బాణసంచా విక్రయాలపై వీడని సందిగ్ధం!
ABN , First Publish Date - 2020-11-13T06:10:12+05:30 IST
దీపావళి పండుగ సమీపించినా బాణ సంచా విక్రయాలపై పోలీసుల నుంచి అనుమతి లభించకపోవడం వ్యాపా రులను సందిగ్ధంలో పడేసింది.
పండుగ సమీపించినా ‘పట్నం’లో పోలీసుల నుంచి లభించని అనుమతి
అగ్నిమాపక శాఖ ఎన్‌వోసీలు జారీ
మునిసిపల్, రెవెన్యూ శాఖలు కూడా ఒకే
రెండు రోజులుగా కాళ్లరిగేలా తిరుగుతున్న వ్యాపారులు
నర్సీపట్నం టౌన్, నవంబరు 12 : దీపావళి పండుగ సమీపించినా బాణ సంచా విక్రయాలపై పోలీసుల నుంచి అనుమతి లభించకపోవడం వ్యాపా రులను సందిగ్ధంలో పడేసింది. ప్రభుత్వం మంగళవారమే ఇందుకు సంబంఽ దించి 692 జీవోను విడుదల చేసింది. దుకాణా మధ్య పది అడుగుల దూరం ఉండాలని, కొనుగోలుదారులు ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలని సూచించింది. దీపావళి రోజున బాణసంచా కాల్చేందుకు రాత్రి ఎనిమిది నుంచి పది గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చింది. శానిటేజర్లు వాడవద్దని, గ్రీన్ క్రేకర్స్ మాత్రమే వాడాలని నిబంధనలు విధించింది.
25 మంది దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులు
ఇదిలావుంటే, నర్సీపట్నంలో 25 మంది దుకాణాల ఏర్పాటుకు అనుమతులు కోరుతూ దరఖాస్తులు చేసుకున్నారు. ఇందుకోసం అగ్నిమాపక శాఖ రూ.500 చలానా కట్టించుకొని ఎన్‌వోసీ ఇచ్చింది. మునిసిపాలిటీ రూ.1000, టీపీవో రూ.1850, రెవెన్యూ శాఖ రూ.900 చలానాలు కట్టించుకున్నాయి. మందుగుండు సామగ్రి కోసం హోల్‌సేల్ వ్యాపారులకు రూ.లక్షలు అడ్వాన్సులు చెల్లించారు. పెద్ద చెరువు వద్ద టెంట్లు ఏర్పాటు చేసుకున్నారు. అయితే పోలీసుల అనుమతి కోసం రెండు రోజులుగా కాళ్లరిగేలా తిరుగుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వనిదే తాము ఏమీ చేయలేమని స్థానిక పోలీసులు చెప్పడంతో దుకాణదారులు అయోమయంలో పడ్డారు. హోల్‌సేల్ వ్యాపారులకు చెల్లించిన అడ్వాన్సుల పరిస్థితి తలుచుకొని బాధ పడుతున్నారు. ఇదిలావుంటే, గ్రీన్ క్రేకర్స్ మాత్రమే విక్రయించాలని ముందుగానే ప్రచారం చేసి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.