పాడిరైతులకు అండగా విశాఖ డెయిరీ

ABN , First Publish Date - 2020-12-13T05:30:00+05:30 IST

పాడి రైతులకు విశాఖ డెయిరీ అండగా ఉంటుందని డెయిరీ వైస్‌ చైర్మన్‌ ఆడారి ఆనంద్‌కుమార్‌ అన్నారు.

పాడిరైతులకు అండగా విశాఖ డెయిరీ
పాలసంఘాల సిబ్బంది సమావేశంలో మాట్లాడుతున్న ఆనంద్‌కుమార్‌

డెయిరీ వైస్‌ చైర్మన్‌ ఆడారి ఆనంద్‌కుమార్‌


చోడవరం, డిసెంబరు 13: పాడి రైతులకు విశాఖ డెయిరీ అండగా ఉంటుందని డెయిరీ వైస్‌ చైర్మన్‌ ఆడారి ఆనంద్‌కుమార్‌ అన్నారు. ఆదివారం స్థానిక డెయిరీ నోడల్‌ కార్యాలయంలో పాల సంఘాల అధ్యక్ష, కార్యదర్శులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒడిశా, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి సుమారు 5 వేల మేలిరకం పాడి పశువులను తీసుకువచ్చి రైతులకు అందించేందుకు నిర్ణయించామన్నారు.  ఈ పశువుల రవాణా,  నెలకు సరిపడా దాణా, మినరల్‌ మిక్చర్‌, ఏడాదికి బీమా ఉచితంగా డెయిరీ భరిస్తుందన్నారు. పశువులకు పుట్టే ఆడ పెయ్యిలను 22నెలల వరకూ సంరక్షించిన పాడిరైతులకు ప్రోత్సాహకంగా రూ.3వేలు అందిస్తామన్నారు. పాలసంఘంలో 59 సంవత్సరాల లోపు వయసున్న  సభ్య రైతు మరణిసేత అతని వారసులకు చైర్మన్‌ రిలీఫ్‌ ఫండ్‌ కింద రూ.లక్ష పరిహారం చెల్లిస్తామన్నారు. వచ్చే ఏడాదికి జిల్లాలో రోజుకి 10 లక్షల లీటర్ల పాలసేకరణ లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. సమావేశంలో డెయిరీ డైరెక్టర్లు దాడి గంగరాజు, గేదెల సత్యనారాయణ, శీరంరెడ్డి సూర్యనారాయణ,  డెయిరీ అధికారి కేవీ ప్రసాద్‌, చోడవరం యూనిట్‌ మేనేజర్‌ జి.రాము, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-13T05:30:00+05:30 IST