క్లినికల్ ట్రయల్స్ షురూ..

ABN , First Publish Date - 2020-10-07T16:44:12+05:30 IST

ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న కొవిడ్‌-19 వైరస్‌కు వ్యాక్సిన్‌ను..

క్లినికల్ ట్రయల్స్ షురూ..

ఏఎంసీలో ప్రారంభమైన ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగాలు

స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారి పేర్లు మాత్రమే నమోదు

లిఖితపూర్వకంగా కూడా అంగీకారం తెలపాల్సి ఉంటుంది

పలు రకాల పరీక్షల అనంతరం వలంటీర్లు ఎంపిక

రెండు దఫాలుగా టీకా...ఆరు నెలలపాటు పర్యవేక్షణ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న కొవిడ్‌-19 వైరస్‌కు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అనేక దేశాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. అలా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ రూపొందించిన ‘కొవిషీల్ట్‌’ టీకా మూడో దశ ప్రయోగాలకు నగరంలోని ఆంధ్ర మెడికల్‌ కళాశాల వేదిక అయ్యింది. ఆక్స్‌ఫర్డ్‌  రూపొందించిన వ్యాక్సిన్‌కు భారత్‌లో సహ భాగస్వాములుగా ఐసీఎంఆర్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ వ్యవహరిస్తున్నాయి. ఈ రెండింటి ఆధ్వర్యంలో దేశంలోని 16 ఇన్‌స్టిట్యూట్‌లలో 1600 మందిపై మూడో దశ ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నారు. క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొనే వలంటీర్ల ఎంపిక నుంచి..వ్యాక్సిన్‌ ఇవ్వడం వరకు ప్రతి ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా, నిపుణుల పర్యవేక్షణలో చేపడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో క్లినికల్‌ ట్రయల్స్‌...ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌, మరో పది మంది కో-ఇన్వెస్టిగేటర్స్‌, ఏడుగురు సహాయ సిబ్బంది ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. 


100 మంది వలంటీర్ల ఎంపిక.. 

క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొనాలనుకునేవారు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సి ఉంటుంది. అలా వచ్చిన 300 మందికి పలు రకాల పరీక్షలు నిర్వహిస్తారు. వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. ఆల్కహాల్‌, స్మోకింగ్‌కు బానిసలై ఉండకూడదు. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు (కిడ్నీ, లివర్‌, హార్ట్‌ ఇబ్బందులు), అలర్జీ వంటివి ఉండకూడదు. ఇవన్నీ ఓకే అయిన తరువాత సదరు వ్యక్తులకు కరోనా ఉందా..? లేదా..? అన్నది నిర్ధారించేందుకు ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ చేస్తారు. అందులో నెగెటివ్‌ రావాలి. అప్పటికే వైరస్‌ బారినపడ్డారో లేదా అన్నది నిర్ధారించేందుకు యాంటీ బాడీస్‌ టెస్ట్‌ చేస్తారు. అందులోనూ నెగెటివ్‌ రావాల్సి ఉంటుంది. వీటిలో ఫిట్‌ అయిన వారికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇస్తారు.


లిఖిత పూర్వక అంగీకారం.. 

వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో పాల్గొనే వ్యక్తులు లిఖిత పూర్వక అంగీకారాన్ని తెలపాల్సి ఉంటుంది. క్లినికల్‌ ట్రయల్స్‌ నిబంధనలకు అంగీకారం తెలిపిన వ్యక్తులకు పరీక్షలు నిర్వహించిన వారం రోజుల్లోనే మొదటి డోసు ఇస్తారు. మొదటి డోసు తీసుకున్న 29 రోజుల తరువాత మరోసారి వచ్చి రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. రెండుసార్లు డోసులు పూర్తయిన తరువాత 57, 90, 180 రోజుల్లో వ్యాక్సిన్‌ తీసుకున్న వలంటీర్లు రావాల్సి ఉంటుంది. ఆయా సందర్భాల్లో వారి నుంచి రక్త నమూనాలను సేకరించి పుణెలోని ఇన్‌స్టిట్యూట్‌కు పంపిస్తారు. ప్రయోగాలు జరిగే రోజుల్లో వలంటీర్లు అందుబాటులో ఉండాలి. అనివార్య కారణాల వల్ల ఎవరైనా అందబాటులో లేకపోతే వారు ప్రయోగాల నుంచి తప్పుకున్నట్టుగా భావిస్తారు. తదుపరి దశకు వారిని అనుమతించరు. 


75 మందికే వ్యాక్సిన్‌

వ్యాక్సిన్‌ తీసుకునే వ్యక్తి పేరు గోప్యంగా వుంచుతారు. ప్రతి ఒక్కరికీ భిన్నమైన కోడ్‌ ఇస్తారు. అదే కోడ్‌తో సంబంధం కలిగిన వ్యాక్సిన్‌ ఇస్తారు. అయితే, వంద మందిలో 75 మందికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇచ్చి, మిగిలిన 25 మందికి ఇవ్వరు. ఎవరికి వ్యాక్సిన్‌ ఇచ్చిందీ, ఎవరికి వ్యాక్సిన్‌ ఇవ్వలేదన్నది వైద్యులకు, వలంటీర్లకు కూడా తెలియదు. కోడింగ్‌తో వచ్చిన ఆ బాటిళ్లు, ఇక్కడ వలంటీర్లకు ఇచ్చిన కోడ్‌లను సీరం ఇన్‌స్టిట్యూట్‌లో డీ కోడింగ్‌ చేసి ఆరు నెలల తరువాత ఫలితాలను విశ్లేషిస్తారు. పరిశోధన జరిగే క్రమంలో వలంటీర్లకు ఏదైనా అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు వస్తే సేవలందించేందుకు అందుబాటులో ఇద్దరు వైద్యులు ఉంటారు. అనివార్య కారణాల వల్ల మరణమో, ఇతర అనారోగ్య సమస్యలు వేధిస్తే... ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం నష్టపరిహారం చెల్లించేలా ఒప్పందం ఉంటుంది. 

Read more