మరో 3 పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-03-24T08:36:30+05:30 IST

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కరోనా వైరస్‌ జిల్లాలో చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే నగరంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కరోనా బారినపడి...

మరో 3 పాజిటివ్‌

 

  • పద్మనాభం మండలం రేవిడి వెంకటపురానికి చెందిన యువకుడికి కరోనా
  • వారం క్రితం లండన్‌ నుంచి రాక
  • లక్షణాలు ఏమీ లేవని ఎయిర్‌పోర్టులో వదిలేసిన సిబ్బంది
  • 19 నుంచి జ్వరం, జలుబు
  • మూడు రోజుల కిందట టీబీ ఆస్పత్రిలో చేరిక
  • పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ
  • కుటుంబ సభ్యులు సహా 20 మందితో సన్నిహితంగా మెలిగినట్టు గుర్తింపు
  • అందరినీ విమ్స్‌లోని క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించిన అధికారులు
  • జిల్లాలో మూడుకు చేరిన పాజిటివ్‌ కేసుల సంఖ్య
  • మరో 17 మంది రిపోర్ట్సు కోసం ఎదురుచూపులు
  • విమ్స్‌ క్వారంటైన్‌ సెంటర్‌లో 36 మంది

పద్మనాభం/విశాఖపట్నం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కరోనా వైరస్‌ జిల్లాలో చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే నగరంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కరోనా బారినపడి ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, తాజాగా లండన్‌ నుంచి వచ్చిన 25 ఏళ్ల యువకుడికి పాజిటివ్‌ వచ్చినట్టు అధికారులు సోమవారం ప్రకటించారు. దీంతో జిల్లాలో కరోనా వైరస్‌ బారినపడిన వారి సంఖ్య మూడుకు చేరింది. వివరాల్లోకి వెళితే...పద్మనాభం మండలం రేవిడి వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడు లండన్‌లో ఎంబీఏ చేస్తున్నాడు. ఈ నెల 17న లండన్‌ నుంచి ఢిల్లీ మీదుగా విమానంలో విశాఖ చేరుకున్నాడు. విమానాశ్రయంలో వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించిన సమయంలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవడంతో హోమ్‌ క్వారంటైన్‌లో వుండాలని సూచించి, ఇంటికి పంపించేశారు. అయితే ఇంటికి వచ్చిన రెండు రోజుల తరువాత అంటే ఈ నెల 19న జ్వరం, జలుబు వంటి లక్షణాలు కనిపించాయి. రెండు రోజులపాటు  ఇంట్లోనే వున్న యువకుడు ఎంతకీ తగ్గకపోవడంతో...21న గాయత్రీ విద్యా పరిషత్‌ ఆసుపత్రికి వెళ్లాడు. అతడిని పరీక్షించిన వైద్య నిపుణులు నగరంలోని ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రికి వెళ్లాలని సూచించడంతో అదేరోజు చేరిపోయాడు. బాధిత యువకుడి నుంచి నమూనాలు సేకరించిన వైద్యులు పరీక్షలకు పంపించగా, పాజిటివ్‌గా తేలింది. 

క్వారంటైన్‌కు సన్నిహితులు

కరోనా వైరస్‌ బారినపడిన యువకుడితో ఈ నాలుగు రోజుల్లో సన్నిహితంగా మెలిగిన 20 మందిని అధికారులు గుర్తించారు. వీరిలో కొంతమందిని హోమ్‌ క్వారంటైన్‌లో వుండాల్సిందిగా సూచించగా, మరికొంతమందిని విమ్స్‌లోని క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. వీరిలో కుటుంబ సభ్యులు ఏడుగురు, స్నేహితులు, బయటి వ్యక్తులు 13 మంది వున్నట్టు అధికారులు గుర్తించారు. 

మూడు కిలోమీటర్ల పరిధిలో సర్వే

కరోనా పాజిటివ్‌ కేసు నమోదైన బాధిత వ్యక్తి ఇంటి నుంచి సుమారు మూడు కిలోమీటర్ల పరిధిలో ఇంటింటి సర్వే చేపట్టారు. ఇందుకోసం అధికారులు 60 బృందాలను ఏర్పాటుచేశారు. వైరస్‌ బాధిత వ్యక్తిని ఎవరైనా, ఎప్పుడైనా కలిశారా అన్న వివరాలను సర్వే బృంద సభ్యులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే సర్వే బృందం రేవిడి వెంకటాపురం, రౌతులపాలెం, అన్నంపేట, బర్లపేట, సామయ్యవలస, మునివాసనిపాలెం, పాండ్రంగి తదితర గ్రామాల్లో సర్వే చేశారు. 

మూడుకు చేరిన కేసులు

తాజా కేసుతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య మూడుకు చేరినట్టైంది. ఇప్పటికే నగరంలోని అల్లిపురం ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలోని ఇద్దరు కరోనా వైరస్‌తో బాధపడుతూ చికిత్స పొందుతుండగా, తాజాగా రేవిడి వెంకటాపురం గ్రామానికి చెందిన ఈ యువకుడు వైరస్‌ బారినపడ్డాడు. అయితే, ప్రస్తుతం వీరి ముగ్గురి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే వుందని వైద్యులు చెబుతున్నారు. 

ఆరోజే క్వారంటైన్‌కు పంపిస్తే.. 

లండన్‌ నుంచి ఢిల్లీ, అక్కడి నుంచి విశాఖకు విమానంలో వచ్చిన యువకుడిని  అక్కడి అధికారులు థర్మల్‌ స్కానర్‌తో పరీక్షించి లక్షణాలు లేకపోవడంతో హోమ్‌ క్వారంటైన్‌లో వుండాలని సూచిస్తూ పంపించేశారు. అయితే, ఇంటికి వచ్చిన రెండు రోజులకే యువకుడు జ్వరం, జలుబు వంటి లక్షణాలతో బాధపడ్డాడు. అప్పటికే యువకుడి శరీరంలో కరోనా వైరస్‌ వున్నప్పటికీ అధికారులు గుర్తించడంలో విఫలమయ్యారు. ఆ సమయంలో యువకుడిని అధికారులు క్వారంటైన్‌ సెంటర్‌కు పంపిస్తే సరిపోయేదని, నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ప్రయాణంలో ఎంతమంది ఆ యువకుడి నుంచి వైరస్‌ ఎంతమందికి వ్యాప్తిచెంది వుంటుందో తెలియడం లేదని నిపుణులు చెబుతున్నారు. 

17 మంది ఫలితాల కోసం నిరీక్షణ

ఇప్పటివరకు జిల్లాలో 57 మంది అనుమానిత వ్యక్తుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం అధికారులు పంపించారు. వీటిలో 37 మందికి సంబంధించిన ఫలితాలు నెగెటివ్‌ రాగా, ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో 17 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. వీటిలో అల్లిపురం ప్రాంతానికి చెందిన రెండు పాజిటివ్‌ కేసులు నమోదైన కుటుంబ సభ్యురాలి రిపోర్టు రావాల్సి వుందని అధికారులు చెబుతున్నారు. 

విమ్స్‌ క్వారంటైన్‌లో 36 మంది

విమ్స్‌ క్వారంటైన్‌ సెంటర్‌లో ప్రస్తుతం 36 మంది అధికారుల పర్యవేక్షణలో ఉన్నారు. వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారితోపాటు రేగిడి వెంకటాపురం, అల్లిపురంలో పాజిటివ్‌ వచ్చిన కేసులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఉన్నారు. వీరిని 14 రోజులపాటు ఇదే సెంటర్‌లో పర్యవేక్షణలో వుంచి ఎటువంటి లక్షణాలు కనిపించకపోతే ఇంటికి పంపించనున్నారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఛాతీ ఆసుపత్రిలోని కరోనా వార్డుకు తరలిస్తారు. 


Updated Date - 2020-03-24T08:36:30+05:30 IST