగా ఉత్తర ద్వారాన్ని శుభ్రం చేసే కార్యక్రమాన్ని సిబ్బంది చేపట్టారు. ఎస్‌బీటీ టిక్కెట్ల కౌంటర్‌వైపు ప్రత్యేక క్యూ లైన్ల ఏర్పాటులో ఇంజనీరింగ్‌ సిబ్బంది నిమగ్రమయ్యారు. 

 

పోలిపాడ్యమికి భక్తులకు అనుమతి లేదు

మార్గశిరమాస ప్రారంభం రోజు ఈ నెల 15న పోలిపాడ్యమి సందర్భంగా సింహాచలం వరాహ పుష్కరిణిలో భక్తుల స్నానాలు, దీపారాధనలకు అవకాశం లేదని దేవస్థానం ఏఈవో కేకే రాఘవకుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏటా పోలిపాడ్యమి సందర్భంగా కొండదిగువ వరాహ పుష్కరిణిలో వేలాదిమంది మహిళా భక్తులు స్నానమాచరించి, ప్రత్యేక దీపారాధనలు చేయడం ఆనవాయితీ. ఈ ఏడాది కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో పుష్కరిణిలో దీపారాధనలకు అనుమతించడం లేదన్నారు. భక్తులు గమనించి సహకరించాలని కోరారు.

 

నేడు తెరచుకోనున్న రెండో టోల్‌గేట్‌

 సింహగిరికి చేరుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన రెండో టోల్‌గేటును శనివారం నుంచి తెరచి, భక్తుల ప్రవేశాలకు అనుమతిస్తామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వాండ్ర త్రినాథరావు తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు అమల్లోకి వచ్చిన మార్చి 23 నుంచి ఈ ఘాట్‌రోడ్డులో రాకపోకలను నిలుపుదల చేశారు. కొద్ది రోజులుగా సింహాచల గోశాల కూడలి నుంచి పాత అడివివరం కూడలి వరకు తరచూ ఏర్పడుతున్న ట్రాఫిక్‌ ఇబ్బందుల నివారణ చర్యల్లో భాగంగా హనుమంతువాక బీఆర్‌టీఎస్‌ రోడ్డులోని రెండో టోల్‌గేట్‌ను తెరవనున్నామన్నారు. భక్తుల సౌకర్యార్దం ఈ టోల్‌గేట్‌ వద్ద ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసి రూ.100, రూ.300 దర్శనం టికెట్లను కూడా విక్రయించాలని నిర్ణయించామన్నారు. 

Updated Date - 2020-12-12T04:22:46+05:30 IST