రద్దు చేసిన టర్కీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠా గుట్టురట్టు

ABN , First Publish Date - 2020-12-03T06:04:29+05:30 IST

టర్కీ దేశానికి చెందిన రద్దైన కరెన్సీ నోట్లను నగరంలో చలామణి చేస్తున్న ముఠా గుట్టును ఎంవీపీ పోలీసులు రట్టుచేశారు. ముఠాకు చెందిన కీలక సభ్యుడు పరారీలో ఉండగా, ఆరుగురిని అరెస్టు చేశారు.

రద్దు చేసిన టర్కీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠా గుట్టురట్టు
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న రద్దైన కరెన్సీని చూపిస్తున్న ద్వారకా ఏసీపీ ఆర్‌వీకే మూర్తి

ఆరుగురు అరెస్టు

300 రద్దైన నోట్లు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం

విశాఖపట్నం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): టర్కీ దేశానికి చెందిన రద్దైన కరెన్సీ నోట్లను నగరంలో చలామణి చేస్తున్న ముఠా గుట్టును ఎంవీపీ పోలీసులు రట్టుచేశారు. ముఠాకు చెందిన కీలక  సభ్యుడు పరారీలో ఉండగా, ఆరుగురిని అరెస్టు చేశారు. వీరివద్ద నుంచి రద్దైన 300 టర్కీ దేశపు కరెన్సీ నోట్లు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌ కమిషనరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ద్వారకా ఏసీపీ ఆర్‌వీకే మూర్తి దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం బాసివలసకు చెందిన బుజ్జల రామస్వామి(33)కి వేపగుంట ప్రాంతానికి చెందిన రవి అనే వ్యక్తి కొద్దిరోజుల కిందట టర్కీ దేశంలో రద్దైన 300 కరెన్సీ నోట్లను అందజేశాడు. మన దేశంలో ఒక్కో నోటు విలువ రూ.ఐదు లక్షలు ఉంటుందని, తక్కువ మొత్తానికి ఇస్తామని చెప్పి ఎవరికైనా వాటిని విక్రయించాలని సూచించాడు. దీంతో రామస్వామి తనకు స్నేహితుడైన కప్పరాడలోని గిరిజానగర్‌కు చెందిన నంబారి నారాయణరావు(40)కి విషయం చెప్పాడు. నారాయణరావు, కంచరపాలెం ఏఎస్‌ఆర్‌ నగర్‌కు చెందిన దొమ్మేటి వెంకట ప్రసాద్‌(46), మద్దిలపాలెం రెడ్డివీధికి చెందిన దలాయి యశోద(42), ఒంగోలులోని జయప్రకాశ్‌కాలనీకి చెందిన ఇండిల పృఽథ్వీరాజ్‌(26), అక్కయ్యపాలెం లలితానగర్‌కు చెందిన మువ్వల ప్రసాద్‌(32)కి చెప్పాడు. వీరంతా కలిసి నోట్లను నగరంలో తమకు తెలిసినవారికి ఎంతోకొంత మొత్తానికి ఇచ్చి, ఎక్కువకు అమ్ముకోవచ్చునని ఆశ చూపడం ద్వారా మోసం చేయాలని నిర్ణయించుకున్నారు. నోట్లను మార్పిడి చేసేందుకు రామస్వామి మంగళవారం రాత్రి కృష్టాకాలేజీ ఎదురుగా ఉన్న రోడ్డులో వేచివుండగా, ఎంవీపీ సీఐ రమణయ్యకు సమాచారం అందింది. దీంతో సీఐ రమణయ్య తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లేసరికి రామస్వామి పారిపోయేందుకు యత్నించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని సోదా చేయగా టర్కీ దేశానికి చెందిన రద్దైన నోట్లు 280 లభ్యమయ్యాయి. అతన్ని మరింత లోతుగా విచారించగా మిగిలినవారి వివరాలను వెల్లడించారు. వారందరినీ పట్టుకుని సోదాలు నిర్వహించగా ఒక్కొక్కరి దగ్గర నాలుగేసి చొప్పున నోట్లు లభించాయి. వారందరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని, పరారీలో ఉన్న రవి కోసం గాలిస్తున్నామని ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో ఎంవీపీ సీఐ రమణయ్య పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-03T06:04:29+05:30 IST