కేంద్రం రాయితీ... చెరకు రైతుకు చేరేనా?

ABN , First Publish Date - 2020-12-18T05:18:16+05:30 IST

పంచదార ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం రూ.3,500 కోట్లు ప్రోత్సాహక రాయితీ ప్రకటించడంతో చెరకు రైతులకు, షుగర్‌ ఫ్యాక్టరీలకు ఏ మేరకు లబ్ధి చేకూరుతుందనే దానిపై చర్చ సాగుతోంది.

కేంద్రం రాయితీ... చెరకు రైతుకు చేరేనా?
పంచదార బస్తాలు

చెరకు రైతుకు చేరేనా?

పంచదార ఎగుమతులపై రూ.3,500 కోట్ల

ప్రోత్సాహక రాయితీ ప్రకటించిన కేంద్రం

నాణ్యమైన సరకు అయితేనే ఎగుమతికి అవకాశం

సహకార ఫ్యాక్టరీల పంచదార నాణ్యత అంతంతమాత్రమే

ప్రైవేటు ఫ్యాక్టరీలు లేదా వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి


చోడవరం, డిసెంబరు 17: పంచదార ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం రూ.3,500 కోట్లు ప్రోత్సాహక రాయితీ ప్రకటించడంతో చెరకు రైతులకు, షుగర్‌ ఫ్యాక్టరీలకు ఏ మేరకు లబ్ధి చేకూరుతుందనే దానిపై చర్చ సాగుతోంది. సహకార షుగర్‌ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి అవుతున్న పంచదార...ఎగుమతి ప్రమాణాల స్థాయిలో లేకపోవడంతో కేంద్రం ప్రకటించిన రాయితీ వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చునని యాజమాన్యాలు అంటున్నాయి. కొన్ని ప్రైవేటు ఫ్యాక్టరీల్లో అత్యంత నాణ్యమైన పంచదార ఉత్పత్తి అవుతున్నదని, కేంద్రం ఇచ్చే రాయితీ వాటికి కలిసి వస్తుందని చెబుతున్నారు. పంచదార ఎగుమతులపై సుంకం అధికంగా వుండడంతోపాటు అమ్మకాలపై కేంద్రం సీలింగ్‌ విధించడంతో దేశంలో పంచదార నిల్వలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దీనివల్ల పంచదార ధరల్లో పెరుగుదల లేదు. కేంద్రం క్వింటా పంచదార కనీస మద్దతు ధర రూ.3100గా నిర్ణయించినప్పటికీ రెండేళ్ల నుంచి క్వింటా రూ.3,400లకు మించడం లేదు. ఉత్పత్తి వ్యయం క్వింటాకు రూ.3,800 వరకు అవుతున్నది. ఈ కారణాల వల్ల సహకార ఫ్యాక్టరీలకు నిధుల కొరత ఏర్పడి రైతులకు చెరకు డబ్బులు, కార్మికులకు వేతనాలు సకాలంలో ఇవ్వలేకపోతున్నాయి. పంచదారను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవాల్సి వస్తున్నది. అప్పులకు వడ్డీలు చెల్లించాల్సి రావడంతో ఆదాయ, వ్యయాల మధ్య అంతరం పెరిగిపోతున్నది. దాదాపు అన్ని షుగర్‌ ఫ్యాక్టరీలు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయాయి. ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం...పంచదార ఎగుమతులకు రూ.3,500 కోట్ల రాయితీ ఇస్తామని ప్రకటించింది. క్వింటాకు రూ.600 రాయితీ ఇచ్చి, ఇది ఆయా రైతులకు అందేలా చూస్తామని వెల్లడించింది. అయితే కేంద్రం ప్రకటించిన ఈ సాయం సహకార ఫ్యాక్టరీలకు ఎంతవరకు అందుతుందో తెలియని పరిస్థితి. వాస్తవానికి సహకార షుగర్‌ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి అవుతున్న పంచదార ఎగుమతి ప్రమాణాల స్థాయిలో లేదన్నది వాస్తవం. అందువల్ల ఈ పంచదార దేశీయ మార్కెట్‌కే పరిమితమైంది. కొన్ని ప్రైవేటు ఫ్యాక్టరీలు ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా పంచదారను ఉత్పత్తి చేస్తున్నాయి. కేంద్రం ఇచ్చే ఎగుమతి రాయితీ వల్ల ఇటువంటి ఫ్యాక్టరీలకు లబ్ధి చేకూరుతుందని సహకార చక్కెర ఫ్యాక్టరీల యాజమాన్యాలు అభిప్రాయపడుతున్నాయి. 


ఇదిలావుండగా కేంద్రం ఇచ్చిన రాయితీ వల్ల ఎంతోకొంత లబ్ధి పొందాలంటే సహకార షుగర్‌ ఫ్యాక్టరీలు...పంచదార ఎగుమతి చేసే ప్రైవేటు షుగర్‌ ఫ్యాక్టరీలపైనో లేదా ఎగుమతి వ్యాపారులపైనో ఆధారపడాల్సి ఉంటుంది. కేంద్రం ఇచ్చే ఎగుమతి ఆర్డర్‌ను....పంచదార ఎగుమతి చేసే వ్యాపారులకు, లేదంటే ప్రైవేటు షుగర్‌ ఫ్యాక్టరీలకు ఇచ్చి, కేంద్రం మంజూరుచేసే రాయితీ సొమ్ములో కొంత వాటా తీసుకోవడం మినహా మరో మార్గం లేదు. అయితే ఆయా ప్రైవేటు ఫ్యాక్టరీలు లేదా వ్యాపారులు....కేంద్రం ఇచ్చే రాయితీ సొమ్ముని సహకార ఫ్యాక్టరీలకు ఎప్పుడు ఇస్తాయనేది ప్రశ్నార్థకం. ఇటువంటి పరిస్థితుల్లో పంచదార ఎగుమతులపై కేంద్రం ఇచ్చే రాయితీ...సహకార చక్కెర ఫ్యాక్టరీలకు, చెరకు రైతులకు ఎంత మేర ప్రయోజనం కలుగుతుందో అంచనా వేయలేని పరిస్థితి. పంచదార విక్రయాలపై ఆంక్షలు ఎత్తివేయకుండా ఇటువంటి రాయితీలు ఎన్ని ఇచ్చినా సహకార షుగర్‌ ఫ్యాక్టరీలకు ఒనగూరే ప్రయోజనం పెద్దగా వుండబోదని యాజమాన్య వర్గాలు అంటున్నాయి.  


Updated Date - 2020-12-18T05:18:16+05:30 IST