-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » CURFEW COMPLETED
-
స్వచ్ఛందం, సంపూర్ణం
ABN , First Publish Date - 2020-03-23T08:53:24+05:30 IST
జనతా కర్ఫ్యూ విశాఖపట్నంలో నూరు శాతం విజయవంతమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపునకు ప్రజలంతా పూర్తిగా...

- జనతా కర్ఫ్యూ విజయవంతం
- కరోనా కట్టడికి అన్ని వర్గాల సహకారం
- సర్వం బంద్
- రహదారులన్నీ నిర్మానుష్యం
- మెడికల్ దుకాణాలు, పాల బూత్‌లు మినహా అన్నీ మూసివేత
- ఎక్కడికక్కడ నిలిచిన రవాణా
- అన్ని జంక్షన్లలో పోలీసు బందోబస్తు
- 31 వరకు రైళ్లన్నీ రద్దు
- గూడ్సు రైళ్లకే అనుమతి
- టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి సొమ్ము వాపసు
(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం) : జనతా కర్ఫ్యూ విశాఖపట్నంలో నూరు శాతం విజయవంతమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపునకు ప్రజలంతా పూర్తిగా సహకరించారు. స్వీయ నిర్బంధం పెట్టుకొని ఇళ్లకే పరిమితమయ్యారు. చిన్న, పెద్ద అంతా ఇంట్లోనే కాలక్షేపం చేశారు. అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రధాన గేట్లకు తాళాలు వేసేశారు. బయటవారు లోపలకు రాకుండా, లోపలివారు బయటకు వెళ్లకుండా అందరి అంగీకారంతో నిర్బంధం విధించారు. అత్యవసర పనులన్నా ఎవరూ బయటకు రాలేదు. అన్ని పనులు వాయిదా వేసుకున్నారు. ఉదయం ఆరు గంటల నుంచే రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. 24 గంటలూ రద్దీగా వుండే ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్, విమానాశ్రయం ప్రాంతాలు బోసిపోయాయి. బస్సులు కాంప్లెక్స్‌కే పరిమితమయ్యాయి. ప్లాట్‌ఫారాలపై రైళ్లు నిలిచిపోయాయి. రవాణా వాహనాలు ఒక్కటి కూడా ఎక్కడా కనిపించలేదు. నిత్యవసరాలైన పాల ఉత్పత్తులు సరఫరా చేసే డెయిరీ వాహనాలు సైతం ఉదయం ఆరు గంటలలోపే అన్నింటిని సరఫరా చేసి గమ్యస్థానాలకు చేరుకున్నాయి. ఆటోలకు కూడా బ్రేకులు పడ్డాయి. ప్రైవేటు వాహనాలు కూడా నిలిచిపోయాయి.
ఒక్క ప్రమాదం లేదు...తగ్గిన కాలుష్యం
ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు రోడ్లపై వాహనాలు ఏవీ తిరగకపోవడంతో విశాఖ నగరంలో ఒక్క ప్రమాదం కూడా చోటు చేసుకోలేదు. ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. పెట్రోల్ బంకులన్నీ మూసివేశారు. జాతీయ రహదారిపై వున్నవాటిలో ఒకటి అరా అత్యవసరమని తెరిచినా కొద్ది నిమిషాల్లో క్లోజ్ చేసేశారు. దీని వల్ల ఐదు లక్షల లీటర్ల డీజిల్, లక్ష లీటర్ల పెట్రోల్ అమ్మకాలు ఆగిపోయాయి. ఈ మేరకు కాలుష్యం తగ్గిందని కాలుష్య నియంత్రణ అధికారులు చెబుతున్నారు. వాహనాలు రోడ్లపై తిరగడం వల్ల రేగే దుమ్ము, ధూళి కూడా ఆదివారం ఎక్కడా కానరాలేదని పేర్కొన్నారు.
పోలీసు బందోబస్తు
ప్రజలు అనవసరంగా రహదారుల పైకి వస్తే వారికి అవగాహన కల్పించి ఇళ్లకు తిరిగి పంపడానికి పోలీసులు అన్ని ప్రధాన జంక్షన్లలోను బందోబస్తు నిర్వహించారు. అయితే పోలీసులకు ఆ అవసరం రాకుండా ప్రజలు సహకరించారు. అక్కడక్కడ కొందరు వాహనాలపై రోడ్లపైకి రాగా వారి ఫొటోలు తీసుకొని పంపించివేశారు.
పారిశుధ్యం పర్యవేక్షణ
నగరంలో ఆదివారం మొత్తం కర్ఫ్యూ కావడంతో పారిశుధ్యం పనులకు జీవీఎంసీ అధికారులు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం ఆరు వేల పారిశుద్ధ్య సిబ్బందిని రంగంలో దించి ఎక్కడికక్కడ రోడ్లను పరిశుభ్రం చేయించి, చెత్తకుండీలు, డంపర్‌బిన్లను ఖాళీ చేయించారు. జీవీఎంసీ ప్రధాన ఆరోగ్య అధికారి డాక్టర్ శాస్ర్తి రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 11 గంటల వరకు నగరమంతా తిరుగుతూ పారిశుధ్య పరిస్థితిని పరీక్షించారు. కరోనా పాజిటివ్ కేసు నమోదైన అల్లిపురం ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. కొబ్బరితోటలో అమ్మవారి పండుగ నిర్వహిస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్లి వాకబు చేశారు.
హర్షధ్వానాలతో అభినందనలు
కరోనా కట్టడి కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది, పారిమెడికల్ సిబ్బందికి, పోలీసులు, ఇతరులు అందరినీ అభినందిస్తూ ప్రజలు సాయంత్రం ఐదు గంటలకు ఇళ్ల నుంచి బయటకు వచ్చి హర్షధ్వానాలతో అభినందనలు తెలిపారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ వినయ్‌చంద్, సెలవులో వున్న జీవీఎంసీ కమిషనర్ సృజన, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.