మన్యంలో కరోనా విజృంభణ.. పల్లెలకు చేరిన మహమ్మరి
ABN , First Publish Date - 2020-08-12T13:14:10+05:30 IST
మైదానానికి దీటుగా మన్యంలోనూ కరోనా విజృంభిస్తున్నది. ఏజెన్సీ వ్యాప్తంగా..

ఇప్పటికి ఏజెన్సీలో 364 కేసులు
ఒక్క పాడేరులోనే 130 పాజిటివ్‌లు,
అలాగే రెండు మరణాలు
పారిశుధ్య పనులు అంతంతమాత్రమే
నిరుపయోగంగా సంజీవని బస్సు
పాడేరు(విశాఖపట్నం): మైదానానికి దీటుగా మన్యంలోనూ కరోనా విజృంభిస్తున్నది. ఏజెన్సీ వ్యాప్తంగా ఇప్పటివరకు 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, రెండు మరణాలు సంభవించాయి. అలాగే రోజురోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభించిన మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సైతం ఏజెన్సీలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. కాని ఊహించని విధంగా జూన్ నెల నుంచి మన్యంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. జూన్ నుంచి ఆగస్టు 11 తేదీ వరకు ఏజెన్సీలో 364 పాజిటివ్ కేసులు నమోదు కావడం విశేషం.
అలాగే రెవెన్యూ డివిజన్ కేంద్రం పాడేరులోనే 130 కేసులు రావడంతోపాటు, రెండు కరోనా మరణాలు సంభవించడంతో జనం ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఏజెన్సీలో కరోనా అంతగా విజృంభించదని అందరూ భావించినప్పటికీ అందుకు భిన్నమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి ఏజెన్సీకి రాకపోకలు పెరగడంతో కరోనా గ్రామాలకు పాకింది. అలాగే ఏజెన్సీలో పారిశుధ్య పనులు అరకొరగా జరుగుతుండగా, కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. ఉదాహరణకు జి.మాడుగుల మండల కేంద్రంలో తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన తర్వాత గాని అక్కడ బ్లీచింగ్ చల్లడం, హైపోక్లోరిడ్ ద్రావణాన్ని పిచికారీ పనులు చేయలేదు. అలాగే పాడేరు పట్టణంలోని రేకుల కాలనీ ప్రాంతంలో 60కి పైగా కేసులు వచ్చిన తర్వాతే ఆయా ప్రదేశాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. అధికారులు సైతం పాజిటివ్ కేసులను కొవిడ్ కేర్ సెంటర్లో చేర్పించడం, వారికి కాంటాక్ట్‌లో ఉన్న వారిని గుర్తించి క్వారంటైన్‌కు పంపడంపైనే దృష్టి సారిస్తున్నారు.
నిరుపయోగంగా సంజీవని వాహనం
ఏజెన్సీలోని పాడేరు, అరకులోయ నియోజకవర్గాల్లో పల్లెల్లో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కేటాయించిన సంజీవని బస్సు నిరుపయోగంగా ఉంది. గతనెల 20న అరకులోయలో ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, ఫాల్గుణ సంజీవని బస్సును లాంఛనంగా ప్రారంభించారు. అంతే.. తప్ప సంజీవని సేవలు ప్రజలకు అందని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం సంజీవని బస్సును మాత్రమే పంపించి, అందులో ఉండాల్సిన సిబ్బంది, ఇతర పరికరాలను అందించలేదు. దీంతో ఆ వాహనాన్ని ఎలా వినియోగించుకోవాలో అర్థం కాక, దానిని స్థానిక ఆర్టీసీ డిపోలో ఉంచేశారు. వాస్తవానికి సంజీవని వాహనం సేవలు వినియోగిస్తే, చాలా వరకు పాజిటివ్ కేసులను ముందుగానే గుర్తించి, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అవకాశఽం ఉంటుందని వైద్య సిబ్బందే అంటున్నారు. సంజీవని వాహనం గురించి ఏడీఎంహెచ్‌వో డాక్టర్ లీలాప్రసాద్ వద్ద ప్రస్తావించగా.. వాహనం మాత్రమే ఇచ్చి, ఇతర పరికరాలు, సిబ్బందిని కేటాయించకపోవడం వల్లే సంజీవనిని వినియోగించుకోలేకపోతున్నామన్నారు.
ఏజెన్సీలో 364 కరోనా పాజిటివ్ కేసులు
ఏజెన్సీ వ్యాప్తంగా జూన్ 19 నుంచి ఆగస్టు 11 వరకు 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, పాడేరులో రెండు కరోనా మరణాలు సంభవించాయి. పాడేరు మండలంలో 130 కేసులు, హుకుంపేటలో 68, జీకేవీధిలో 59, అనంతగిరిలో 31, అరకులోయలో 16, డుంబ్రిగుడలో 13, చింతపల్లిలో 12, పెదబయలులో 11, జి.మాడుగులలో 9, కొయ్యూరులో 8, ముంచంగిపుట్టులో 7 కేసులు చొప్పున నమోదయ్యాయి.