నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా బదిలీ
ABN , First Publish Date - 2020-08-12T10:07:20+05:30 IST
విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనాకు బదిలీ అయ్యింది. ఆయన్ను మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ ..

కొత్త సీపీ మనీశ్ కుమార్ సిన్హా
విశాఖపట్నం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనాకు బదిలీ అయ్యింది. ఆయన్ను మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాల్సిందిగా మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీఅయ్యాయి. కొత్త పోలీస్ కమిషనర్‌గా మనీశ్‌కుమార్ సిన్హాను నియమించారు. సిన్హా 2000 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి. ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేస్తూ విశాఖపట్నం వస్తున్నారు. ఈయన సీబీఐలో డీఐజీ క్యాడర్లో ఎయిర్‌సెల్ కేసు విచారణలో కీలక భూమిక పోషించిన అధికారిగా గుర్తింపుపొందారు.
రెండు నెలల కిందట పదోన్నతి
ఆర్కే మీనా గత ఏడాది జూన్ 27న సిటీ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన హయాంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ మరిన్ని హంగులు సమకూర్చుకుంది. సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటైంది. మహిళల కోసం ప్రత్యేకంగా పోలీస్‌స్టేషన్ ఏర్పాటుచేశారు. రెండు నెలల కిందట ఆయనకు అదనపు డీజీపీగా పదోన్నతి వచ్చినప్పటికీ సీపీగా ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించింది. కాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖ పర్యటనకు వచ్చినపుడు విమానాశ్రయంలో జరిగిన వివాదం హైకోర్టు వరకు వెళ్లింది. అలాగే డాక్టర్ సుధాకర్ కేసు కూడా సంచలనమైంది.