కొవిడ్‌ బారిన గురువులు

ABN , First Publish Date - 2020-11-06T05:38:55+05:30 IST

జిల్లాలోని పలు మండలాల్లో ఉపాధ్యాయులకు కొవిడ్‌ పరీక్షలు గురువారం కూడా కొనసాగాయి. నర్సీపట్నం మునిసిపాలిటీ, మండల పరిఽధిలో ఎనిమిది మంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు ఎంఈవో సాయిశైలజ తెలిపారు.

కొవిడ్‌ బారిన గురువులు
విశాఖలోని ప్రకాశరావుపేట జీవీఎంసీ హైస్కూల్‌లో విద్యార్థినికి కరోనా పరీక్ష నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది.

‘నర్సీపట్నం’లో 8 మంది టీచర్లకు కరోనా

కొయ్యూరులో ఒకరికి...

సహచార ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో ఆందోళన

జిల్లాలో మరో 100 మందికి వైరస్‌

56,882కి చేరిన కేసులు

54,682 మంది డిశ్చార్జ్‌ 

చికిత్స పొందుతూ మరో ఇద్దరి మృతి

483కి చేరిన కొవిడ్‌  మరణాలు


విశాఖపట్నం/ నర్సీపట్నం టౌన్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో ఉపాధ్యాయులకు కొవిడ్‌ పరీక్షలు గురువారం కూడా కొనసాగాయి. నర్సీపట్నం మునిసిపాలిటీ, మండల పరిఽధిలో ఎనిమిది మంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు ఎంఈవో సాయిశైలజ తెలిపారు. గురువారం మొత్తం 179 మంది ఉపాధ్యాయులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా వీరిలో ఎనిమిది మంది వైరస్‌బారిన పడ్డారని చెప్పారు. వేములపూడి జడ్పీ హైస్కూల్‌లో ఇద్దరు, బలిఘట్టం జడ్పీ హైస్కూల్‌లో ఇద్దరు, నర్సీపట్నం జడ్పీ హైస్కూల్‌; తురకబడి జడ్పీ హైస్కూల్‌; వేములపూడి పీబీఎం జడ్పీ హైస్కూల్‌; ఏపీ మోడల్‌ స్కూల్‌లో ఒక్కొక్కరు, చొప్పున ఉపాధ్యాయులు వైరస్‌బారిన పడ్డారని పేర్కొన్నారు. దీంతో ఆయా పాఠశాలలకు చెందిన ఇతర ఉపాధ్యాయులు, సిబ్బందితోపాటు తొమ్మిది, పది తరగతుల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.


కొయ్యూరులో ఒక టీచర్‌కు....

కొయ్యూరు సీఏహెచ్‌ పాఠశాలలో ఎస్‌ఏగా పనిచేస్తున్న ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు రాజేంద్రపాలెం పీహెచ్‌సీ వైద్యాధికారి సంపత్‌బాబు తెలిపారు. బుధవారం 98 మందికి ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించగా వీరిలో 42 మంది ఉపాధ్యాయులు వున్నారని చెప్పారు.


జిల్లాలో మరో 100 మందికి వైరస్‌

జిల్లాలో గురువారం 100 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో కేసుల సంఖ్య 56,882కి చేరింది. వీరిలో 54,682 మంది వైరస్‌ నుంచి కోలుకోగా, మరో 1,717 మంది వైద్య సేవలు పొందుతున్నారు. కాగా చికిత్స పొందుతూ గురువారం మరో ఇద్దరు మృతి చెందడంతో కొవిడ్‌ మరణాలు 483కు చేరాయి. 


మన్యంలో 22 కేసులు

పాడేరు: ఏజెన్సీలో గురువారం 22 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.లీలాప్రసాద్‌ తెలిపారు. మండలాల వారీగా హుకుంపేటలో 7, కొయ్యూరులో 5, ముంచంగిపుట్టులో 3, అరకులోయలో 3, జీకేవీధిలో 2, చింతపల్లి, డుంబ్రిగుడల్లో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు.


‘పేటలో 3...: పాయకరావుపేట మండలంలో గురువారం మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పాయకరావుపేట పీహెచ్‌సీలో 34 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా సాయిఆదర్శనగర్‌, బృందావనానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు పాజిటివ్‌ వచ్చింది. శ్రీరాంపురం పీహెచ్‌సీ పరిధిలోని పాల్తేరులో 56 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా 62 ఏళ్ల మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.


Updated Date - 2020-11-06T05:38:55+05:30 IST