కొండెక్కిన కోడి ధర.. స్కిన్‌లెస్ కిలో ఎంతంటే...
ABN , First Publish Date - 2020-09-03T13:01:19+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుందని జనం కోడి మాంసం

- స్కిన్‌లెస్ కిలో రూ.234
- నాలుగు రోజులుగా పెరుగుతున్న ధర
- డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేకపోవడమే కారణం
- కరోనాతో భారీగా పెరిగిన వినియోగం
విశాఖపట్నం : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుందని జనం కోడి మాంసం, గుడ్డు వినియోగం పెంచారు. అయితే అందుకు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ సమయంలో కొన్ని పౌల్ట్రీ కంపెనీలు మూతపడ్డాయి. మరికొన్ని ఉత్పత్తి తగ్గించాయి. రైతులు 80 శాతం వరకు కోళ్ల పెంపకానికి స్వస్తి పలికారు. దీంతో చాలా ఫారాల్లో కోళ్లు లేవు. మరికొన్నిచోట్ల అరకొరగా మాత్రమే వుండడంతో కొరత వచ్చింది. ప్రస్తుతం వున్న మార్కెట్ డిమాండ్‌కు కోళ్లు సరిపోవడం లేదు. సాధారణంగా రెండు కిలోల బరువు కలిగిన కోళ్లనే మార్కెట్‌కు పంపిస్తారు. అటువంటిది కొరత నేపథ్యంలో సగటున 1.6/1.7 కిలోల బరువుండే కోళ్లను కూడా విక్రయించేస్తున్నారు. కోళ్ల కంపెనీల ప్రతినిధుల లెక్కల ప్రకారం ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోని ప్రజలు వారానికి 20 లక్షల నుంచి 25 లక్షల కిలోల చికెన్ వినియోగిస్తారు. కానీ ప్రస్తుతం పది లక్షల కిలోలు మాత్రమే అందుబాటులో ఉన్నది. దీంతో వారం రోజులుగా ధర క్రమేపీ పెరుగుతోంది.
గురువారం మార్కెట్‌లో విత్ స్కిన్ కిలో రూ.224, స్కిన్‌లెస్ రూ.234గా నిర్ణయించారు. ఈ వారాంతానికి ఽధర మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కనీసం మరో పదిహేను రోజులకు గానీ కోళ్ల సరఫరా పెరగదని చెబుతున్నారు. అయితే కరోనా వైరస్ వల్ల చికెన్ వినియోగం పెరిగినందున, రానున్న పక్షం రోజుల్లో సరఫరా పెరిగినా డిమాండ్‌ను తగ్గట్టు అందించడం కష్టమేనని కోళ్ల రైతు ఒకరు వ్యాఖ్యానించారు. కరోనా వల్ల చికెన్ అమ్మకాలు 20 నుంచి 25 శాతం వరకు పెరిగాయి. అందువల్ల రెండు నెలలు గడిస్తే తప్ప మార్కెట్‌ను అందుకోలేమని బ్యాగ్ ప్రతినిధి ఒకరు అంచనా వేశారు. కాగా గుడ్ల వినియోగం కూడా బాగా పెరిగింది.