జీవో 77 రద్దుకు దళిత సంఘాల డిమాండ్‌

ABN , First Publish Date - 2020-12-30T04:55:38+05:30 IST

ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో చదివే పీజీ విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 77ను వెంటనే రద్దు చేయాలని జిల్లా దళిత ఐక్యవేదిక కన్వీనర్‌ బూసి వెంకటరావు డిమాండ్‌ చేశారు.

జీవో 77 రద్దుకు దళిత సంఘాల డిమాండ్‌
నిరసన వ్యక్తం చేస్తున్న దళిత ఐక్యవేదిక ప్రతినిధులు

డాబాగార్డెన్స్‌, డిసెంబరు 29: ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో చదివే పీజీ విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 77ను వెంటనే రద్దు చేయాలని జిల్లా దళిత ఐక్యవేదిక కన్వీనర్‌ బూసి వెంకటరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఐక్యవేదిక, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఆధ్వర్యంలో డాబాగార్డెన్స్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మంగళవారం నిరసన తెలిపారు. వైఎస్‌ ఆశయాలు, పేదల సంక్షేమమని దళితుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్‌ తండ్రి పెట్టిన పథకాలు తుంగలోకి తొక్కుతున్నారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం రద్దుకు పూనుకోవడం బడుగుల విద్యా భవిష్యత్తును నాశనం చేయడమేనని దుయ్యబట్టారు. ఈ జీవో కారణంగా లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను పీజీ విద్యకు దూరం చేశారన్నారు. ఇప్పటికే బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ రద్దు చేశారని, విదేశీ విద్యాకానుక నిలిపి వేశారని దళితులపై కక్షపూరిత వైఖరితోనే జగన్‌మోహన్‌రెడ్డి ఈ జీవోలు జారీ చేశారని మండిపడ్డారు. కో కన్వీనర్‌ కొత్తపల్లి వెంకటరమణ  మాట్లాడుతూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యా విధానం పూర్తిగా ప్రభుత్వమే నడపాలన్నారు. కార్యక్రమంలో జి.రాంబాబు, సి.సూర్యం, సుజాత, సుధాకర్‌, నూకరాజు, రాంబాబు, కృష్ణారావు, పాపారావు, సత్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-30T04:55:38+05:30 IST