లాక్‌డౌన్‌ నిబంధనలకు బ్రేక్‌

ABN , First Publish Date - 2020-04-05T09:34:19+05:30 IST

‘‘వైద్య ఆరోగ్య వ్యవస్థలో ఇటలీ ప్రథమ స్థానంలో ఉంది. అలాంటి దేశాన్నే కరోనా అతలాకుతలం చేసింది.

లాక్‌డౌన్‌ నిబంధనలకు బ్రేక్‌

అధికారిక కార్యక్రమాల్లో

గుంపులుగా గుంపులుగా పాల్గొంటున్న వైనం

బియ్యం, కందిపప్పు, పింఛన్‌, రూ.1000 నగదు పంపిణీని

ఉపయోగించుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో 

లబ్ధి పొందాలని తాపత్రయం

గ్రామ/వార్డు వలంటీర్లను పక్కనపెట్టి

అంతా తామేనన్నట్టుగా వ్యవహారం

ప్రచారాన్ని తలపించేలా కార్యకర్తలతో హడావిడి 

కనిపించని మాస్కులు... భౌతిక దూరం

జిల్లాలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో

బెదిరిపోతున్న లబ్ధిదారులు

పట్టించుకోని పోలీసులు

సర్వత్రా వెల్లువెత్తుతున్న విమర్శలు


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం): ‘‘వైద్య ఆరోగ్య వ్యవస్థలో ఇటలీ ప్రథమ స్థానంలో ఉంది. అలాంటి దేశాన్నే కరోనా అతలాకుతలం చేసింది. అభివృద్ధి చెందిన దేశాలు కూడా నిస్సహాయ స్థితిలో పడిపోయాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా సవాల్‌ విసురుతూనే ఉంది. ఇటువంటి తరుణంలో మన పరిస్థితి ఏమిటి!? అంతా ఇళ్లల్లోనే ఉండాలి. లేకపోతే, ఈ గండం నుంచి గట్టెక్కే పరిస్థితి లేదు.’’


ఇదీ గత నెల 24వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటన

కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే... అందరూ ఇళ్లలోనే వుండడం ఒక్కటే మార్గమని, అత్యవసరమై బయటకు వెళ్లినా గుంపులుగా కాకుండా వ్యక్తికి వ్యక్తి మధ్య కనీసం మూడు అడుగుల దూరం తప్పనిసరిగా పాటించాలని ఆ తరువాత కూడా పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయితే జిల్లాలో వైసీపీ నేతలు మాత్రం వాటిని బేఖాతరు చేస్తూ ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. 


లాక్‌డౌన్‌ నేపథ్యంలో బియ్యం కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.వెయ్యి చొప్పున సాయం అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. శనివారం ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎన్నికల్లో తమకు లబ్ధి చేకూర్చేలా మార్చుకోవాలని భావించిన అధికార పార్టీ నేతలు మందీమార్బలంతో రంగంలోకి దిగిపోయారు. ఉదయం నుంచి గ్రామ/వార్డు వలంటీర్లతో కలిసి ఇంటింటికీ వెళ్లి డబ్బులు అందజేసేందుకు పోటీ పడ్డారు. వీరంతా ముఖానికి మాస్కులు ధరించకపోవడం, వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీసం మూడు అడుగులు భౌతిక దూరం పాటించకపోవడం చూసి జనాలు బెదిరిపోయారు. కరోనాను ఎలా కట్టడి చేయాలో తెలియక సతమతమవుతున్న సమయంలో వైరస్‌ మరింత విస్తరించేలా బాధ్యతాయుతమైన నేతలు వ్యవహరించడం దారుణమని విమర్శించారు.


ఇంతటి ఉపద్రవంలో కూడా రాజకీయ కోణమే తప్పితే ప్రజా సంక్షేమం గురించి ఆలోచించకపోవడం విచారకరమని వైసీపీ నేతల తీరును తప్పుబట్టారు. జీవీఎంసీ పరిధిలో వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ మాస్కు ధరించకుండానే 29 వార్డులో నగదు పంపిణీ చేపట్టారు. ఇక 45వ వార్డు పరిధిలో ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు నగదు పంపిణీ చేశారు. ఇసుకతోటలోని రజకవీధిలో వైసీపీ నేత మొల్లి అప్పారావు మందీమార్బలంలో కలిసి ఇంటింటికీ వెళ్లి నగదు అందజేశారు. అలాగే 21వ వార్డులో వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణశ్రీనివాస్‌ పేదలకు బియ్యం, నగదు అందజేశారు.


ఈ కార్యక్రమానికి జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన స్వయంగా పాల్గొనడం విస్మయానికి గురిచేసింది. జీవీఎంసీ పరిధిలోని అన్ని వార్డుల్లోనూ ఇదే పరిస్థితి కనిపించడం గమనార్హం. ఇక రూరల్‌లో గొలుగొండ మండలం కొత్తమల్లవరంలో నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌, పాయకరావుపేటలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పాడేరులో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, రోలుగుంటలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అనకాపల్లిలో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ రూ.1000 నగదు పంపిణీ చేశారు.


మొన్న బియ్యం...నిన్న పెన్షన్లు...నేడు నగదు పంపిణీ

కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తెల్ల కార్డుదారులకు బియ్యం, కిలో కందిపప్పు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. గత నెల 29 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే వైసీపీ నేతలు తమ సొంత సొమ్ముతో బియ్యం, కందిపప్పు అందజేస్తున్నట్టు డిపోల్లో చేరిపోయి సరకులు పంపిణీ చేశారు. ఒకపక్క సరుకుల పంపిణీ జరుగుతుండగా ఏప్రిల్‌ ఒకటి నుంచి పింఛన్ల పంపిణీ మొదలైంది. ఆ కార్యక్రమంలోనూ చేతులు పెట్టారు. వలంటీర్లను పక్కన పెట్టేసి స్వయంగా ఇంటింటికీ తిరుగుతూ పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ రెండు కొనసాగుతుండగానే...బియ్యం కార్డుదారుడికి రూ.1000 పంపిణీ మొదలైంది. శనివారం ప్రారంభమైన ఈ నగదు పంపిణీని కూడా అధికార పార్టీ నేతలు ఎన్నికల ప్రచారం కోసం బాగానే వినియోగించుకుంటున్నారు. 


కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు మనిషికి మనిషికి నడుమ కనీసం మీటరు దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నా వైసీపీ నేతలు వాటిని పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా పింఛన్‌, రూ.1000 పంపిణీని ఉపయోగించుకుని స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందాలనే తాపత్రయంతో  అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు గుంపులుగా గుంపులుగా ఇళ్లకు వస్తుండడంతో లబ్ధిదారులు కూడా హడలిపోతున్నారు. సాధారణంగా బియ్యం డీలర్లు పంపిణీ చేస్తారు. ఇక పింఛన్లు రెండు నెలల నుంచి వలంటీర్ల ద్వారా పంపిణీ చేయిస్తున్నారు. అయితే ప్రస్తుతం డీలర్లు, వలంటీర్లను పక్కనపెట్టి వాటిని వైసీపీ నేతలే లబ్ధిదారులకు అందజేస్తున్నారు.  


పట్టించుకోని అధికారులు

సాధారణంగా వీధుల్లోకి ఎవరైనా అనవసరంగా వస్తే పోలీసులు అడ్డుకుని కేసులు నమోదుచేస్తున్నారు. వాహనాలు సీజ్‌ చేస్తున్నారు. అయితే బియ్యం, పెన్షన్లు, నగదు పంపిణీ కార్యక్రమాల్లో వైసీపీ నేతలు, వారి అనుచరులు పదుల సంఖ్యలో పాల్గొంటున్నా పట్టించుకోవడం లేదు. కనీసం ప్రశ్నించే సాహసం కూడా చేయడం లేదు. అయితే అలాంటి కార్యక్రమాలకు ఉన్నతాధికారులే అతిథులుగా హాజరవుతుండడంతో పోలీసులు తమకెందుకువచ్చిన తలనొప్పి అన్న భావనతో చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2020-04-05T09:34:19+05:30 IST