విశాఖ జిల్లాలో వైరస్ విజృంభణ.. 11 రోజుల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..
ABN , First Publish Date - 2020-08-12T13:30:51+05:30 IST
జిల్లాలో మొట్టమొదటి కరోనా కేసు మార్చి 19న నమోదైంది. జూలై 31 వరకు..

11 రోజులు.. 10,024 కేసులు!
సగటున గంటకు 39 మంది...
మొత్తం కొవిడ్ మరణాలు 144
అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణుల సూచన
(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): జిల్లాలో మొట్టమొదటి కరోనా కేసు మార్చి 19న నమోదైంది. జూలై 31 వరకు అంటే 135 రోజుల్లో 11,177 కేసులు నమోదు కాగా, ఆగస్టు నెల పదకొండు రోజుల్లోనే 10,024 వచ్చాయి. ఈ నెల ఒకటో తేదీన 1155 మంది, 2న రికార్డు స్థాయిలో 1,227 మంది, 3న 1049 మందికి వైరస్ సోకింది. జిల్లాలో గంటకు సగటున 39 మంది వైరస్ బారినపడుతున్నారు. ఇవి పరీక్షలు చేయగా నిర్ధారణ అవుతున్న కేసులని, పరీక్షలు చేయించుకోకుండా చాలామంది వైరస్ బారినపడి బయటే ఉన్నారని, ఈ నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అంతేస్థాయిలో మరణాలు
కరోనా మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో వైరస్ బారినపడి 144 మంది మృతిచెందగా, ఇందులో ఆగస్టు నెలలోనే 58 మంది మృతిచెందారు.
ఇదీ లెక్క..
తేదీ నమోదైన కేసులు మరణాలు
1 1155 8
2 1227 4
3 1049 3
4 863 5
5 842 6
6 781 4
7 852 5
8 998 5
9 961 6
10 620 5
11 676 7
10,024 58