ఫీజులపై ఫిర్యాదుకు బడిగంట

ABN , First Publish Date - 2020-12-11T05:43:12+05:30 IST

నగరం, పరిసర ప్రాంతాల్లో సీబీఎస్‌ఈ/ఐసీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తున్న 45 పాఠశాలల్లో ఫీజుల వసూళ్లపై విద్యా శాఖ దృష్టిసారించింది.

ఫీజులపై ఫిర్యాదుకు బడిగంట

నేటి నుంచి పాఠశాలల్లో తనిఖీలు

ప్రభుత్వ ఆదేశాలు అమలు చేస్తున్నదీ లేనిదీ పరిశీలన


విశాఖపట్నం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): నగరం, పరిసర ప్రాంతాల్లో సీబీఎస్‌ఈ/ఐసీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తున్న 45 పాఠశాలల్లో ఫీజుల వసూళ్లపై విద్యా శాఖ దృష్టిసారించింది. డీఈవో, డిప్యూటీ డీఈవోతోపాటు ఎంఈ వోల నాయకత్వంలో ఏర్పాటైన ఆరు బృందాలు శుక్రవారం నుంచి పాఠశాలలు తనిఖీ చేస్తాయి. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పాఠశాలలు ట్యూషన్‌ ఫీజులో 70 శాతం మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం జీవో కూడా జారీచేసింది. అయితే కొన్ని పాఠశాలల యాజ మాన్యాలు అన్ని ఫీజులను కలిపి ట్యూషన్‌ ఫీజుగా చూపి స్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో తనిఖీలు చేయాలని నిర్ణయించామన్నారు. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల వసూలుపై ఫిర్యాదు కోసం ‘బడిగంట’ ఏర్పాటు చేశామన్నారు. బడిగంటలో ఏర్పాటుచేసిన ఫోన్‌ నంబర్‌ (94938 61412)కు ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యన ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. 

Updated Date - 2020-12-11T05:43:12+05:30 IST