త్యాగధనులు కొవిడ్ యోధులు: వాసుపల్లి గణేశ్‌కుమార్
ABN , First Publish Date - 2020-07-27T14:46:38+05:30 IST
కరోనాతో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న యోధుల త్యాగనిరతిని..

మహారాణిపేట(విశాఖపట్నం): కరోనాతో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న యోధుల త్యాగనిరతిని దేశం గుర్తిస్తుందని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు సంఘీభావంగా ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు, నర్సులు, సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది తమ ధైర్యసాహసాలతో దేశరక్షణ కోసం పోరాడే సైనికుల సరసన చేరారన్నారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, అయినా మనోధైర్యంతో పోరాడుతున్న మిగిలిన వారిలో స్ఫూర్తి నింపేందుకే ఈ సంఘీభావమని చెప్పారు. వారికి సంపూర్ణ ఆరోగ్యం, శక్తి భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే జిల్లాలో కేసుల సంఖ్య పెరిగిందని, భవిష్యత్తులో రోజుకి మూడువేల కేసులు నమోదైనా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పారు. మన రాష్ట్రంలో 17 కొవిడ్ టెస్ట్ ల్యాబ్‌లున్నాయని, ఇతర రాష్ట్రాల కంటే ఇవి తక్కువని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంతో వ్యవహరించి కరోనా కట్టడిలో పూర్తిగా విఫలమయ్యిందని ఆరోపించారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకే తమ దీక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు డాక్టర్ సోమయాజులు, గనగళ్ళ సత్య, రాజ్యలక్ష్మి, కండేలరాజు, నాగోతి శివాజీ తదితరులు పాల్గొన్నారు.