కంటితుడుపే...!

ABN , First Publish Date - 2020-03-19T08:14:01+05:30 IST

జిల్లాలోని సహకార చక్కెర కర్మాగారాలను, చెరకు సరఫరా చేసిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిరుత్సాహ పరిచింది. చెరకు రైతుల బకాయిలతోపాటు కార్మికుల వేతనాల కోసం

కంటితుడుపే...!

చోడవరం, మార్చి 18: జిల్లాలోని సహకార చక్కెర కర్మాగారాలను, చెరకు సరఫరా చేసిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిరుత్సాహ పరిచింది. చెరకు రైతుల బకాయిలతోపాటు కార్మికుల వేతనాల కోసం రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్టు రెండు నెలల క్రితం ఆర్భాటంగా ప్రకటించి..... చివరకు కంటితుడుపుగా రూ.30 కోట్లు మాత్రమే విడుదల చేస్తున్నట్టు తాజాగా జీవో జారీ చేసింది. ప్రభుత్వ తీరుపై చెరకు రైతులు మండిపడుతున్నారు. కార్మికులు తీవ్ర నిరాశ చెందారు. కార్మికులకు వేతన బకాయిలు ఎలా చెల్లించాలో తెలియని స్థితిలో షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యాలు వున్నాయి. 


 జిల్లాలో సహకార రంగంలో నడుస్తున్న తాండవ, ఏటికొప్పాక, గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలతోపాటు,  విజయనగరం జిల్లా భీమసింగి షుగర్‌ ఫ్యాక్టరీకి చెరకు రైతుల బకాయిలు, కార్మికుల వేతనాలు, విత్తన సబ్సిడీ, ఆప్కాబ్‌ రుణ బకాయిలు కలిపి రూ.78 కోట్లు అవసరం. మార్కెట్‌లో పంచదార ధర కన్నా, ఫ్యాక్టరీలో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా వుండడం, పంచదార విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం సీలింగ్‌ విధించడంతో ఆయా ఫ్యాక్టరీలకు నిధుల కొరత ఏర్పడింది. గోదాముల్లో పంచదార నిల్వలు వున్నప్పటికీ అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో ఇచ్చిన రుణ బకాయిలు పేరుకుపోవడంతో కొత్తగా రుణం మంజూరు చేయడానికి ఆప్కాబ్‌ ముందుకు రాలేదు. దీంతో ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణం మంజూరు చేయించాలని ఆయా ఫ్యాక్టరీల యాజమాన్యాలు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. సానుకూలంగా స్పందించిన పాలకులు.... రాష్ట్రంలోని నాలుగు సహకార చక్కెర కర్మాగారాలకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్‌సీడీసీ) రూ.100 కోట్ల రుణం మంజూరు చేసిందని, త్వరలో నిధులు విడుదల అవుతాయని ఈ ఏడాది జనవరి నెలలో జీవో నంబరు 2 జారీ చేసింది. ఈ సొమ్ములో సుమారు రూ.40 కోట్లు గోవాడ ఫ్యాక్టరీకి కేటాయించింది. చెరకు రైతుల బకాయిలు, కార్మికుల వేతనాలు, విత్తన సబ్సిడీ, రవాణా చార్జీలకు రూ.18.28 కోట్లు, ఇఽథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రూ.22 కోట్లు, తాండవ ఫ్యాక్టరీకి రూ.19.66 కోట్లు, ఫ్యాక్టరీకి రూ.27.61 కోట్లు, విజయనగరం జిల్లా భీమసింగి ఫ్యాక్టరీకి రూ.12.45 కోట్లు మంజూరు చేస్తున్నట్టు జీవోలో సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ నిధులతో చెరకు రైతులకు బకాయిలు, కార్మికుల వేతనాలు, రవాణా చార్జీలు, విత్తన సబ్సిడీ, ఆప్కాబ్‌ రుణం చెల్లించవచ్చని చెప్పారు. దీంతో  ఫ్యాక్టరీల యాజమాన్యాలు, చెరకు రైతులు, కార్మికులు ఎంతో సంతోషించారు. అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు..... సీఎం జగన్‌ ఫొటోలకు క్షీరాభిషేకాలు చేశారు. వారంలోగా నిధులు వచ్చేస్తాయని, అన్నిరకాల చెల్లింపులు పూర్తవుతాయని గొప్పగా ప్రకటించారు. సంక్రాంతి పండగకల్లా చేతిలో డబ్బులు పడతాయని రైతులు, కార్మికులు ఎంతో ఆశించారు. నిఽధులు ఎప్పుడు విడుదల అవుతాయా అంటూ ఎదురు చూడడం మొదలుపెట్టారు. వారం... పక్షం... నెల... రెండు నెలలు గడిచినా ఆయా ఫ్యాక్టరీల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు జమ కాలేదు. దీంతో రైతులు, కార్మికులు తీవ్రనిరాశ చెందారు. యాజమాన్యాలు అయోమయంలో పడ్డాయి. బకాయిలు చెల్లించాలంటూ ఇటు రైతులు, అటు కార్మికులు ఒత్తిడి చేస్తుండడంతో యాజమాన్యాలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. రైతులు ఆందోళనలు కూడా నిర్వహించారు. నిధుల గురించి ప్రభుత్వాన్ని అడిగితే... ఎక్కడ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందోనని అధికారులు మధనపడ్డారు. ఇటువంటి తరుణంలో దాదాపు రెండున్నర నెలల తరువాత రూ.30 కోట్లు మాత్రమే విడుదల చేసింది. వీటిని చెరకు బకాయిల చెల్లింపులకు వినియోగించాలని స్పష్టం చేసింది.


చెప్పింది రూ.100 కోట్లు... ఇచ్చింది రూ.30 కోట్లు!

చెరకు రైతుల బకాయిలపై అన్ని వర్గాల నుంచి పెరిగిన ఒత్తిళ్ల నేపథ్యంలో  రూ.100 కోట్లకుగాను తొలివిడత రూ.30 కోట్లు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిధుల్లో గోవాడకు రూ. 12.75 కోట్లు, ఏటికొప్పాకు రూ.7.52 కోట్లు, తాండవకు రూ.8.66 కోట్లు, భీమసింగికి రూ.1.06 కోట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. చెరకు బకాయిల చెల్లింపులు మాత్రమే జరపాలని స్పష్టం చేసింది. విత్తన సబ్సిడీ, రవాణా చార్జీలు, ఆప్కాబ్‌ బాకీలు, కార్మికుల వేతనాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. తమకు పూర్తిస్థాయిలో డబ్బులు ఇవ్వకపోవడంతో రైతులు, వేతన బకాయిల ఊసెత్తకపోవడంతో కార్మికులు... తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 ఇదిలావుండగా గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రూ.22 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం... తొలివిడత విడుదల చేయనున్న రూ.30 కోట్లలో దీనికి కేటాయింపులు జరపలేదు. ఒకేసారి ఇవ్వాల్సిన రూ.100 కోట్లలో రెండున్నర నెలల తరువాత రూ.30 కోట్లు మాత్రమే ఇచ్చిందని, మిగిలిన రూ.70 కోట్లు ఇవ్వడానికి ఇంకెంత కాలం పడుతుందోనని ఫ్యాక్టరీల యాజమాన్యాలు, రైతులు అంటున్నారు.

Updated Date - 2020-03-19T08:14:01+05:30 IST