అక్టోబర్ 5న.. విశాఖకు వెళ్లనున్న సీఎం జగన్..?
ABN , First Publish Date - 2020-10-03T16:20:17+05:30 IST
‘జగనన్న విద్యా కానుక’ను ప్రారంభించేందుకు ఈ నెల ఐదో తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జిల్లాకు వస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి సమాచారం వచ్చింది. ముఖ్యమంత్రి

5న సీఎం రాక?
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): ‘జగనన్న విద్యా కానుక’ను ప్రారంభించేందుకు ఈ నెల ఐదో తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జిల్లాకు వస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి సమాచారం వచ్చింది. ముఖ్యమంత్రి వస్తే ఆనందపురం మండలం గిడిజాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కార్యక్రమం ఏర్పాటుచేయాలని ఆదేశించారు. దీంతో అధికారిక సమాచారం వచ్చేలోగా గిడిజాల పాఠశాలను సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సమగ్రశిక్షా అభియాన్ ఏపీసీ ఎం.మల్లికార్జునరెడ్డి శుక్రవారం గిడిజాల పాఠశాలను సందర్శించి ప్రధానోపాధ్యాయుడు ఈ.పైడిరాజుతో చర్చించి పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.
సిద్ధమైన గిడిజాల పాఠశాల
నాడు-నేడు పనులకుగాను జిల్లాలో మూడు పాఠశాలలను డెమో స్కూళ్లగా ఎంపిక చేశారు. వాటిలో గిడిజాల ఉన్నత పాఠశాల ఒకటి. ఈ పాఠశాలల్లో మరమ్మతులు, విద్యుత్ సరఫరా మెరుగు, మరుగుదొడ్లు, ఫర్నీచర్, గ్రీన్‌బోర్డులు, పెయింటింగ్స్‌కు రూ.37.5 లక్షలు కేటాయించారు. విద్యా శాఖ ఆర్జేడీ నాగేశ్వరరావు ఈ పాఠశాలను దత్తత తీసుకున్నారు. డెమో పాఠశాలగా ఎంపిక కావడంతో నిధుల కొరత లేకపోవడంతో పనులు పూర్తిచేయగలిగారు. 290 మంది విద్యార్థులు వున్న ఈ పాఠశాల గోడలు, ప్రహరీ పెయింట్స్‌కు రూ.ఏడు లక్షలు వెచ్చించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి శుక్రవారం రాత్రి లేదా శనివారం ఉదయానికి అధికారిక సమాచారం రానున్నది. ఒకవేళ ముఖ్యమంత్రి పర్యటన లేకపోయినా..జిల్లాలో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ గిడిజాల పాఠశాలలో ప్రారంభించే అవకాశాలు వున్నాయని అంచనా వేస్తున్నారు.