గుండెపోటుతో సీఐ శ్రీనివాసరావు మృతి
ABN , First Publish Date - 2020-12-06T04:48:55+05:30 IST
నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రెడ్డి శ్రీనివాసరావు శనివారం హఠాన్మరణం చెందారు.

మహారాణిపేట, డిసెంబరు 5: నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రెడ్డి శ్రీనివాసరావు శనివారం హఠాన్మరణం చెందారు. అనారోగ్యం కారణంగా గత కొన్నాళ్లుగా ఆయన సెలవులో ఉన్నారు. కోలుకోవడంతో మూడు రోజుల్లో విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం బుచ్చయ్యపేట సమీపంలోని ఓ ఆలయానికి వెళ్లిన ఆయన అక్కడ కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. గుండెపోటుతో ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు.
1995 ఎస్ఐ బ్యాచ్‌కి చెందిన శ్రీనివాసరావుకు 2010లో సీఐగా పదోన్నతి లభించింది. అనంతరం శ్రీకాకుళం జిల్లా అమదాలవలస, రాజాం, విశాఖ ఎయిర్‌పోర్టు, సీసీఎస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. మూడు నెలల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి సెలవులో ఉన్నారు. అనారోగ్యం నుంచి బయటపడడంతో ఈనెల 8వ తేదీన విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే విషాదం జరిగిపోయిందని సహచరులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. చోడవరం నియోజకవర్గం బంగారంమెట్ట ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విశాఖ నగరంలోనే నివాసం ఉంటున్నారు.