జిల్లాలో నీటి పథకాల తనిఖీ

ABN , First Publish Date - 2020-12-11T04:12:34+05:30 IST

ఏలూరు ఘటన నేపథ్యంలో జిల్లాలో అన్ని రకాల నీటి పథకాలను శుక్రవారం నుంచి తనిఖీ చేస్తామని కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ వెల్లడించారు.

జిల్లాలో నీటి పథకాల తనిఖీ
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినయ్‌చంద్‌

వారం రోజుల పాటు నమూనాల సేకరణ

1,16,062 మందికి పట్టాలు, టిడ్కో ఇళ్లు

21 నుంచి భూముల సమగ్ర సర్వే

కలెక్టర్‌ వినయ్‌చంద్‌


విశాఖపట్నం, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): ఏలూరు ఘటన నేపథ్యంలో జిల్లాలో అన్ని రకాల నీటి పథకాలను శుక్రవారం నుంచి తనిఖీ చేస్తామని కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ వెల్లడించారు. ఇందుకు సంబంధించి జీవీఎంసీ, జిల్లా పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. గురువారం తన చాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో వారం రోజులపాటు ప్రతి నీటి పథకం తనిఖీ చేసి శాంపిల్స్‌ తీసుకుంటామన్నారు. గ్రామీణ ప్రాంతంలో 4151 సింగిల్‌ స్కీంలు, 43 మల్టీ స్కీంలు పనిచేస్తున్నాయని, జీవీఎంసీ పరిధిలో భారీ పఽథకాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ప్రధాన జిల్లాలతో పోలిస్తే వ్యవసాయంలో ఎరువులు, పురుగుల మందు వినియోగం విశాఖలో తక్కువగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. అయితే పాల ప్యాకెట్లు, కూరగాయలు, పండ్లు సరఫరా చేసే గొలుసుకట్టు దుకాణాలు, ప్రజలు ఎక్కువగా కొనుగోళ్లు చేసే మాల్స్‌ను తనిఖీ చేస్తామని చెప్పారు. ఈనెల 25న 1,16,062 మంది పేదలకు పట్టాలు, అర్హులకు టిడ్కో ఇళ్లు పంపిణీ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 73,365 మందికి ఇళ్ల పట్టాలు, చాలాకాలం నుంచి స్థలాలు ఆక్రమించుకున్న 16,954 మందికి ఎల్‌పీసీలు, జీవీఎంసీతోపాటు నర్సీపట్నం, ఎలమంచిలిలో 25,743 మందికి టిడ్కో ఇళ్లు  అందజేస్తామన్నారు. జీవీఎంసీలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన ల్యాండ్‌ పూలింగ్‌పై కోర్టులో వ్యాజ్యం ఉందన్నారు. దీంతో జీవీఎంసీ పరిధిలో సుమారు 1.79 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం లేదన్నారు. కాగా జిల్లాలో ఈనెల 21 నుంచి భూముల సమగ్ర సర్వే ప్రారంభిస్తామన్నారు. పైలట్‌ ప్రాతిపదికగా ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఒక గ్రామంలో సర్వే చేస్తామన్నారు. తొలివిడతలో 965 గ్రామాల్లో మిగిలిన 961 గ్రామాల్లో జనవరి ఒకటి నుంచి భూసర్వే జరుగుతుందన్నారు. జిల్లాలో అటవీ భూములు తప్ప ప్రభుత్వ, జిరాయితీ భూములు, జీవీఎంసీలో అన్ని రకాల ఆస్తులను సర్వే చేస్తామన్నారు. తొలి విడత సర్వే వచ్చే ఏడాది మే నాటికి పూర్తిచేయాలని ప్రతిపాదించామని చెప్పారు. ఇందుకు మహారాణిపేట, ముంచంగిపుట్టు, నాతవరం, కె. కోటపాడు తహసీల్దారు కార్యాలయాల్లో కంటిన్యూస్‌ ఆపరేటింగ్‌ రీసెర్చి స్టేషన్లు(సీవోఆర్‌ఎస్‌) ఏర్పాటు చేస్తామన్నారు. సెల్‌టవర్లు మాదిరిగా ఉండే ఈ నాలుగు స్టేషన్లు శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తుంటాయని తెలిపారు. సీవోఆర్‌ఎస్‌ స్టేషన్లను జీఎన్‌ఎస్‌ఎస్‌ శాటిలైట్లతో అనుసంధానం చేయడం ద్వారా నిరంతరం సమాచారం సేకరించి రాష్ట్రస్థాయిలో డేటా సెంటర్‌కు పంపుతుంటాయన్నారు. కాగా ప్రతి మండలంలో ఒక ద్రోన్‌ బృందం సర్వే కోసం పనిచేస్తుందన్నారు. ఈ సర్వే అనంతరం భూమికి సంబంధించి అన్ని వివరాలతో కూడిన రికార్డు రైతుల పేరిట ఐడీ కార్డుగా వస్తుందన్నారు. విశాఖలో ప్రభుత్వ భూములపై దర్యాప్తునకు ప్రభుత్వం నియమించిన ‘సిట్‌’ విచారణ పూర్తయిందని, నివేదికను త్వరలో ప్రభుత్వానికి అందజేస్తారని చెప్పారు. 

Updated Date - 2020-12-11T04:12:34+05:30 IST