చేతులెత్తేసిన చీటీల నిర్వాహకులు

ABN , First Publish Date - 2020-11-20T05:05:01+05:30 IST

ధి చీటీల బాగోతం మరొకటి వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు చీటీలు నిర్వహించగా, అందులో ఒకరు పరారు కావడంతో లబోదిబోమంటూ బాధితులు గురువారం రాత్రి నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించారు.

చేతులెత్తేసిన చీటీల నిర్వాహకులు
పోలీసు స్టేషన్‌ ఎదుట గుమిగూడిన బాధితులు

రూ.50 లక్షలకు టోకరా...ఒక కుటుంబం పరారు

పోలీసులను ఆశ్రయించిన బాధితులు

సీతంపేట, నవంబరు 19: వీధి చీటీల బాగోతం మరొకటి వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు చీటీలు నిర్వహించగా, అందులో ఒకరు పరారు కావడంతో లబోదిబోమంటూ బాధితులు గురువారం రాత్రి నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. వీరు చెల్లించాల్సింది దాదాపు రూ.50 లక్షల మొత్తమని తేలింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు... అక్కయ్యపాలెం చాకలిపేటకు చెందిన మునిస్వామి మునిస్వామి పెద్ద కోడలు లక్ష్మి, చిన్న కోడలు జ్యోతితోపాటు జ్యోతి తల్లి పి.కనకలు గత కొన్నేళ్లుగా స్థానికంగా రూ.100, రూ.200, రూ.500ల చీటీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కొన్నాళ్లుగా దసరా, శ్రావణమాసం చీటీల డబ్బు పాడుకున్న వారికి చెల్లించలేదు.


దీంతోడబ్బు రావాల్సిన వారు ఇంటికి వచ్చి నిలదీయడంతో మునిస్వామి పెద్దకొడుకు, కోడలు కొంతమొత్తం డబ్బు తీసుకుని పరారయ్యారు. దీంతో బాధితులు మునిస్వామి ఇంటికి వచ్చి చీటీల నిర్వాహకుల్లో ఒకరైన చిన్నకోడలిని నిలదీశారు. అయితే ఆమె తనకు సంబంధం లేదని, నిర్వహణ అంతా లక్ష్మీ, ఆమె భర్త చేస్తున్నారంటూ ఎదురు తిరగడంతో బాధితులకు ఏం చేయాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించారు. వాస్తవానికి కొన్నిరోజుల క్రితం నుంచే బాధితులు చీటీల నిర్వాహకులను నిలదీస్తున్నారు. దీంతో మునిస్వామి ఇల్లు అమ్మి అందరి అప్పులు తీరుస్తానని హామీ ఇవ్వడంతో వైసీపీ నాయకురాలు పీలా వెంకటలక్ష్మి సమక్షంలో అంగీకారానికి వచ్చి ఊరుకున్నారు.


తాజాగా ఇల్లు అమ్మడానికి తాము ఒప్పుకునేది లేదని, పరారైన వారి వద్దే మొత్తం సొమ్ము ఉందంటూ మునిస్వామి చిన్నకోడలు జ్యోతి, ఆమె భర్త ఎదురు తిరగడమేకాక, పీలా వెంకటలక్ష్మి తన మామగారిపై ఒత్తితెచ్చి బలవంతంగా ఇంటి అమ్మకానికి సంతకాలు చేయించారంటూ పోలీస్‌ స్టేషన్‌లో ఎదురు పిటిషన్‌ వేయడంతో కథ అడ్డం తిరిగింది. బాధితులంతా మళ్లీ వెంకటలక్ష్మిని ఆశ్రయించి స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో సీఐ ప్రేమ్‌బాబు బాధితులను, చీటీల నిర్వాహకుల్లో ఒకరైన జ్యోతి, ఆమె భర్తను విచారించారు. పీలా వెంకటలక్ష్మితో కూడా మాట్లాడి వాస్తవాలు తెలుసుకున్నారు. అనంతరం సీఐ మాట్లాడుతూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును స్వర్ణభారతి స్టేడియంలో ఉన్న ప్రీ లిటిగేషన్‌ కౌన్సిల్‌ ఫోరంకి పంపిస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-11-20T05:05:01+05:30 IST