ఆదమరిచారో అంతే సంగతి...

ABN , First Publish Date - 2020-05-24T08:13:55+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూనే అనేక సడలింపులు ఇవ్వడంతో రహదారులపై జన సంచారం బాగా పెరిగింది.

ఆదమరిచారో అంతే సంగతి...

స్వీయ జాగ్రత్తలతోనే కరోనాకు చెక్‌

భౌతిక దూరం, మాస్క్‌, వ్యక్తిగత పరిశుభ్రత...ఈ మూడు చాలా కీలకం

లాక్‌డౌన్‌ ఎత్తేసినా ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందేనంటున్న వైద్యులు

లాక్‌డౌన్‌లో ఉన్నట్టుగానే జీవనం సాగించాలని సూచన

ఏమాత్రం అలసత్వం వహించినా వైరస్‌ బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరిక

ఇప్పట్లో పోయే అవకాశం లేదు

వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటేనే నియంత్రణ సాధ్యం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి):కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూనే అనేక సడలింపులు ఇవ్వడంతో రహదారులపై జన సంచారం బాగా పెరిగింది. షాపింగ్‌మాల్స్‌ మినహా అన్నిరకాల దుకాణాలు తెరుచుకున్నాయి. ఆర్టీసీ బస్సులతో పాటు ఆటోలు, ప్రైవేటు వాహనాలు కూడా రోడ్డెక్కాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో కార్యకలాపాలు పెరిగాయి. దీంతో జిల్లాలో ప్రస్తుతం లాక్‌డౌన్‌కు ముందటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా వుండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏమాత్రం అలసత్వం వహించినా కరోనా బారినపడే ప్రమాదం వున్నదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎంత అప్రమత్తంగా వున్నామో, అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా వుండాలని సూచిస్తున్నారు. ఏమాత్రం ఆదమరిచినా, నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని హెచ్చరిస్తున్నారు. బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించడంతో పాటు ముఖానికి మాస్క్‌ ధరించాలని సూచిస్తున్నారు. 


కేసులు గణనీయంగా పెరుగుదల

లాక్‌డౌన్‌ పక్కాగా అమలైన గత నెల 31వ తేదీ వరకు జిల్లాలో 25 కేసులు నమోదైతే...ఈ నెల ఒకటో తేదీ నుంచి మే 23 నాటికి అంతకు రెట్టింపు కేసులు (60) నమోదయ్యాయి. అంటే 23 రోజుల వ్యవధిలో 62 కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి కరోనా వ్యాప్తి ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలను క్రమంగా సడలించిన నేపథ్యంలో కేసులు భారీగా పెరిగే అవకాశముందని నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.  


లాక్‌డౌన్‌’ ఉన్నట్టే భావించాలి.. 

లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తేసినా లాక్‌డౌన్‌లో వున్నట్టే భావించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖానికి మాస్క్‌ ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడం...జీవితంలో భాగం చేసుకోవాలంటున్నారు. ఇప్పటికిప్పుడు కరోనా కట్టడి సాధ్యం కాదని స్పష్టంచేస్తున్నారు. ఎవరికి వారు తీసుకునే వ్యక్తిగత జాగ్రత్తలే కరోనా నుంచి రక్షణ కల్పిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కనీసం మరో ఏడాది పాటు వైరస్‌ వ్యాప్తి వేగంగా వుంటుందని, ఆ తరువాత నెమ్మదించే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సమాజంలో ఇప్పటికే ఎన్నోరకాల ఫ్లూ వైరస్‌లు వున్నాయని, వాటి మాదిరిగానే ఈ వైరస్‌ స్థిరపడుతుందని, అయితే, మిగిలిన వైరస్‌లతో పోలిస్తే దీని తీవ్రత, వ్యాప్తిలో వేగం ఎక్కువగా వున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 


కనీసం రెండేళ్లపాటు ప్రభావం ఉంటుంది.. డాక్టర్‌ పీఎస్‌ఎస్‌ శ్రీనివాసరావు, జనరల్‌ ఫిజీషియన్‌ 

కరోనా వైరస్‌ ప్రస్తుతం మన సమాజంలో వున్న పలు ఫ్లూ వైరస్‌ల జాతికి చెందినదే. కాకపోతే దీని ప్రభావం, తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 198 మంది రకాల కొవిడ్‌ వైరస్‌ విజృంభిస్తుంటే మన దేశానికి 30 రకాలు మాత్రమే వచ్చాయి. వీటి తీవ్రత కూడా చాలావరకు తక్కువగా ఉంది. సాధారణంగానే మన జీవనశైలి, వ్యాధి నిరోధకశక్తి కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు దోహదం చేస్తోంది. అందుకే మన దేశంలో వైరస్‌ బారినపడిన వారి సంఖ్య తక్కువగా ఉంది. అదే సమయంలో మరణాలు తక్కువగా నమోదవుతున్నాయి. వైరస్‌ దాని ప్రభావాన్ని ఎప్పుడు, ఎలా మార్చుకుంటుందో తెలియదు. కాబట్టి, ప్రజలంతా అప్రమత్తంగా వుంటూ కొవిడ్‌ నియంత్రణ జాగ్రత్తలు పాటించాలి.


వైరస్‌తోనే ఉన్నామని గుర్తించాలి.. డాక్టర్‌ ఎస్‌.తిరుపతిరావు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి

కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా, అసలు నమోదు లేకపోయినా సరే...వైరస్‌తోనే వున్నామన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలి. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తరువాత ప్రజలు బయటకు రావడం పెరిగింది. అయితే, కరోనా వైరస్‌ పూర్తిగా తగ్గిపోయిందన్న ఆలోచనను ప్రజలు పక్కనపెట్టాలి. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ, ముఖానికి మాస్క్‌ ధరిస్తూ, పరిశుభ్రత పాటించాలి. బయటకు వెళ్లినప్పుడు చేతులను శుభ్రం చేసుకోకుండా నోరు, ముక్కు, కళ్లను తాకకూడదు. వైరస్‌కు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌, మందు వచ్చేంత వరకు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.


Updated Date - 2020-05-24T08:13:55+05:30 IST