వద్దన్నా.. క్యూ కడుతున్న పర్యాటకులు
ABN , First Publish Date - 2020-11-15T05:30:00+05:30 IST
కరోనా ఉధృతి తగ్గే వరకు ప్రకృతి అందాలు తిలకించేందుకు ఏ ఒక్కరూ గ్రామానికి రావద్దని స్థానికులు ప్రచారం చేస్తున్నప్పటికీ పర్యాటకులు చెరువులవేనం సందర్శించేందుకు క్యూ కడుతున్నారు.

ఆకట్టుకుంటున్న చెరువులవేనం ప్రకృతి సౌందర్యం
అడ్డుకున్న చెరువులవేనం గ్రామస్థులు
నచ్చజెప్పి.. ఎంజాయ్ చేసిన పర్యాటకులు
చింతపల్లి, నవంబరు 15: కరోనా ఉధృతి తగ్గే వరకు ప్రకృతి అందాలు తిలకించేందుకు ఏ ఒక్కరూ గ్రామానికి రావద్దని స్థానికులు ప్రచారం చేస్తున్నప్పటికీ పర్యాటకులు చెరువులవేనం సందర్శించేందుకు క్యూ కడుతున్నారు. ఆంధ్రకశ్మీర్ లంబసింగికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువులవేనంలో అక్టోబరు ఆఖరి వారం నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకూ మంచు మేఘాలు కనువిందు చేస్తుంటాయి. ఈ మంచు మేఘాలను ఆస్వాదించేందుకు నాలుగేళ్లుగా పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కరోనా కారణంగా గ్రామానికి పర్యాటకులు రావద్దని స్థానికులు తీర్మానించి, పలుచోట్ల ఫ్లెక్సీలు కూడా ఏర్పాటుచేశారు. అయితే దీపావళికి సెలవులు రావడంతో పర్యాటకులు ఆదివారం చెరువులవేనంకి తరలివచ్చారు. స్థానికులు అనుమతించకపోగా.. తాము ఎంతోదూరం నుంచి వచ్చామని, కనీసం రహదారి లేకపోయినా కొండపైకి వచ్చామని బతిమలాడడంతో ఆదివాసీలు అనుమతించారు. దీంతో ఆదివారం పర్యాటకులకు చెరువులవేనం సందడిగా కనిపించింది. ప్రకృతి అందాలను అస్వాదిస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేశారు.