పురాతన ఇళ్లు.. చూస్తే గుండె ఝల్లు!

ABN , First Publish Date - 2020-12-03T05:51:49+05:30 IST

పట్టణంలో పురాతన భవనాలు భయపెడుతున్నాయి. కొన్ని శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిని ఆనుకుని ఉన్న ఇళ్లలోనివారు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని హడలి పోతున్నారు

పురాతన ఇళ్లు.. చూస్తే గుండె ఝల్లు!
నర్సీపట్నం మెయిన్‌ రోడ్డును ఆనుకొని ఉన్న పురాతన భవనాలు

  నర్సీపట్నంలో భయపెడుతున్న గృహాలు

 అత్యంత ప్రమాదకరంగా మారినా.. పలువురు నివాసం

  నోటీసులతో సరిపెడుతున్న అధికారులు

 అనకాపల్లి ఘటనతోనైనా అధికారులు స్పందించాలని పలువురు వేడుకోలు

 నర్సీపట్నం, డిసెంబరు 2 : పట్టణంలో పురాతన భవనాలు భయపెడుతున్నాయి. కొన్ని శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిని ఆనుకుని ఉన్న ఇళ్లలోనివారు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని హడలి పోతున్నారు. భారీ వర్షాల సమయాల్లో వీరిలో ఆందోళన మరింత అధికమవుతుంది. తుఫాన్‌ కారణంగా కురిసిన వర్షాలకు ఆదివారం అనకాపల్లిలో పురాతన భవనం కూలి ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే, ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఆ పరిసరాల వారికి కంటిమీద కునుకు ఉండడం లేదు. గత్యం తరం లేక కొందరు ఈ ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. ఈ భవనాలు ఇంత ప్రమాదకరంగా మారినా మునిసిపల్‌ అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

49 పాడుబడిన భవనాల గుర్తింపు

 పట్టణంలో 49 పాడుబడిన భవనాలను గుర్తించి సచివాలయ సిబ్బంది నోటీసులు జారీ చేశారు. నివాసయోగ్యం కాని భవనం వల్ల ప్రమాదమని, సొంత ఖర్చులతో తక్షణమే సదరు భవనాలను కూల్చా లని అందులో పేర్కొన్నారు. నాలుగైదు భవనాల్లో యజమానులు నివాసం ఉంటున్నారు. మిగిలిన భవనాలు పిచ్చి మొక్కలు మొలిచి బూత్‌బంగ్లాను తలపిస్తున్నాయి. నర్సీపట్నం- చింతపల్లి రోడ్డులో కృష్ణాబజార్‌ దాటిన తర్వాత  మెయిన్‌ రోడ్డును ఆనుకొని ఉన్న పాడుబడిన భవనాలు భయం గొలుపుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డులో పొరపాటున ఈ భవనాలు కూలితే పెను ప్రమాదం తప్పదని అంటున్నారు. అనకాపల్లి తరహాలో ఘటన ఇక్కడ తలెత్తకుండా అధికారులు తక్షణమే స్పందించాలని అంతా కోరుతున్నారు. 

Updated Date - 2020-12-03T05:51:49+05:30 IST