కరోనా టెస్ట్ చేయించుకున్న నెల రోజుల తర్వాత రిజల్ట్.. ఈ లోగా ఆ యువకుడు..

ABN , First Publish Date - 2020-09-05T15:50:18+05:30 IST

‘విశాఖ నగరంలో తాటిచెట్లపాలెం ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి గత నెల 20వ తేదీన కొవిడ్‌ పరీక్ష చేయించుకున్నాడు. వారం రోజులైనా ఫలితం రాలేదు. అప్పటికే శ్వాస తీసుకునేం దుకు ఇబ్బందిగా అనిపించడంతో నగరంలోని

కరోనా టెస్ట్ చేయించుకున్న నెల రోజుల తర్వాత రిజల్ట్.. ఈ లోగా ఆ యువకుడు..

ఫలితం.. తీవ్ర జాప్యం... కొవిడ్‌ పరీక్ష ఫలితాల వెల్లడిలో ఆలస్యం

ఓ యువకుడికి నెల రోజుల తరువాత సమాచారం

ఈలోగా హోమ్‌ ఐసోలేషన్‌ పూర్తిచేసుకున్న వైనం

ఏ విషయం తెలియకపోవడంతో మానసికంగా ఆందోళన చెందుతున్నవారు కొందరు

నెగెటివ్‌గా భావించి కలియతిరుగుతూ వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నవారు మరికొందరు..


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): ‘విశాఖ నగరంలో తాటిచెట్లపాలెం ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి గత నెల 20వ తేదీన కొవిడ్‌ పరీక్ష చేయించుకున్నాడు. వారం రోజులైనా ఫలితం రాలేదు. అప్పటికే శ్వాస తీసుకునేం దుకు ఇబ్బందిగా అనిపించడంతో నగరంలోని ఓ ప్రైవేటు ల్యాబ్‌కు వెళ్లి పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరి వైద్యం పొందుతున్నాడు. ఆ పరీక్ష ఫలితాల కోసం నిరీక్షించి వుంటే తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేదని సదరు వ్యక్తి వాపోతున్నాడు.’


‘అనకాపల్లి ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల వ్యక్తి తనతోపాటు పనిచేస్తున్న ఒకరికి పాజిటివ్‌గా తేలడంతో కొవిడ్‌ పరీక్ష చేయించుకున్నాడు. వారం దాటినా ఫలితం రాకపోవడంతో నెగెటివ్‌గానే భావించి అందరితోపాటు కలిసి తిరగడం ప్రారంభించాడు. తొమ్మిదో రోజు వచ్చిన ఫలితంలో పాజిటివ్‌గా తేలింది. అయితే సదరు వ్యక్తి అప్పటికే అందరితో కలిసి తిరిగేయడం వల్ల భార్యతోపాటు స్నేహితులకు కూడా వైరస్‌ వ్యాప్తి చెందింది.’


‘వాడ చీపురుపల్లి ప్రాంతానికి చెందిన ఒక యువకుడు గత నెల (ఆగస్టు) మూడో తేదీన కొవిడ్‌ పరీక్ష చేయించుకున్నాడు. రోజుల తరబడి వేచిచూసినా ఫలితం తెలియలేదు. అయినప్పటికీ వైరస్‌ సోకిందేమోనని ఆందోళన చెందిన యువకుడు ఫలితంతో సంబంధం లేకుండా ముందుగానే హోమ్‌ ఐసోలేట్‌ అయ్యాడు. సుమారు 12 రోజులపాటు ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాడు. అయితే, ఈనెల మూడో తేదీన వచ్చిన ఫలితాల్లో అతనికి నెగెటివ్‌గా తేలింది. నెల రోజుల తరువాత ఫలితం రావడంపై సదరు యువకుడు ఆవేదన వ్యక్తంచేశాడు’


విశాఖ జిల్లాలో కరోనా పరీక్ష ఫలితాల వెల్లడిలో తీవ్రజాప్యం జరుగుతుందని చెప్పేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రతిరోజూ వందలాది మందికి పరీక్షలు చేస్తున్నామని చెబుతున్న అధికారులు సకాలంలో ఫలితాలను వెల్లడించలేక పోతున్నారు. వైరస్‌ లక్షణాలతో బాధపడుతున్న వారికి అధికారులు యాంటీ జెన్‌, ఆర్టీపీసీఆర్‌, ట్రూనాట్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష చేయించుకునే వారి ఫలితాలు అర్ధ గంటలోనే వచ్చేస్తాయి. అయితే దీనిపై చాలామందిలో  అపోహలు ఉన్నాయి. వైరస్‌ లక్షణాలు ఏమాత్రం వున్నా పాజిటివ్‌గా చూపిస్తుందన్న ఆందోళనతో ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. కానీ ఫలితాలు సకాలంలో వెల్లడి కాకపోవడంతో వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


రెండు రకాల ఇబ్బందులు

ఫలితాలు ఆలస్యం కావడం వల్ల రెండు రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. వైరస్‌ లేకపోయినా ఫలితాలు ఆలస్యం కావడం వల్ల కొంతమంది మానసికంగా కుంగిపోతున్నారు. పరీక్షకు, ఫలితాలకు మధ్య తీవ్ర వేదనను అనుభవిస్తున్నారు. పాజిటివ్‌ వస్తే ఏమో గానీ,నెగెటివ్‌ అయి కూడా మనోవేదన అనుభవించాల్సి రావడం ఇబ్బందికరమని కొంతమంది పేర్కొంటున్నారు.


ఇకపోతే, మరికొంతమంది పరీక్షలు ఆలస్యం కావడాన్ని నెగెటివ్‌గానే భావించేసి, ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తూ మరికొంతమందికి వైరస్‌ వ్యాప్తి చెందేలా చేస్తున్నారు. పరీక్షలు వందల సంఖ్యలో చేయడం కంటే..తక్కువ సంఖ్యలో చేసైనా సకాలంలో ఫలితాలు వచ్చేలా చూడాలని, దీనివల్ల వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు అవకాశముంటుందని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలు ఫలితాలు రావడానికి ఆలస్యమవుతుండడంతో కొంతమంది ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇదే అదనుగా పలు ప్రైవేటు ల్యాబ్‌ల నిర్వాహకులు కరోనా నిర్ధారణ పరీక్షకు భారీమొత్తంలో వసూలు చేస్తూ దోచుకుంటున్నాయి. 

Updated Date - 2020-09-05T15:50:18+05:30 IST