చెట్టెక్కి మతిస్థిమితం లేని వ్యక్తి కలకలం
ABN , First Publish Date - 2020-12-30T05:19:23+05:30 IST
మతిస్థిమితం లేని ఓ వ్యక్తి సోమవారం రాత్రి సింథియా జంక్షన్ నుంచి షిప్‌యార్డు మెయిన్ గేటుకు వెళ్లే మార్గంలో ఉన్న ఓ మర్రిచెట్టు చిటారు కొమ్మపై కూర్చుని కలకలం రేపాడు.
మల్కాపురం, డిసెంబర్ 29 : మతిస్థిమితం లేని ఓ వ్యక్తి సోమవారం రాత్రి సింథియా జంక్షన్ నుంచి షిప్‌యార్డు మెయిన్ గేటుకు వెళ్లే మార్గంలో ఉన్న ఓ మర్రిచెట్టు చిటారు కొమ్మపై కూర్చుని కలకలం రేపాడు. మల్కాపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ మతిస్థిమితం లేని వ్యక్తి షిప్‌యార్డు మెయిన్ గేటుకు వెళ్లే మార్గంలోని మర్రి చెట్టుపైకి సోమవారం రాత్రి ఎక్కాడు. ఆ చెట్టు చిటారు కొమ్మపై కూర్చున్నాడు. అయితే అతను మంగళవారం ఉదయం పెద్దగా కేకలు వేస్తుండడంతో స్థానికులు గమనించారు. వెంటనే 100కు డయల్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో మల్కాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని గమనించారు. నేవల్ డాక్‌యార్డు, పెదగంట్యాడ అగ్నిమాపక కేంద్రాలకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో ఆ రెండు కేంద్రాల సిబ్బంది అక్కడికి వచ్చి అగ్నిమాపక శకటంలోని నిచ్చెన సహాయంతో చెట్టు పైకి వెళ్లి అక్కడ ఉన్న వ్యక్తిని జాగ్రత్తగా కిందకు తీసుకొచ్చారు. కిందకు వచ్చిన తరువాత ఆ వ్యక్తి సిబ్బంది నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ సిబ్బంది విడిచిపెట్టకుండా మల్కాపురం పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతనిని నగరంలోని మానసిక వైద్యశాలకు తరలించారు. అయితే తాను ఎవరు?, ఎక్కడి నుంచి వచ్చాడు అనే వివరాలను అతను చెప్పలేకపోతున్నాడు. తూర్పు నౌకాదళానికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అందరిలో భయం నెలకొంది.
