నగర పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన
ABN , First Publish Date - 2020-09-14T09:00:56+05:30 IST
నగరంలో పోలీస్ వ్యవస్థ ప్రక్షాళనపై సీపీ మనీష్‌కుమార్‌సిన్హా దృష్టి సారించారు.
సీఐల బదిలీలపై సీపీ కసరత్తు
కమిషరేట్ పరిధిలో పాతుకుపోయిన, ఆరోపణలున్న వారి జాబితా తయారీ
రేంజ్‌కు సరెండ్ చేయాలని నిర్ణయం
ఏజెన్సీ, మైదాన ప్రాంతంలో పనిచేస్తున్న వారికి నగరంలో అవకాశం
అతిత్వరలో భారీ ఎత్తున బదిలీలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): నగరంలో పోలీస్ వ్యవస్థ ప్రక్షాళనపై సీపీ మనీష్‌కుమార్‌సిన్హా దృష్టి సారించారు. ఏళ్ల తరబడి నగరంలోనే పాతుకుపోయిన సీఐలతోపాటు వివిధ రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని రేంజ్‌కు సరెండర్ చేయాలని నిర్ణయించారు. అలాగే నగరంలో పనిచేసే అవకాశం లభించక.... చాలా కాలంగా మైదాన ప్రాంతం, ఏజెన్సీలో పనిచేస్తున్న వారిలో సమర్థులు, నిజాయితీపరులను కమిషనరేట్ పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు సమాచారం.
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పోలీస్‌స్టేషన్లు 23, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు తొమ్మిది ఉన్నాయి. వీటికి సీఐలే స్టేషన్ హౌస్ ఆఫీసర్లు(ఎస్‌హెచ్‌ఓలు)గా వ్యవహరిస్తున్నారు. ఇవికాకుండా క్రైమ్, సీసీఎస్, సీసీఆర్‌బీ, స్పెషల్ బ్రాంచి, సీటీసీ వంటివి మరో 20 వరకూ ఉన్నాయి. కాగా విశాఖ రేంజ్ పరిధిలో పనిచేస్తున్న ఎస్‌ఐలు, సీఐల్లో ఎక్కువ మంది పోలీసు కమిషనరేట్ పరిధిలోకి బదిలీ చేయించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అన్నిరకాల సౌకర్యాలతోపాటు కొన్ని ‘అదనపు ప్రత్యేకతలు’ వుండడమే ఇందుకు కారణం. ఒకసారి నగరంలో పోస్టింగ్ దక్కించుకుంటే తిరిగి రేంజ్‌లోకి వెళ్లడానికి ఇష్టపడడం లేదు. ఒకవేళ రేంజ్‌కు బదిలీ చేస్తున్నట్టు ఏమాత్రం ఉప్పందినా.... అధికార పార్టీ ప్రజాప్రతినిధులను ఆశ్రయించి బదిలీ కాకుండా చూసుకుంటుంటారు.
ఇదిలావుండగా నగరంలో పనిచేస్తున్న సీఐలలో కొంతమంది విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు, మరికొందరు అవినీతికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వున్నాయి. దీనివల్ల బాధితులకు సకాలంలో న్యాయం జరగకపోగా పోలీస్ శాఖకు చెడ్డపేరు వస్తున్నది. ఈ నేపథ్యంలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే ముద్రపడిన సీపీ మనీష్‌కుమార్‌సిన్హా... నగర పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నగరంలో పనిచేస్తున్న సీఐలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నవారిని, దీర్ఘకాలంగా నగరంలోనే పాతుకుపోయిన సీఐలను గుర్తించి ఒక జాబితాను తయారు చేశారని సమాచారం. వీరందరినీ అతిత్వరలోనే రేంజ్‌కు సరెండర్ చేసే అవకాశం ఉంది. వీరిస్థానంలో సుదీర్ఘకాలంగా ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో పనిచేస్తూ, సమర్థులుగా, నిజాయితీ పరులుగా పేరున్న సీఐలను కమిషనరేట్ పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
భవిష్యత్తులో పరిపాలనా రాజధాని ఏర్పాటైతే అప్పటికప్పుడు ఇబ్బందులు పడకుండా ఇప్పటి నుంచే పోలీస్ శాఖను పటిష్ట పరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సీపీ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుండడంతో సీఐల బదిలీలు ఖాయమని కమిషనరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. హర్బర్ సీఐగా పనిచేస్తున్న శ్యామలరావు, గాజువాక ట్రాఫిక్ సీఐ వాసుదేవ్‌కు ఇప్పటికే డీఎస్పీలుగా పదోన్నతులు రావడంతో ఆ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. దక్షిణ, ఉత్తర నియోజకవర్గాల పరిధిలోని రెండు పోలీసు స్టేషన్లకు చెందిన సీఐలు నగరంలో పనిచేసేందుకు విముఖంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఎయిర్‌పోర్టు సీఐ వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉన్నారు. నార్త్‌సబ్‌డివిజన్‌లో ఒక సీఐపై లైంగిక ఆరోపణలు ఉన్నాయి. ద్వారకా సబ్‌డివిజన్‌లోని ఒక సీఐ సమర్థంగా పనిచేయలేకపోతున్నారనే అభిప్రాయం ఉన్నతాధికారుల్లో ఉంది. వీటన్నింటినీ పరిశీలించి భారీస్థాయిలోనే సీఐల బదిలీలు జరగవచ్చని పోలీస్‌వర్గాలు భావిస్తున్నాయి.