అన్నదాత నోట్లో మట్టి!
ABN , First Publish Date - 2020-12-01T06:36:01+05:30 IST
తుఫాన్‌కు ముందు కోత కోసి, వర్షాలకు పనలు తడిసిపోతే ఒక విధంగా, కోత కోయని పొలాల్లో ఈదురు గాలులకు పైరు నేలకొరిగితే మరో విధంగా, కోత కోయని పొలాల్లో నేలకొరిగి, నీట మునిగి పైరు మొత్తం కుళ్లిపోతే ఇంకోవిధంగా...నష్టపరిహారం అందుతుందని వ్యవసాయ శాఖ జేడీ లీలావతి తెలిపారు.

వర్షాలకు ముందు కోత కోసి, పొలంలోనే వరి పనలు తడిసి నష్టపోతేనే బీమా వర్తిస్తుందట
గట్లపైకి చేర్చిన వారికి వర్తించదట
వ్యవసాయ అధికారుల ప్రకటన
పైరు నీట మునిగితే తొలుత ఇన్పుట్ సబ్సిడీ
శత శాతం నష్టపోతేనే పంటల బీమా పథకం కింద పరిహారం
అది కూడా పంట కోత ప్రయోగాల ఆధారంగానే....
పనలు తడిసి, గింజ మొలకెత్తినా ఇదే నిబంధన వర్తింపు
విశాఖపట్నం/నర్సీపట్నం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి):
‘నివర్’ తుఫాన్ వల్ల నష్టపోయిన వరి రైతులకు పరిహారం చెల్లింపుపై వ్యవసాయ శాఖ స్పష్టత ఇచ్చింది. తుఫాన్‌కు ముందు కోత కోసి, వర్షాలకు పనలు తడిసిపోతే ఒక విధంగా, కోత కోయని పొలాల్లో ఈదురు గాలులకు పైరు నేలకొరిగితే మరో విధంగా, కోత కోయని పొలాల్లో నేలకొరిగి, నీట మునిగి పైరు మొత్తం కుళ్లిపోతే ఇంకోవిధంగా...నష్టపరిహారం అందుతుందని వ్యవసాయ శాఖ జేడీ లీలావతి తెలిపారు. జిల్లాలో 27 మండలాల్లో సుమారు 23 వేల రైతులకు చెందిన 11,500 హెక్టార్ల పంట నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని చెప్పారు. వాస్తవంగా ఎంత పంట నష్టం ఎంత జరిగిందో క్షేత్రస్థాయిలో పరిశీలించి, డిసెంబరు 15వ తేదీలోగా నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ప్రస్తుతం అధికారులు, సిబ్బంది ఆ పనిలో వున్నారని ఆమె తెలిపారు. వర్షాలకు ముందు కోత కోసి, పొలంలోనే వరి పనలు తడిసి నష్టపోతే వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం వర్తిస్తుందని జేడీ చెప్పారు. వరి పైరు కోత కోయకుండా నీట మునిగి, 33 శాతం కంటే ఎక్కువ దెబ్బతింటే ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున అందిస్తామన్నారు. ఒకవేళ నీట మునిగిన వరి పైరు పూర్తిగా కుళ్లిపోయి, గింజ కూడా దక్కకపోతే అప్పుడు స్థానిక పంట కోత ప్రయోగాల ద్వారా వచ్చిన దిగుబడి మేరకు బీమా పరిహారం అందుతుందని వివరించారు. కోత పూర్తయి, పొలంలో పనల మీద ఉన్న వరి పైరు వర్షాల వల్ల పూర్తిగా పాడైపోతే పంటల బీమా పథకం వర్తిస్తుందని చెప్పారు. అయితే పలుచోట్ల వర్షానికి తడిసిపోయిన వరి పనలను రైతులు గట్ల మీద ఆరబెట్టుకున్నారని ఇటువంటి రైతులకు పంట నష్టపరిహారం వర్తించదని చెప్పారు. ఒక రైతుకు పంటల బీమా లేదా ఇన్పుట్ సబ్సిడీ మాత్రమే వర్తిస్తుందని స్పష్టంచేశారు.
వ్యవసాయ శాఖ అధికారులు సోమవారం నుంచి పొలాలను పరిశీలించి, పంట నష్టం అంచనా వేస్తున్నారని జేడీ లీలావతి చెప్పారు. కోత దశకు చేరిన వరి పంట నీట మునిగి నష్టం వాటిల్లితే తొలుత ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని, ఆ తరువాత ఆయా ప్రాంతాల్లో పంట కోత ప్రయోగాలు చేపట్టినప్పుడు అక్కడ వచ్చే దిగుబడిని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని పంట కోత ప్రయోగాలు చేసినప్పుడు అక్కడ రావాల్సిన సగటు ధాన్యం దిగుబడి కంటే తక్కువ వస్తే...అప్పుడు ఆ యూనిట్ పరిధిలోని రైతులందరికీ ఉచిత పంటల బీమా పథకం కింద పరిహారం అందుతుందని వివరించారు. సాధారణంగా ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని బీమాను అమలుచేస్తారు తప్ప ఒకరిద్దరు రైతులకు వాటిల్లిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకోరని ఆమె స్పష్టంచేశారు. వరి పైరు దెబ్బతిన్న రైతులు...వాటి వివరాలను సమీపంలోని రైతు భరోసా కేంద్రాల సిబ్బందికి తెలియజేయాలని సూచించారు.