సర్కారు భూమిలో సిమెంటు షెడ్లు?

ABN , First Publish Date - 2020-12-28T05:16:27+05:30 IST

ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సర్కారు భూమిలో సిమెంటు షెడ్లు?
ఎరకన్నపాలెం వద్ద ప్రభుత్వ భూమిలో నిర్మించిన షెడ్లు

         

 నల్లక్వారీ కార్మికులకు ఏడేళ్ల పాటు అద్దెకిచ్చిన అధికార పార్టీ నాయకుడు! 

  నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న అధికారులు 


మాకవరపాలెం, డిసెంబరు 27 : ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  మండలంలోని రాచపల్లి రెవెన్యూ ఎరకన్నపాలెం, చినరాచపల్లి, వెంకయ్యపాలెం, జి.వెంకటాపురం గ్రామాలకు ఆనుకుని సర్వే నంబరు 737లో 1400 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని రైతులు గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటూ.. పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు.  ఇటీవల రాచపల్లికి చెందిన అధికార పార్టీ నాయకుడు ఎరకన్నపాలెం వద్ద భూమిలో సిమెంటు ఇటుకులతో రేకుల షెడ్లు నిర్మించి, పక్కనే ఉన్న నల్లరాయి క్వారీలో పనిచేస్తున్న సిబ్బందికి అద్దెకు ఇచ్చాడు. రెండు షెడ్లును నిర్మించి, 15 గదులుగా ఏర్పాటు చేశాడు. ఏడు సంవత్సరాల పాటు ఏడాదికి రూ.70 వేల చొప్పున అద్దెకు ఇచ్చాడు. ప్రభుత్వ భూమిలో చేపట్టిన నిర్మాణాలకు విద్యుత్‌ మీటర్లు ఇవ్వరాదన్న నిబంధన ఉన్నప్పటికీ , ఈ షెడ్లకు మీటర్లు ఏర్పాటు కావడం గమనార్హం. దీనిపై తహసీల్దార్‌ రాణిఅమ్మాజీని వివరణ కోరగా, ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. నిర్మాణాలు చేపట్టినట్టు తమ దృష్టికి రాలేదని, పరిశీలిస్తామని చెప్పారు. 

Updated Date - 2020-12-28T05:16:27+05:30 IST