టీడీపీలో కొత్త చర్చ.. మహానాడులోనే క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు..!

ABN , First Publish Date - 2020-05-30T18:44:16+05:30 IST

క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్ట పరిచే దిశగా తెలుగుదేశం అధిష్ఠానం కొత్త ఆలోచనలకు నాంది పలకనున్నది. ఇప్పటివరకు జిల్లాస్థాయి కమిటీలు ఉండగా, ఇకపై పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఉంటాయి. ఒక జిలాల్లో వున్న

టీడీపీలో కొత్త చర్చ.. మహానాడులోనే క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు..!

పార్లమెంటరీ కమిటీలు.. టీడీపీ యోచన

మహానాడులో అధినేత చంద్రబాబు ప్రకటన

ప్రతి లోక్‌సభ నియోజక వర్గానికి ఒక కార్యవర్గం

విశాఖపట్టణం జిల్లాలో మూడు కమిటీలు

జిల్లా స్థాయిలో ఒక సమన్వయ కమిటీ

క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టానికి కొత్త ఆలోచనలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్ట పరిచే దిశగా తెలుగుదేశం అధిష్ఠానం కొత్త ఆలోచనలకు నాంది పలకనున్నది. ఇప్పటివరకు జిల్లాస్థాయి కమిటీలు ఉండగా, ఇకపై పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఉంటాయి. ఒక జిలాల్లో వున్న లోక్‌సభ నియోజకవర్గ కమిటీలను కలిపి జిల్లాస్థాయిలో సమన్వయ కమిటీని ఏర్పాటుచేస్తారు. దీనివల్ల కేడర్‌కు, నాయకుల మధ్య అంతరం తగ్గుతుందని, నేతల్లో జవాబుదారీతనం పెరుగుతుందని అధినాయకత్వం భావిస్తున్నది. ఈ వివరాలను జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మహానాడులో వెల్లడించడంతో కొత్త తరహా కమిటీలపై జిల్లాలో చర్చ జరుగుతున్నది.


విశాఖ జిల్లా స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా ఇప్పటివరకు గ్రామ, మండల, జిల్లాస్థాయి కమిటీలు పనిచేస్తున్నాయు. వీటికి చేదోడు వాదోడుగా మహిళ, రైతు, యువత, విద్యార్థి, కార్మిక, తదితర అనుబంధ సంఘాలు ఉన్నాయి. జిల్లా కమిటీలో అధ్యక్షుడే కీలకం. పార్టీలో సీనియర్‌, రాజకీయంగా బలమైన వ్యక్తులకు ఈ పదవికి ఎన్నుకోవడం తెలుగుదేశంలో ఆనవాయితీగా వస్తున్నది. సంస్థాగత ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడితోపాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకుంటున్నారు. విశాఖ, విజయవాడ వంటి పెద్ద నగరాలు వున్న జిల్లాల్లో అర్బన్‌, రూరల్‌కు వేర్వేరుగా కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో అర్బన్‌ కమిటీకి దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. రూరల్‌ జిల్లా అధ్యక్ష పదవికి పంచకర్ల రమేశ్‌బాబుకు రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఖాళీగా ఉంది. తాజాగా నిర్వహించిన పార్టీ మహానాడులో చంద్రబాబు ప్రతిపాదనతో జిల్లాలో విశాఖ, అనకాపల్లి, అరకు పార్లమెంటరీ నియోజకవర్గాలకు వేర్వేరుగా కమిటీలు ఏర్పాటు అవుతాయి.  


విశాఖ పార్లమెంట్‌ పరిధిలో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లు విశాఖ జిల్లాలో, ఒకటి విజయనగరం జిల్లాలో ఉంది. ప్రస్తుతం అర్బన్‌ జిల్లా అధ్యక్షునిగా ఎమ్మెల్యే గణేశ్‌కుమార్‌ ఉన్నారు. కొత్త కమిటీలో కూడా ఇతనికే అవకాశం ఉంటుందా? లేకపోతే గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు ఛాన్స్‌ ఇస్తారా? అన్నది అధినాయకత్వం నిర్ణయించాలి. అర్బన్‌ అధ్యక్ష పదవికి గతంలో పోటీపడిన చోడె పట్టాభి, కాకి గోవిందరెడ్డి, నజీర్‌ పేర్లు పరిశీలిస్తారా? అన్నది వేచి చూడాలి. 


అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం మొత్తం విశాఖ జిల్లాలోనే ఉంది. పూర్తిగా గ్రామీణ ప్రాంతం కావడం, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో బలమైన కమిటీని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ పార్లమెంటరీ కమిటీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై జిల్లాకు చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, ఇతర సీనియర్ల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటారు. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాడుగుల మాజీ ఎమ్మెల్యే జి.రామానాయుడుతోపాటు పార్టీలో ఇతర సీనియర్ల పేర్లు పరిశీలించే అవకాశం ఉంది. 


అరకు పార్లమెంటరీ కమిటీ బాధ్యతలు విశాఖ జిల్లాకు అప్పగిస్తే పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ పేర్లు పరిశీలించే అవకాశం ఉంది. అరకు పార్లమెంట్‌ పరిధిలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు వున్న విజయనగరం జిల్లాకు ఇవ్వాలనుకుంటే మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, జనార్దన్‌ థాట్రాజ్‌, తదితరుల పేర్లు పరిగణనలోకి తీసుకుంటారని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాగా పార్లమెంట్‌ నియోజకవర్గాల కమిటీలతో జిల్లాస్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటుచేస్తారు.  కాగా పార్లమెంట్‌ నియోజకవర్గాల కమిటీలతో జిల్లాస్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తారు.

Updated Date - 2020-05-30T18:44:16+05:30 IST