ఆగస్టు నెలలో కరోనా కల్లోలం.. 31 రోజులు 25,929 కేసులు
ABN , First Publish Date - 2020-09-01T15:51:07+05:30 IST
కరోనా వైరస్ ఆగస్టు నెలలో కల్లోలం సృష్టించింది. ఈ 31 రోజుల్లో 25,929 మంది వైరస్..

సగటున రోజుకు 836 మందికి సోకిన వైరస్
మొదటి పది రోజుల్లో 9,348 కేసులు...51 మంది మృతి
11 నుంచి 20 తేదీల మధ్య 7,962 కేసులు...59 మరణాలు
21 నుంచి 31 తేదీల మధ్య 8,618 కేసులు...62 మరణాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ ఆగస్టు నెలలో కల్లోలం సృష్టించింది. ఈ 31 రోజుల్లో 25,929 మంది వైరస్ బారినపడ్డారు. అంటే సగటున రోజుకు 836 మంది. జిల్లాలో మొట్టమొదటి కరోనా కేసు మార్చి 19న నమోదుకాగా, జూలై 31 నాటికి 11,177 మంది వైరస్ బారినపడ్డారు. ఆ 11,177 కేసులు నమోదు కావడానికి 135 రోజులు సమయం పడితే...అంతకు రెండితలకుపైగా కేసులు ఒక్క ఆగస్టు నెలలోనే నమోదయ్యాయంటే వైరస్ విజృంభణ ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. మార్చి 19న మొదటి కేసు నమోదు కాగా, ఆ నెలాఖరు నాటికి 10, ఏప్రిల్‌లో 13, మేలో 90, జూన్‌లో 787 కేసులు నమోదు అయ్యాయి. జూలై నెల నుంచి కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. జూలై మొదటి వారంలో 623, రెండో వారంలో 1,057, మూడో వారంలో 4,698, నాలుగో వారంలో 4,698 మంది, చివరి మూడు రోజుల్లో 3,047 కేసులు నమోదయ్యాయి. ఒక్క జూలై నెలలోనే 10,277 కేసులు నమోదయ్యాయి. ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ఆగస్టులో వైరస్ విజృంభించింది. 31 రోజుల్లో 25,929 మందికి వైరస్ సోకగా, 172 మంది మృత్యువాత పడ్డారు.
భారీగా కేసులు..
ఆగస్టు నెల ప్రారంభమైనప్పటి నుంచి భారీగా కేసులు నమోదయ్యాయి. ఒకటి నుంచి పది తేదీల మధ్య 9,348 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగా, చికిత్స పొందుతూ 51 మంది మృతిచెందారు. అలాగే 11 నుంచి 20 తేదీల మధ్య 7,962 కేసులు నమోదుకాగా, 59 మంది మరణించారు. 21 నుంచి 31 తేదీల మధ్య 8,619 కేసులు నమోదు కాగా, 62 మంది మృత్యువాతపడ్డారు. సగటున ప్రతిరోజూ 836 కేసులు నమోదుకాగా, 5.3 మంది ప్రాణాలు కోల్పోయారు. జూలై నెలలో సగటున రోజుకు 331 మందికి వైరస్ సోకగా, అది ఆగస్టు నెలలో రెండింతలకుపైగా పెరిగింది. మరణాల రేటు కూడా అంతేస్థాయిలో పెరిగింది.