కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఆకలి కేకలు

ABN , First Publish Date - 2020-07-10T09:50:21+05:30 IST

నగరంలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఆకలి కేకలతో దద్దరిల్లిపోతున్నాయి. బాధితులు ఒక్కొక్కరికి ఆహారం కోసం రోజుకు రూ.500 ..

కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఆకలి కేకలు

కరోనా బాధితులకు అందని పౌష్టికాహారం

ఒకపూట పులిహోరతోనే సరి

మరోపూట అన్నం, రసం, కూర సరఫరా

స్నాక్స్‌గా అరటిపళ్లు

కానరాని సురక్షిత తాగునీరు... ట్యాంకు నుంచే సరఫరా

పడకలు లేక వరండాలోనే వసతి

ఇదీ మారికవలస కేంద్రంలో పరిస్థితి


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): నగరంలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఆకలి కేకలతో దద్దరిల్లిపోతున్నాయి. బాధితులు ఒక్కొక్కరికి ఆహారం కోసం రోజుకు రూ.500 ఇస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెబుతుండగా... ఇక్కడ బిల్లులు ఇవ్వడం లేదని అరకొరగా ఆహారం అందిస్తున్నారు. విశాఖపట్నంలో ఈ నెల మొదటి వారం నుంచి కరోనా బాధితుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతున్నది. గురువారం ఒక్క రోజే 144 కేసులు నమోదయ్యాయి. రోజుకు సగటున వంద కేసుల వరకు వస్తున్నాయి.


పాజిటివ్‌గా నివేదిక రాగానే.... వైద్యాధికారులు బాధితుల ఇళ్లకు వెళ్లి ఉన్నపళంగా అంబులెన్స్‌లో ఎక్కించి కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు తరలిస్తున్నారు. నగర శివార్లలో ఈ సెంటర్లు ఉన్నాయి. గీతం కాలేజీలో వసతులు, ఆహారం బాగుండటంతో వీఐపీ బాధితులు అంతా రికమెండ్‌ చేయించుకొని అక్కడికి వెళుతున్నారు. మిగిలినవారిని ఎక్కడ పడకలు ఖాళీ ఉంటే అక్కడికి అధికారులు పంపుతున్నారు. అయితే ఆ సెంటర్లలో పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి.


11 గంటలకు వెళితే.. రాత్రి 9 గంటల వరకు పడక లేదు

సింహాచలంలో గురువారం ఒక్క రోజే 12 కేసులు గుర్తించారు. వారిని మారికవలసలోని గాయత్రి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు ఉదయం 11 గంటలకు తీసుకెళ్లారు. పలుమార్లు వేడుకున్న మీదట మధ్యాహ్నం మూడు గంటలకు భోజనం పెట్టారు. తాగునీటి కోసం క్యూలో నిల్చొంటే ఒక బాటిల్‌ ఇస్తున్నారు. రాత్రి 9 గంటల వరకు పడకలు కేటాయించలేదు. పడకలు ఖాళీ లేవని చెప్పి వరండాలో కూర్చోబెట్టారు. పడకలు ఖాళీ లేని సెంటర్‌కు బాధితులను ఎలా తరలిస్తారు? అధికారుల మధ్య సమన్వయం లేదా? అని ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. 


పౌష్టికాహారంగా పులిహోర!

మారికవలసలోని ఏపీ గిరిజన గురుకులాన్ని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చారు. అక్కడ వందలాది మంది ఉన్నారు. అక్కడ రోగులకు తాగడానికి ట్యాంకు నీరు సరఫరా చేస్తున్నారు. వాటర్‌ బాటిల్స్‌ ఇవ్వడం లేదు. పౌష్టికాహారం పేరుతో ఒక పూట పులిహోర, మరో పూట అన్నం, రసం, కూర ఇస్తున్నారు. స్నాక్స్‌ కింద అరటిపళ్లు ఇస్తున్నారు. మందులు కూడా అవసరమైనన్ని ఇవ్వడం లేదు.


కరోనా బాధితులకు రోగం ఏదీ ఉండదని, జ్వరం తగ్గడానికి మాత్రలు వేసుకుంటూ, పౌష్టికాహారం తీసుకుంటే కోలుకుంటారని వైద్యులు చెబుతుంటే.. ఇక్కడ అవేమీ ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇక్కడ ఆశ్రయం పొందుతున్నవారు తమ సమస్యలను తెలియజేస్తూ బీజేపీ నగర అధ్యక్షుడు ఎం.రవీంద్రకు లేఖ రాశారు. అందులో వారి పేర్లు, ఫోన్‌ నంబర్లు కూడా పెట్టారు. తమకు అందిస్తున్న పులిహోర, అన్నం, రసం ఫొటోలు పంపారు. తక్షణమే నోడల్‌ అధికారి తగిన చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు. 


ఇవ్వాల్సిన ఆహారం

ఉదయం:

ఇడ్లీ 2 + గారె 2 / గోధుమ రవ్వ ఉప్మా + మైసూర్‌ బోండా 2 / బియ్యం నూక ఉప్మా + పూరీ 2 / టామాటా బాత్‌ + పునుగులు 2. వీటిని రోజు విడిచి రోజూ మారుస్తూ ఇవ్వాలి.


మధ్యాహ్నం:


ఉడికించిన గుడ్డు, స్వీట్‌, ఫ్లేవర్‌ రైస్‌, పప్పు, గుజ్జుకూర, వేపుడు కూర, పచ్చడి, అన్నంతో పాటు సాంబారు అన్నం(స్పెషల్‌ ప్యాకింగ్‌), పెరుగు అన్నం(స్పెషల్‌ ప్యాకింగ్‌) ఇవ్వాలి.


సాయంత్రం:

రోజుకో రకం పండు, బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, కిస్‌మిస్‌ 100 గ్రాములు ఇవ్వాలి. వీటితోపాటు చేగొడీలు లేదా కారప్పూస, బూందీ అందించాలి.


రాత్రికి:

పప్పు, గుజ్జుకూర, వేపుడు కూర, సాంబారు, రసం, అన్నం ఇవ్వాలి. 

అన్నం తినని వారు ఎవరైనా ఉంటే వారికి చపాతీలు అందించాలి.

Updated Date - 2020-07-10T09:50:21+05:30 IST